మధ్యప్రదేశ్ కు చెందిన గోండు చిత్రలేఖనం జిఐ ట్యాగ్ పొందిన సందర్భంలో ఆ కళకు వన్నెతెచ్చిన ప్రముఖ పార్థాన్ గోండు కళాకారిణి దుర్గాబాయ్ వ్యాయం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. గోండు కళలో ఆమె నైపుణ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రతిష్ఠాత్మకమైన దేశ పౌర అవార్డు పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది కూడా. గోండు చిత్రకళ గత వైభవం, భవిష్యత్తుల గురించి దుర్గాబాయ్ వ్యక్తంచేసిన కొన్ని అభిప్రాయాలను ఈ సందర్భంగా ఇక్కడ…
గోండు ఆదివాసీల జీవన ‘చిత్రం’ ఈ రంగులకళ. గ్రామజీవనంలోంచి పుట్టి భోపాల్ వంటి నగరాలలో సైతం వికసించిన ఆదివాసీ చిత్రాకళారూపం ఇది. సమకాలీనతా కోణం కూడా ఈ కళలో దాగుంది. గోండు కళలోని డిగ్నా అనే కుడ్యచిత్రకళలో శ్రీమతి దుర్గాబాయ్ వ్యాయంది అందెవేసిన చేయి. దీన్ని ‘భిత్తిచిత్ర’ అంటారు. గోండు చిత్రకళకు జాతీయ,అంతర్జాతీయ ఖ్యాతి రావడంలో దుర్గాబాయ్ క్రుషి కూడా ఎంతో ఉంది. 1990 ల నుంచీ వివిధ మట్టి వర్ణాలలో ఆమె ఆవిష్కరించిన సంప్రదాయ డిగ్నా డిజైన్లు గోండు చిత్రకళా వైభవాన్ని ప్రపంచానికి చాటాయి. ప్రపంచంలోని పలు మ్యూజియంలలో ఆమె చిత్రలేఖనాలు కనిపిస్తాయి. పుస్తకాల్లో సైతం ఆమె వర్ణచిత్రాలు దర్శనమిస్తాయి. అంతేకాదు యానిమేటెడ్ ప్రాజక్టుల్లో సైతం ఆమె వర్ణవిన్యాసాలు చిత్రకారులను అశ్చర్యచకితులను చేస్తాయి.
దుర్గాబాయ్ ఊరు దిండోరి. గోండి చిత్రకళకు చెందిన డిగ్నా డిజైన్లను అక్కడే నేర్చుకున్నారామె. భోపాల్ లోని ఇందిరా గాంధి రాష్ట్రీయ మానవ సంగ్రహాలయ నుంచి ఆమె గోండు చిత్రలేఖనా కెరీర్ మొదలైంది. అలా ప్రారంభమైన ఆమె కళా ప్రయాణం ముఫ్ఫై ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పలు మ్యూజియంలలో, గ్యాలరీలలో ఆమె చిత్రకళ ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కళాకారిణిగా, కమ్యూనిటీ జీవిగా దుర్గాబాయి జీవితం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. పార్థాన్ గోండు కమ్యూనిటీకి చెందిన స్త్రీలు భిత్తిచిత్రను గోడలపై, నేలపై వేయడం ఎన్నో తరాలుగా వస్తున్న సంప్రదాయమని దుర్గాబాయి చెప్పారు. ఇంటి లోగిలిలో రకరకాల మట్టి రంగులను ఉపయోగించి ఈ చిత్రాలను ఆదివాసీ స్త్రీలు వేస్తారుట. అంతేకాదు కోథి అంటే కిచెన్ స్టోర్ రూములో కూడా ఈ వర్ణచిత్రాలను స్త్రీలు తప్పకుండా వేస్తారట.
వివిధ రకాలైన మట్టి రంగులతో డిగ్నా డిజైన్లను జియోమెట్రిక్ రేఖలతో ఆదివాసీ స్త్రీలు వేస్తారని దుర్గాబాయ్ చెప్పారు. రకరకాల ఆక్రుతుల్లో ఈ డిజైన్లు ఉంటాయిట. అంతేకాదు ప్రతి డిజైన్ కు, ఆక్రుతికి, రూపురేఖలకు వెనుక ఒక్కోరకమైన కథ, భిన్న చారిత్రక వారసత్వ మూలాలు ఉంటాయుట. భిత్తిచిత్రతో పాటు హోలీ వంటి పండుగల అలంకరణ కోసం పువ్వుల నుంచి రంగులు తయారుచేసి రంగులను వేస్తారుట. ‘చిన్నతనం నుంచీ నేను డిగ్నా భిత్తిచిత్ర డిజైన్లు వేస్తున్నా. ఈ కళను మొదట మా నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా.
