పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఫ్యాషన్ దుస్తుల తయారీకి ఉపయోగిస్తూ గొప్ప సామాజిక మార్పుకు నాంది పలికారు 22 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ సారా లఖానీ. ప్లాస్టిక్ వ్యర్థాలతో రీసైకిల్డ్ వస్త్రాలను రూపొందిస్తూ ఫ్యాషన్ రంగంలో సంచలనాన్ని స్రుష్టిస్తున్నారు. ప్రజారోగ్యానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎకో ఫ్రెండ్లీ దుస్తులను తయారుచేస్తున్నారు. పర్యావరణ పరిరక్షకురాలిగా కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ విశేషాలు…
నేటి సమాజంలో ప్లాస్టిక్స్ తో మానవమనుగడ ఎంతగానో ముడిపడి పోయింది. మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలు మనిషి జీవితాలకి, పర్యావరణానికి ఎంత ప్రాణాంతకమో కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలతో వండర్స్ చేస్తోంది ఫ్యాషన్ డిజైనర్ సారా లఖానీ. ఈ వ్యర్థాలతో సమకాలీన ఫ్యాషన్ ట్రెండ్స్ కు ఉపయోగపడే రీసైకిల్డ్ వస్త్రాలను రూపొందిస్తోందామె. వాటి రూపకల్పనలో ప్రక్రుతి, సుస్థిరతల స్ఫూర్తికి ప్రాణం పోస్తోంది. అలా ఆమె చేతుల్లో రూపుదిద్దుకున్న ఫ్యాషన్ వస్త్రాలు ఇటీవల ముంబయిలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్ లో సారా ప్రదర్శించడం, వాటికి ఫ్యాషన్ ప్రియుల నుంచి అనూహ్య స్పందన సైతం వచ్చింది కూడా. టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్ రెండింటి వ్యర్థాలను రీసైక్లింగ్, అప్ సైక్లింగ్ చేయడం ద్వారా తన ఫ్యాషన్ కలెక్షన్లకు వినూత్న రీతిలో ప్రాణంపోశారు. వాటిని ‘ట్రాష్ ఆర్ ట్రెజర్’ టైటిల్ తో లాక్మీ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో ప్రదర్శించి సంచలనం స్రుష్టించారు సారా. తన చుట్టూ ఉన్నప్రక్రుతి, పర్యావరణాల నుంచే ఈ స్పూర్తి తనలో రాజుకుందంటారు సారా. అలాంటి స్ప్రుహ, చైతన్యం ఉన్న వినియోగదారులే లక్ష్యంగా చేపట్టిన ప్రయత్నం ఇదని సారా స్పంష్టంచేశారు.
వ్యర్థాలను ఎలా చూడాలి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనే విషయంలో ప్రపంచమంతా ఎలా భాగస్వామ్యం కావాలనేదాంట్లో విస్త్తుతమైన మార్పుకు ఈ ప్రయత్నం బాట వేయగలదనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. మొదట్లో ప్లాస్టిక్స్ లోని రకాల గురించి సారాకు అస్సలు తెలియదు. వాటిల్లో ఏవి వస్త్రాలకు పనికివస్తాయి, ఏవీ పనికిరావు అనేది కూడా తనకు తెలియదు. ఒక ఫ్యాషన్ డిజైన్ స్టూడెంటుగా వస్త్ర డిజైన్లు అందంగా, స్రుజనాత్మకంగా, ధరించడానికి అనువుగా ఉండాలన్నది తప్ప మరేవీ తనకు తెలియదు. ఆ తర్వాత వాటి విషపరిణామాలు సారాకు తెలిశాయి. అందుకే ప్లాస్టిక్ ను దారంగా, నూలుగా తయారు చేసేందుకు రకరకాల పద్ధతుల్లో ప్రయోగాలు మొదలెట్టింది. అంతేకాదు అలా తయారుచేసిన దారంతో రకరకాల కుట్లను కుట్టగలిగే ప్రయోగాలను కూడా మొదలెట్టింది. ఈ క్రమంలో ఇతర ఎంబ్రాయిడరీ స్టైల్స్ కంటే శతాబ్దాల నాటి కాంతా ఎంబ్రాయిడరీ నీడిల్ వర్కు తన ప్రయత్నాలకు సహకరిస్తుందని గ్రహించింది. ప్లాస్టిక్ నుంచి తయారుచేసిన దారం, నూలు బాగా పనికి వస్తుందని గుర్తించింది. అలా తన కలను నిజం చేసుకోవడంలో సారా విజయం సాధించింది. ఉదాహరణకు పాలిథిన్ వ్యర్థాలతో, క్లాత్ వేస్టుతో తయారుచేసిన బ్యాగులను కాంతా ఎంబ్రాయిడరీలోని సంక్లిష్టమైన జియోమెట్రిక్ పేట్రన్స్ తో కుట్టి డిజైన్ చేసింది. అలా ప్రక్రుతికి, మానవాళికి ప్రాణాంతకమైన ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణ ఫ్రెండ్లీ క్లాత్ మెటీరియల్ గా రూపొందించడమే కాదు దానితో ఆకర్షణీయమైన ఫ్యాషన్ దుస్తుల డిజైనింగ్ చేస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల, చెత్త పట్ల ప్రజలకున్న ద్రుక్కోణంలో మార్పు తేవడంలో సారా విజయవంతమైంది. సారా చేసిన ఈ దుస్తుల్లో డ్రస్సులు, కోర్సెట్స్, టాప్స్, బాటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ రీసైకిల్ చేసిన నూలుతో తయారుచేసినవి. ‘డంప్ యార్డులకు చేరిన వస్త్రాల వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచే వీటిని తయారు చేశా’ అని సారా అంటుంది.
