Friday, November 22, 2024
Homeఫీచర్స్Aruna Desai: కొడుకు కోసం ఉద్యమ బాట

Aruna Desai: కొడుకు కోసం ఉద్యమ బాట

స్వలింగ సంపర్కుల వివాహం విషయంపై మనదేశంలో పెద్ద ఎత్తున చర్చనడుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి కొడుకు ఉన్న ఒక తల్లి తనలాంటి మరెందరో తల్లులును ఒకటిగా చేయడంలో ముందుకు రావడమే కాదు స్వలింగసంపర్కుల జీవితాల్లో వెలుగు నింపే గొప్ప పనికి పూనుకుంది. ఆమే అరుణా దేశాయ్. ఆమె గురించిన కథనమే ఇది…
మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దిన తల్లులు ఆ పిల్లలకు భరోసా అయిన జీవితాన్ని ఇవ్వగలుగుతారు. వారిని సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దగలుగుతారు. కానీ కొన్ని సందర్భాలలో సమాజానికి అతీతంగా కూడా తమ పిల్లలకు అండగా నిలబడి వారిని నడిపించాల్సిన బ్రుహత్తర బాధ్యత కొందరు తల్లుల మీద అనూహ్యంగా పడుతుంటుంది. ఆ క్రమంలో సమాజం కన్నా తమ పిల్లల ‘కొత్త’ జీవితాలకు, పరిస్థితులకు అనుగుణమైన రీతిలో తల్లులు వారికి సహకరించినప్పుడు, వారితో కలిసి నడిచినపుడు అది మరింత ఉత్తమ సమాజం వైపుకు దారి వేస్తుంది. అలాంటి తల్లుల కోవలోకి వస్తారు అరుణా దేశాయ్. 59 సంవత్సరాల వయసున్న అరుణా దేశాయ్ హెచ్ ఆర్ ప్రొఫెషనల్.

- Advertisement -

‘స్వీకార్ – ది రెయిన్ బో పేరెంట్స్ కమ్యూనిటీ’ సంస్థ కార్యకలాపాల ద్వారా అరుణ దేశాయ్ ఎంతో సుప్రసిద్ధురాలు. ఎల్జిబిటిక్యూఐఎ+ చిల్డ్రన్ తల్లిదండ్రులకు చెందిన గ్రూపు ఇది. వీరి కోసం అరుణ చేబట్టిన పోరాట ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. ముఖ్యంగా మన సమాజంలో ఇలాంటి పిల్లలకు ఉన్న ఆమోదం అంతంతమాత్రమే. అలాంటి వాళ్లకి సమాజంలో సముచిత స్థానం దక్కేందుకు, వాళ్లు కూడా సమాన హక్కులు పొందేందుకు అరుణ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆమె కొడుకు ‘గే’. తన కొడుకు లాంటి మరెందరికో సమాజంలో సమానహక్కులతోపాటు సాధారణ పౌరులకు మల్లే స్వేచ్ఛ ఉండాలని అరుణా దేశాయ్ భావించారు. అందుకోసం ఆమె ఎంతో ధైర్యంగా ముందడుగు వేశారు. తన కొడుకు గే అని తెలిసిన క్షణం నుంచి అరుణా దేశాయ్ జీవితం ఎన్నో మలుపులు తీసుకుంది. ‘‘ ఇరవైనాలుగేళ్ల వయసులో నాకు పెళ్లయింది. నాకు 27 ఏళ్లప్పుడు మా ఏకైక సంతానం అభిషేక్ జన్మించాడు. నాకు 43 ఏళ్లప్పుడు తను ‘గే’ అనే విషయం మా అబ్బాయి నాకు చెప్పాడు. అప్పటికి నా కొడుకు అభిషేక్ వయసు 17 సంవత్సరాలు. నా కొడుకు ఈ విషయం నాకు చెప్పడానికి రెండు వారాల ముందు దాకా కూడా హోమోసెక్సువాలిటీ అంటే ఏమిటో నాకు తెలియదు. నా కొడుకు, అతని స్నేహితుడు కలిసి దాని గురించి నాకు అర్థమయ్యేలా చెప్పారు. ఆ విషయం చుట్టూ ఉన్న సమస్య అర్థమవడం కోసం వాళ్లు నాకొక కల్పిత కథ కూడా చెప్పారు.