ప్రారంభంలో మా ఇంటి లోగిలిలో ఈ వర్ణచిత్రాలను రకరకాల మట్టి రంగులతో వేసేదాన్ని. ఆ తర్వాత తోటి మహిళలతో కలిసి బయట వేయడం మొదలెట్టా’ అని దుర్గాబాయి గుర్తుచేసుకున్నారు. పెళ్లయిన తర్వాత దుర్గాబాయ్ భర్త సుభాష్, ఇతర కుటుంబసభ్యులతో కలిసి భోపాల్ వచ్చి స్థిరపడ్డారు. ప్రముఖ గోండు కళాకారుడు జంగర్బ్ సింగ్ శ్యామ్ దుర్గాబాయ్ కజిన్. గోండి చిత్రకళలో కొత్త స్టైల్ ను కనుగొన్న కళాకారుడు అతను. అప్పటికే అతను భోపాల్ వచ్చి స్థిరపడ్డాడు. అక్కడే అతనితో కలిసి పనిచేస్తూ దుర్గాబాయ్ తన కళకు మరింత పదును పెట్టుకున్నారు. ‘నన్ను శ్యామ్ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. తోటి కళాకారిణిగా నాలోని స్రుజనాత్మకతను శ్యామ్ ఎంతగానో ప్రోత్సహించారు. నన్ను ఎప్పుడూ మెచ్చుకునేవారు. భూపాల్ వచ్చి సంవత్సరం అయిన తర్వాత నేను శ్యామ్ తో కలిసి భారత్ భవన్ లో పనిచేయడం ప్రారంభించా. మెల్లగా కాన్వాస్ పెయింటింగ్ వేయడం మొదలెట్టా. గౌ పూజ మీద తొలి చిత్రం గీసి దానిని మా దేవుడు ఖార్గాదేవ్ కు అంకితం ఇచ్చా. మొదటిసారి బ్రష్ లు, సింథటిక్ పెయింట్ లు ఉపయోగించా. మొదట్లో డిగ్నా వర్ణచిత్రాలను చిన్న కాన్వాస్ మీద ఎలా వేయాలా అని చాలా భయపడ్డాను. కానీ సక్సెస్ అయ్యా. నా తొలి పెయింటింగ్ చండీఘడ్ లోని ప్రభుత్వ మ్యూజియంలో ఉంది. నా వర్కులోని విజువల్స్ అన్నీ సంప్రదాయ మోటిఫ్స్ తో, చిహ్నాలతో ఉంటాయి.
మా పూర్వికుల జానపద గాథలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఆ బొమ్మల్లో ప్రతిఫలిస్తాయి. మా పురాతన కథలు, చంద్రుడు, సూర్యుడు, వృక్షాలు, జంతువులు, ప్రక్రుతిమాత గురించిన వర్ణనలు, మా గోండి దేవుళ్లు, దేవతల రూపాలు గోండి చిత్రలేఖనంలో దర్శనమిస్తాయి. ఏళ్ల తరబడి ఈ బొమ్మలను గీస్తున్నందువల్ల వచ్చిన అనుభవంతో నా పెయింటింగ్స్ కు స్రుజనాత్మకతను కూడా జోడించి గీస్తాను. 2000 సంవత్సరం నుంచి నేను ఇలస్ట్రేషన్ల్ వేయడం మొదలెట్టా. బుక్ ఇలస్ట్రేషన్స్ తీసుకువచ్చా. ‘ది నైట్ లైఫ్ ఆఫ్ ట్రీస్’ అనే పుస్తకానికి సహ రచయిత్రిగా ఉన్నా. ఈ పుస్తకానికి 2008లో బొలొగ్నా రగాజి అవార్డు కూడా వచ్చింది’ అని దుర్గాబాయ్ తెలిపారు.