తన ఇంట్లో ఉన్నప్పుడే ప్లాస్టిక్ వ్యర్థాలతో దుస్తుల తయారీ ఆలోచన సారా మదిలో మెరిసింది. నాగపూర్ దగ్గరలో ఒక చిన్న వూరు ఆమెది. ఆమె కుటుంబం మందుల షాపును నడుపుతోంది. అలా మందుల కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వస్తోందనే విషయాన్నిసారా గ్రహించింది. ‘ మాది మందుల షాపు అవడంతో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ మా షాపులో చేరేది. చిన్న వూరు కావడంతో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పోయాలో తెలిసేది కాదు. మా చిన్న వూరిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని తిరిగి వాడే లేదా వాటిని ఏదైనా చేసే సంస్థలు కాని, మనుషులు కానీ లేరు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పరిసరాలను తీవ్రంగా కాలుష్యం చేసి పర్యావరణానికి ప్రమాదకరంగా మారేవి’ అని సారా గుర్తుచేసుకున్నారు. పర్ల్ అకాడమీలో సారా ఫ్యాషన్ కోర్సు చేశారు. ఆ కోర్సులో భాగంగా ఫైనల్ ఇయర్ లో ఒక ప్రాజక్టును విద్యార్థులు సమర్పించాల్సి ఉంటుంది. ఇది సారాకు మంచి అవకాశం అయింది. తన ఊరిలో ప్రత్యక్షంగా చూసిన ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణం దెబ్బతింటున్న అంశాన్నే తన ప్రాజక్టుకి ఎంచుకుంది. అలా మన దేశంలో ఎంత ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయన్నదాని మీద సారా స్టడీ చేసింది. ఆ వ్యర్థాలను ఎన్ని రకాలుగా రీసైకిల్ చేస్తున్నారో కూడా అధ్యయనం చేసింది. ‘అప్పుడే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నా మనసులో పడింది’ అని సారా తెలిపారు. ఆ లక్ష్యంతో సారా ముంబయి, గుజరాత్, రాజస్థాన్ లలో ఉన్న ఎంతోమంది ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తున్న వారిని సంప్రదించింది. వారి నుంచి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలను ఆమె సేకరించింది. ఎంబ్రాయడరీ, నేత విధానాలపై ఎన్నో ప్రయోగాలు చేసింది. తన ప్రాజక్టులో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా వాడాలో కూడా తెలుసుకునే ప్రయత్నంచేసింది. అప్పుడే కాంతా ఎంబ్రాయిడరీ ఆమెకు ఒక దారి చూపిందని చెప్పాలి. ప్రారంభంలో తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్స్ మొత్తాన్ని ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాగులను, మెడిసెన్ బ్లిస్టర్ పేకట్లను తను చేసిన రకరకాల ప్రయోగాలలో వాడింది. ‘ప్లాస్టిక్ బ్యాగుల నుంచి దారం, నూలు తయారుచేశాను. దానితో అన్ని రకాల కుట్లు కుట్టడం, ఎంబ్రాయడరీలను చేయడం, నాట్స్ వేయడం చేశా. అప్పుడే ప్లాస్టిక్ బ్యాగ్స్ నుంచి చేసిన దారం నా ప్రయత్నాలకు పనికి వస్తుందని గుర్తించా. ఇక ఆగలేదు. ఆ తర్వాత ముంబయి, గుజరాత్ లలో ఎంబ్రాయిడరీ వర్కు చేసే పలువురిని సంప్రదించా. నా మనసులోని ఆలోచనలను వారితో పంచుకున్నా. నాకు కావాలసిందేమిటో వారికి వివరంగా చెప్పా.
మొదట్లో వారంతా నా ఆలోచన సాధ్యమయ్యే విషయం కాదని, తాము చేయలేమని చెప్పేశారు. అది చాలా పెద్ద ప్రొసీజర్. మ్యాన్ పవర్ కూడా దానికి ఎక్కువ అవసరమవుతుంది. పైగా ఎంబ్రాయిడరీ చేసే వారు సాధారణంగా కుట్టడానికి సులువుగా ఉండే దారాలతోనే తమ పనిని చేయడానికి ఇష్టపడతారు. దీంతో నా పని కష్టమైంది. ప్లాస్టిక్ బ్యాగుల నుంచి తీసిన దారాన్ని ఎంబ్రాయిడరీ చేయడానికి అనువుగా ఉండేలా చేయడానికి ప్రయత్నించా’ అని సారా తన ఈ ప్రయాణంలోని అనుభవాలను పంచుకున్నారు. చిట్టచివరకు సారా ప్రయత్నాలు ఫలించాయి. ముంబయిలోని ఒక ఎంబ్రాయిడర్ సారాకు సహకరించడానికి అంగీకరించారు. ఇది నిజానికి పెను సవాలుతో కూడుకున్న పని అని సారాకు తెలుసు. కానీ కొలాబరేటివ్ వర్కుతో దీన్ని సాధ్యం చేయొచ్చని సారా భావించింది. ప్రస్తుతం ఒక మెన్స్ వేర్ కలక్షన్ బ్రాండ్ లో జూనియర్ డిజైనర్ గా ఉంటున్న సారా కాస్త అనుభవం సంపాదించాక , ఈ ఇండస్ట్రీలోని నిపుణుల దగ్గర కొంతకాలం పనిచేశాక తన ఆశయాలకు అనుగుణంగా సొంత బ్రాండును ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఆమెకు ఆల్ ది బెస్టు చెబుదామా…