Friday, September 20, 2024
Homeఫీచర్స్Handicrafts: కసూటి..గృహిణుల సాధికారతా చిహ్నం

Handicrafts: కసూటి..గృహిణుల సాధికారతా చిహ్నం

కర్నాటకు చెందిన అతి ప్రాచీన కళారూపాన్ని మూడు దశాబ్దాలుగా పునరుజ్జీవింప చేస్తున్న మహిళ ఆమె…. అంతేకాదు దాన్ని ప్రపంచం మొత్తానికీ తెలిసేలా క్రుషిచేస్తున్నారు కూడా. ఆ మహిళే బెంగళూరుకు చెందిన ఆరతి హీరెమత్. ఆ అరుదైన కళారూపమే కసూటీ ఎంబ్రాయిడరీ. తన ‘ఆర్టీక్రాఫ్ట్స్’ వెంచర్ ద్వారా దేశ విదేశాల్లో ఈ కళ గొప్పతనాన్ని రంగు రంగుల్లో ఆమె విరబూయించారు. ఆ విశేషాలు…

- Advertisement -

‘ఆర్టీ క్రాఫ్ట్స్ ’స్థాపకురాలు ఆరతి. బెంగళూరుకు చెందిన ఆమె ప్రాచీన కళారూపమైన కసూటీ ఎంబ్రాయిడరీపై ప్రత్యేక క్రుషి చేస్తున్నారు.1989 నుంచీ దీనిపై ఆమె పనిచేయడం ప్రారంభించారు. అప్పుడే వివాహమై కొత్తగా కుటుంబ జీవితంలో ప్రవేశించడంతో పాటు ఎంటర్ప్రెన్యూర్ గా కూడా తన జీవితానికి ఆరతి నాంది పలికారు. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆరతి కర్నాటకకు చెందిన ప్రాచీన సంప్రదాయ ఫ్యాబ్రిక్ ఆర్ట్ అయిన కసూటి ఎంబ్రాయిడరీని తిరిగి బతికించి దానికి పూర్వ వైభవం తేవడంలో సక్సెస్ అయ్యారు. కసూటీ ఎంబ్రాయిడరీ సౌందర్యాన్ని ప్రపంచానికి చాటడంలో సఫలీక్రుతులయ్యారు.

చాళుక్యుల పాలనా కాలం నాటిది ఈ కసూటీ ఎంబ్రాయిడరీ కళ అంటారు. కర్నాటకలోని మహిళలు మాత్రమే ఈ ఎంబ్రాయిడరీ పని చేస్తారు. ఆ కాలంలో వస్త్రాలపై కసూటీ ఎంబ్రాయిడరీ తప్పకుండా ఉండేదిట. ఆ ఎంబ్రాయిడరీతో చేసిన దుస్తులను ప్రజలు ఎంతో ఇష్టంగా ధరించేవారట. ఈ ఎంబ్రాయిడరీలో కనిపించే కొన్ని మోటిఫ్స్ రంగోలీ డిజైన్లను కూడా ప్రభావితం చేశాయి. ఎలాంటి పెన్సిల్ స్కెచ్ లు లేకుండా ప్లెయిన్ వస్త్రంపై ఈ ఎంబ్రాయిడరీని నేరుగా కళాకారులు చేసుకుంటూపోతారు. దీన్నిబట్టి ఇది ఎంత సవాలుతో, క్రియేటివిటీతో కూడుకున్న చేతిపనో మనకు అర్థమవుతుంది. ఈ కళలో బాగా అనుభవం ఉన్న కళాకారిణులు మాత్రమే కసూటీ మోటిఫ్స్ ను అలవోకగా కుట్టగలుగుతారు. వీటి మోటిఫ్స్ లో గుడులు,పల్లకీలు, గోపురాలు, రథాలు, నెమళ్లు, తామర పువ్వులవంటివెన్నో ఉంటాయి. ఈ మోటిఫ్స్ అన్నీ ప్రక్రుతిసిద్ధమైన రూపాలతో ఎంతో కళాత్మకంగా, ద్రుశ్యరూపంగా ఉంటాయి.