బిఆర్ అంబేడ్కర్ జీవితం మీద దుర్గాబాయ్, శ్యామ్ కలిసి ‘‘భీమయానా:ఎక్స్ పీరియన్స్ ఆఫ్ అన్టచబిలిటీ’ పుస్తకం గ్రాఫిక్ రూపంలో తీసుకువచ్చిన వైనం ఎందరో ప్రశంసలు పొందింది. దీనిపై మాట్లాడుతూ భీమయానా కు ఇలస్ట్రేషన్లు వేయడానికి తాము ఎంతగానో కష్టపడ్డామని దుర్గా బాయ్ చెప్పారు. ‘అంబేద్కర్ జీవితం పలు సవాళ్లతో, మరెన్నో ఒత్తిడులతో కూడుకున్నది. ఆయన జీవితాన్ని అర్థంచేసుకోవడం, ఆయన అంటరానితనపు జీవన ప్రయాణాన్ని గీతల్లో ఒడిసిపట్టుకోవడం చాలా కష్టమైన పని. చిట్టచివరకు ఆయన జీవితాన్ని డిగ్నా రేఖల రూపంలో ఆవిష్కరించాలని నేను, శ్యాం పూనుకున్నాం. ఇందులో మా స్వంత కల్పనను కూడా జోడించాం. చాలా కష్టపడ్డాం’ అని దుర్గాబాయ్ గుర్తుచేసుకున్నారు. దుర్గాబాయ్ పిల్లల పుస్తకాలకు (గోండి జానపద కథ మాయి అండ్ ఫ్రెండ్స్) బొమ్మలు వేసారు. సైన్స్ ఫిక్షన్ (రొఖెయా సఖావత్ హొస్సేన్ సుల్తాన్స్ డ్రీమ్ )కు సైతం బొమ్మలు వేశారు.
కంచె ఐలయ్య ‘షెపార్డ్స్ టర్నింగ్ ది పాట్’, టిల్లింగ్ ది ల్యాండ్’ కు కూడా చిత్రాలు వేశారు. తమ చిత్ర కళ అంతా గ్రామీణ జీవితం చుట్టూ, పూర్వీకుల గాథల చుట్టూ అల్లుకుని ఉంటుందని దుర్గాబాయ్ చెప్పారు. పట్టణ ప్రాంత జీవనశైలి కూడా దుర్గాబాయ్ వర్ణచిత్రాలలో కనిపిస్తుంది. దీనిపై మాట్లాడుతూ ‘‘మెల్లమెల్లగా నా చిత్రలేఖనాల్లో పట్టణ జీవితాన్ని కూడా చేర్చడం మొదలెట్టా. పలు సమకాలీన అంశాలపై సైతం నా వర్ణచిత్రాల ద్వారా స్పందించడం ప్రారంభించా.
ఉదాహరణకు అమెరికాలో జరిగిన 9\11 తీవ్రవాదుల దాడుల గురించి రేడియోలో విన్న నేను దానిపై ప్రత్యేక వర్కు వేసి ప్రదర్శించా. అలాగే పెద్ద నగరాలలో జరుగుతున్న సంప్రదాయ ఉత్సవాలు, పెళ్లిళ్ల వంటి వాటిని కూడా నా చిత్రలేఖనాల్లో ఆవిష్కరించడం ప్రారంభించా. అలా నా గోండి కళ ద్వారా సమకాలీన అంశాలపై, సంఘటనలపై స్పందించడం ప్రారంభించా’ అని దుర్గాబాయ్ చెప్పుకొచ్చారు. తమ కళకు స్ఫూర్తి ‘ధర్తి మా’ తో పాటు తమ పూర్వికుల జీవనశైలి అని దుర్గాబాయ్ చెప్తారు. అంతేకాదు తమ కళలో ప్రకృతి పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందంటారామె. చెట్లు, వన్యమ్రుగాల బొమ్మల ద్వారా వాటిని కాపాడాల్సిన ఆవశ్యకతను గురించి తమ చిత్రలేఖనాల్లో చెపుతామని దుర్గాబాయి చెప్పారు.
గోండు కళకు జిఐ ట్యాగ్
మధ్యప్రదేశ్ కు చెందిన గోండ్ కళకు ప్రతిష్ఠాత్మకమైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ లభించింది. నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతానికి చెందిన ఉత్పత్తుల గురించి ఈ ట్యాగ్ తెలియజేస్తుంది. ఆ ఉత్పత్తులు ఆ ప్రాంత విశిష్ట లక్షణాలను ప్రతిఫలించేవిగా ఉంటాయి. ఈ ట్యాగును పారిశ్రామిక ఉత్పత్తులకు, ఆహార ఉత్పత్తులకు, వ్యవసాయ ఉత్పత్తులకు, హస్తకళాక్రతులపై వాడతారు. గోండు ఆర్ట్ కళాకారులు తమ చిత్రకళలో ప్రక్రుతి గురించి , చెట్టు పుట్టల గురించి, జంతువులు, చంద్రుడు, నదులు, గోండు దేవుడు, దేవతల గురించి వర్ణశోభితంగా ఆవిష్కరిస్తారు. అంతేకాదు వాళ్ల ఆహారవిహారాదులు ఏమిటి? ఏ పంటలు పండిస్తారు? వారి రాజులు ఎలా యుద్ధాలు చేసేవారు? తంత్రాలు,మంత్రాల గురించి సైతం తమ చిత్రలేఖనాల్లో గోండు కళాకారులు వేస్తారు. దిండోరి ఈ కళకు పుట్టినిల్లు.