ఆ కథ ఏమిటంటే, తమ కొడుకు ‘గే’ అని తెలిసిన తల్లిదండ్రులు ఒకరు అతణ్ణి ఇంట్లోంచి వెళ్లగొట్టారు. అంతేకాదు అతని జీవితాన్ని వీధిపాలు చేశారు. దీంతో ఆ అబ్బాయి తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, ఆదరించే వారు కరువై ఒంటరితనంతో ఎంతో బాధకరమైన జీవితాన్ని ఎదుర్కొన్నాడు. ఆ కథ నన్ను ఎంతగానో కదిలించింది. అప్పటి నుంచి హోమోసెక్సువాలిటీ గురించి నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోవడం ప్రారంభించా. అలా హోమోసెక్సువల్ అయిన నా కొడుకు జీవితంలోకి తొంగిచూసే దిశగా తొలి అడుగు వేశా. మా అబ్బాయి చెప్పిన కథ విన్న నేను ‘నువ్వు గే నా’ అని అడిగా. అలా అడిగిన నాతో నా కొడుకు ‘నువ్వు నన్ను అసహ్యించుకుంటావా? నన్ను నన్నుగా నువ్వు యాక్సెప్టు చెయ్యలేవా? ’ అని ఎదురు ప్రశ్నించాడు’ అని కొడుకు అన్న మాటలను అరుణా దేశాయ్ గుర్తుచేసుకున్నారు. తన కొడుకు గే అని తెలిసినపుడు అందరిలాగే అరుణాదేశాయ్ కూడా తొలుత షాక్ కు గురయ్యారు. ఆ రోజును ఇప్పటికీ
మరవలేనంటారామె. కొడుకు గే అనే నిజం తెలిసిన క్షణం నుంచీ కొడుకుకు అండగా నిలవాలని అరుణ నిశ్చయించుకున్నారు. కొడుకు అభిషేక్ అంటే అరుణకు ఎంతో ప్రేమ. అందుకే అతనికి అన్నివిధాలా బాసటగా నిలబడాలని నిశ్చయించుకున్నారు. తన కొడుకు గే అనే విషయం తెలిస్తే కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కూడా అరుణకు అప్పటికే స్పష్టమైన అవగాహన ఏర్పడింది. తన కొడుకులాంటి వారి కోసం ఏర్పడిన స్వీకార్ రెయిన్ బో పేరెంట్స్ సంస్థ స్థాపన వెనుక అరుణ క్రుషి ఉంది. ‘తమ బిడ్డల సెక్సువాలిటీని ఆమోదించి వారికి అండగా నిలబడిన నా లాంటి పేరెంట్స్ కొందరు మా పిల్లలకు సంబంధించిన పలు ఈవెంట్లకు, కార్యక్రమాలకు హాజరయ్యేవాళ్లం. మెల్లమెల్లగా మాలాంటి పిల్లలే ఉన్న మరికొందరు తల్లిదండ్రులు కూడా మాతోకలిసి ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ప్రారంభించారు.

అయితే చాలామంది పేరెంట్స్ మొదట్లో తమ పిల్లల సెక్సువాలిటీ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయేవారు. కానీ మెల్లమెల్లగా వారిలో మార్పు మొదలైంది. మెల్లగా వారికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. శ్రీధర్ రంగయాన్ అనే ఆయన ఇలాంటి వారిని ఉద్దేశించి తీసిన ‘ఈవినింగ్ షాడోస్’ సినిమా పై ఒక ప్రెస్ కాన్ఫెరెన్సె ఏర్పాటు చేశారు. దానికి ఆయన నన్ను కూడా పిలిచారు. ఆ సమావేశంలో ఆయన అలాంటి వారి కోసం ఒక సపోర్టు గ్రూపు ఏర్పాటు ప్రకటన చేశారు. ఇందుకు మా బ్రుందంలోని పదిమందిమి వెంటనే ముందుకు వచ్చాం. అలా స్వీకార్ రెయిన్ బో గ్రూపును ఏర్పాటుచేశాం. ఈ గ్రూపులో 2007 నుంచి నేను పాలుపంచుకుంటున్నా. అలా ఈ గ్రూపు ద్వారా ఎందరికో పరిచయమయ్యాను. కరోనా సమయంలో కూడా ఇలాంటి పిల్లల పేరెంట్స్ ఎందరో నాదగ్గరకు వచ్చేవారు. వారికి మీ పిల్లలతో ఫైట్ చేయొద్దు. వారిని వారిగా అంగీకరించండి. వారికి అండగా నిలబడండి అని చెప్పాను’ అని అరుణా దేశాయ్ అన్నారు. ఇలాంటి వారి హక్కుల కోసం కూడా అరుణా దేశాయ్ పోరాటం
చేస్తున్నారు. ముఖ్యంగా స్వలింగసంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పిస్తే వారు కూడా పెళ్లిళ్లు చేసుకునే వీలు ఉంటుందని ఆమె అంటారు. అందరి పౌరుల్లాగే వాళ్లు కూడా సమాన హక్కులు పొందగలరని అభిప్రాయపడ్డారు. దాంతో స్వలింగసంపర్కులు కూడా ప్రశాంతమైన జీవితం గడపడంతోపాటు సొంత ఇల్లు, సొంత ఆస్తులను ఏర్పాటు చేసుకోగలరని ఆమె అభిప్రాయం. అంతేకాదు తమ పార్టనర్స్ తో కలిసి బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోగలుగుతారు.

ఇన్సూరెన్స్ చేసుకోగలరు. తమ పార్టనర్ కు సంబంధించిన వైద్యపరమైన నిర్ణయాలను కూడా ఇతర సాధారణ పౌరులకు మల్లేనే తీసుకోగలుగుతారంటారు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే వీళ్లు కూడా ఆనందకరమైన, సంత్రుప్తికరమైన జీవితాలను కొనసాగించడం చూసి వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందించగలరని అరుణా దేశాయ్ అంటారు. తమ పిల్లలు ‘గే’ లేదా ట్రాన్స్ జండర్ అని తెలిసినపుడు తల్లిదండ్రులు సాధారణ సెక్సువల్ బిహేవియర్ తో ఉండాలని వారిపై ఒత్తిడి తేవడం, గ్రుహహింసకు పూనుకోవడం వంటి ఫిర్యాదులు కూడా తమకు వస్తుంటాయని అరుణ చెప్పుకొచ్చారు.

సమాజంలో ఎల్జిబిటిక్యూఐఎ కమ్యూనిటీకి సాధారణ పౌరులకు మల్లే అన్ని రంగాలలో సమానహక్కులు పొందేందుకు అరుణా దేశాయ్ ప్రారంభించిన ఉద్యమంకు అన్ని వర్గాల తోడ్పాటు అందాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News