హోలీ పండుగ వస్తుందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగితేలుతుంటారు. ఈ కలర్‌ఫుల్ ఫెస్టివల్ అందరికీ ఎంతో ఇష్టం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవంగా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం.. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ‘హోలికా పూర్ణిమ’ రోజునే హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 14న హోలీ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా రంగుల పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం రాధా కృష్ణులతో హోలీ పండుగ మొదలైంది అంటారు. చిన్నప్పుడు కృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూసి ఆటపట్టించేవాడట. అప్పటి నుంచి ప్రతి ఏడాది హోలీ
జరుపుకుంటున్నారు. హోలీ రోజున కృష్ణుడు గోపికలతో కలిసి రంగులు, పూలు చల్లుకుని సంబరాలు చేసుకునేవాడని చెప్తారు. ఇలా రంగులు పూలు చల్లుకోవడం వల్ల ప్రేమ, ఆనందం వెల్లివిరుస్తాయని నమ్మకం. మరో పురాణ కథ ప్రకారం.. రాక్షస రాజు హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎప్పుడూ విష్ణువునే తలుచుకుంటూ ఉండేవాడు. దీంతో కోపం వచ్చిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేయాలని అనుకున్నాడు. తన చెల్లెలు హోలికని పిలిచి ప్రహ్లాదుడిని మంటల్లో చంపమని చెప్పాడు. హోలికకి మంటల్లో కాలిపోకుండా ఉండే శక్తి ఉంది. హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకింది. విష్ణువు అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. హోలిక మాత్రం మంటల్లో కాలిపోయింది. అందుకే హోలిక దహనం చేస్తారు.
హోలీ ఎలా జరుపుకోవాలి: హోలీ రోజున సహజ రంగులు చల్లుకుంటే మనసుకి ఆనందంగా ఉంటుంది. హోలిక దహనం తర్వాత శీతాకాలం ముగిసి వేసవి కాలం మొదలవుతుంది. ఈ సమయంలో రంగులు వాడటం వల్ల చర్మంపై బ్యాక్టీరియా తగ్గుతాయి. ఇక హోలీ సమయంలో వాతావరణంలో మార్పులు వస్తాయి. దీంతో మనం త్వరగా అలసిపోతాం. నీరసంగా ఉంటాం. అలాంటప్పుడు బయటకి వచ్చి అందరితో కలిసి రంగులు ఆడుకుంటే ఆ నీరసం పోతుంది. బద్ధకం తగ్గి ఉత్సాహంగా ఉంటుందని చెబుతుంటారు.
రంగులతో జాగ్రత్త: సాధారణంగా హోలీకి సహజమైన రంగులు వాడాలని నిపుణులు చెబుతుంటారు. ఒకప్పుడు పూలు, ఆకులతో రంగులు తయారు చేసుకునేవారు. మన దేశంలో నేటికీ అనేక ప్రాంతాల్లో ఈ పద్ధతి కొనసాగుతుంది. ఈ సహజమైన రంగులు చర్మానికి మంచివి. కాని కొందరు కెమికల్స్ వాడిన రంగులను వాడుతున్నారు.. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
హోలీ ఆడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముఖ్యంగా హోలీ రంగులు కళ్ళకి హాని జరగకుండా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. పాత బట్టలు వేసుకోవాలి. చేతులకు గ్లౌజులు, కాళ్ళకు సాక్స్ లు వేసుకోవాలి. కళ్ళల్లో రంగు పడితే వెంటనే నీళ్ళతో కడుక్కోవాలి.