వేసవి తాపాన్ని తగ్గించే హెల్దీ ఐస్డ్ టీలు…
వేసవిలో దాహం వేస్తే కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం. ఇందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటి కూల్ డ్రింక్స్ కు బదులు ఆరోగ్యవంతమైన ఐస్ టీలు తాగితే ఎంతో మంచిదంటున్నారు వైద్యులు. ఐస్డ్ టీలు వేసవిలో శరీరానికి కావలసినంత హైడ్రేషన్ ను అందించడమే కాదు మనల్ని ఎంతో ఆరోగ్యంగా, మరెంతో తాజాగా ఉంచుతాయని చెప్తున్నారు. ఐస్డ్ టీలలో ఎన్నో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. రిఫైన్డ్ సుగర్ వాడని రుచికరమైన ఐస్డ్ టీలు చేసుకోవచ్చు కూడా. అలాంటి ఆరోగ్యకరమైన ఐస్డ్ టీలలో నిమ్మ, తులసి కాంబినేషన్ తో చేసే ఐస్డ్ టీ చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరెంతో రుచిగా కూడా ఇది ఉంటుంది. వేసవిలో తాగాల్సిన ఐస్డ్ టీ అంటారు. పోషకాహార నిపుణులు. వేసవిలో తాగాల్సిన మరో బెస్ట్ ఐస్డ్ టీ బ్లాక్బెర్రీ మింట్ ఐస్డ్ టీ. ఇంకొకటి ఐస్ పీచ్డ్ జింజర్ టీ. అలాగే కోకోనట్ లైమ్ ఐస్డ్ టీ కూడా ఉంది. ఇవన్నీ హెల్దీ ఐస్డ్ టీలు. ఇవెలా చేయాలంటే..
లెమన్ బేసిల్ ఐస్డ్ టీ:
కావలసిన పదార్థాలు: సగం నిమ్మ చెక్క తీసుకుని సన్నగా, గుండ్రంగా ముక్కలు చేయాలి. తాజా తులసి ఆకులు ఆరు, గ్రీన్ టీ బ్యాగ్స్ 2, వేడి నీళ్లు మూడుకప్పులు, ఆర్గానిక్ తేనె (ఆప్షనల్) రెడీ పెట్టుకోవాలి. తయారీ: ఒక క్వార్ట్ మాన్సన్ జార్ లో మూడు నిమ్మ ముక్కలు, తాజా తులసి ఆకులు, గ్రీన్ టీ బ్యాగ్స్ వేయాలి. ఆ జార్ లో వేడి నీళ్లు పోసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి ఆతర్వాత అందులోంచి టీ బ్యాగులను తీసేయాలి. ఆ జార్ ని మూడు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా ఫ్రిజ్ లో ఎక్కువ సేపు ఉంచడం వల్ల నిమ్మ, తులసి సువాసనలతో ఈ టీ ఎంతో రుచిగా ఉంటుంది.
కోకోనట్ లైమ్ ఐస్డ్ టీ:
కావలసిన పదార్థాలు: బ్లాక్ టీ బ్యాగ్స్ రెండు, సన్నగా కట్ చేసిన లైమ్ ముక్కలు, వేడిచేసిన కొబ్బరినీళ్లు మూడు కప్పులు, తేనె (ఆప్షనల్) రెడీ పెట్టుకోవాలి.
తయారీ: బ్లాక్ టీ బ్యాగులు, లైమ్ ముక్కలను జార్ లో వేయాలి. అందులో వేడి చేసిన కొబ్బరినీళ్లను పోసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆతర్వాత బ్లాక్ టీ బ్యాగులను జార్ లోంచి తీసేసి దాన్ని మూడు లేదా నాలుగు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తర్వాత ఆ టీ తాగాలి. అది కోకోనట్ లైమ్ సువాసనలను చిందిస్తూ ఎంతో రుచిగా ఉంటుంది.
పీచ్ జింజర్ ఐస్ టీ:
కావలసిన పదార్థాలు: ఒక పీచ్ పండు ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. గ్రీన్ టీ బ్యాగ్స్ రెండు, గుండ్రంగా తరిగిన అల్లం ముక్కలు నాలుగు, వేడి నీళ్లు మూడు కప్పులు, తేనె (ఆప్షనల్) రెడీ పెట్టుకోవాలి.
తయారీ: క్వార్ట్ మాన్సన్ జార్ లో పీచ్ పండు ముక్కలు, రెండుగ్రీన్ టీ బ్యాగులను వేయాలి. అందులో గుండ్రంగా తరిగిన అల్లం ముక్కలను టూత్ పిక్స్ కు గుచ్చి జార్ లో పెట్టాలి (ఇలా చేస్తే తర్వాత జార్ లోంచి తీసేయడం సులువు). తర్వాత జార్ లో వేడినీళ్లు పోసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం జార్ లోంచి టీ బ్యాగులను తీసేయాలి. ఆ తర్వాత ఆ జార్ ను మూడు లేదా నాలుగు గంటలు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల టీ మంచి సువాసనలు వెదజల్లుతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది.
బ్లాక్ బెర్రీ, మింట్ ఐస్ టీ: కావలసిన పదార్థాలు: బ్లాక్ బెర్రీలు అరకప్పు, తాజా పుదీనా ఆకులు ఆరు, గ్రీన్ టీ రెండు బ్యాగులు, మూడు కప్పులు వేడి నీళ్లు, తేనె (ఆప్షనల్)రెడీగా పెట్టుకోవాలి.
తయారీ: తాజా బ్లాక్ బెర్రీలు, పుదీనా ఆకులు, గ్రీన్ టీ బ్యాగులను క్వార్ట్ మాన్సన్ జార్ లో వేయాలి. తర్వాత జార్ లో వేడినీళ్లు పోసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జార్ లోంచి టీ బ్యాగులను తీసేయాలి. అనంతరం ఆ జార్ ను ఫ్రిజ్ లో మూడు లేదా నాలుగు గంటల సేపు ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీస్తే బ్లాక్ బెర్రీ పుదీనా సువాసనలు చిందిస్తూ ఈ ఐస్డ్ టీ ఎంతో రుచిగా ఉంటుంది.