ఈ ఎంబ్రాయిడరీ ప్రత్యేకత ఏమిటంటే ఫ్యాబ్రిక్ పై కుట్టిన మోటిఫ్స్ ఫ్యాబ్రిక్ రెండువైపులా ఒకే విధంగా కనిపిస్తాయి. ఆ ప్రత్యేకతే ఆరతిలో ఈ కళపై ఆసక్తిని రేపింది. 1990ల్లో ధార్వాడకు చెందిన ఇద్దరు మహిళలు తమకు ఏదైనా పని ఇప్పించమని ఆరతిని అడగడానికి ఆమె ఇంటికి వచ్చారు. ఆ ఇద్దరు మహిళలు ఆరతికి తెలిసిన వాళ్లే. ఆరతి అమ్మానాన్నలు గతంలో ధార్వాడలో ఉండగా ఆమె తల్లి చీరలకు ఆ మహిళలు ఎంబ్రాయిడరీ చేసేవాళ్లు. ఎప్పుడైతే వారి కుటుంబం నగరానికి వచ్చిందో వారితో ఆ కుటుంబానికి సంబంధాలు లేకుండాపోయాయి. తిరిగి ధార్వాడకు ఆరతి రావడంతో తమకు ఎంబ్రాయిడరీ ఆర్డర్స్ ఆమె ఇవ్వగలరేమోనని అడగడానికి ఆరతి దగ్గరకు వాళ్లు వచ్చారు. ఆరతి ఎంతో ఉత్సాహంగా వారిని బెంగళూరులోని షాపుల వారికి పరిచయం చేసి ఆ షాపుల నుంచి వారికి రెగ్యులర్ ఆర్డర్లు వచ్చేలా చేశారు. అలా ఒక దశాబ్దకాలం గడిచిన తర్వాత 2000 సంవత్సరంలో తానే కసూటీ ఎంబ్రాయిడరీ కళ కోసం వెంచర్ మొదలెడితే బాగుంటుందని భావించింది. ‘ అప్పటికి మా పిల్లలు పెద్దవాళ్లయ్యారు.

ఈ కళ మీద నాకున్న ప్రేమ దానికోసం ఏదైనా చేయాలన్న ఆలోచనను పెంచడంతో ఖాళీగా ఉండకుండా ఆ పని చేపట్టా’ అని ఆరతి గుర్తుచేసుకున్నారు. ఈ వర్కుకు సంబంధించే అనుకోకుండా 2003లో ధార్వాడలోని ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఆరతికి మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ‘ ఆ సంస్థ వాళ్లు భారతీయ హస్తకళాకారులకు ఏదైనా చేయాలన్న తపన ఉన్నవాళ్లు. అలా కలిసిన మేము ఆ ఏడాదే ‘సెమా’ (సొసైటీ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ మొబలైజేషన్ ఆఫ్ ఆర్టిసాన్స్)ని ప్రారంభించాం’ అని ఆరతి చెప్పారు. ‘సెమా’ కసూటీ ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన ధార్వాడకు చెందిన మహిళలపై ద్రుష్టిపెట్టింది. వారికి పని ఇప్పిద్దామని ప్రయత్నించింది. కానీ ఆ ఎంబ్రాయిడరీకి అప్పట్లో డిమాండ్ లేకపోవడంతో ఆ ప్రయత్నాలు కలిసిరాలేదు. ‘ కానీ మేం కసూటీ ఎంబ్రాయిడరీ కళాకారులకు ఆరోగ్య బీమా, వారి పిల్లలకు స్కాలర్ షిప్పులు, శిక్షణాకార్యక్రమాలు వంటి పనులు చేపట్టాం. 2010 వరకూ వాటిని కొనసాగించాం. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకపోవడంతో అది కాస్తా ఆగిపోయింది’ అని ఆరతి చెప్పారు. ఆ తర్వాత తానే ఈ కళాకారులకు ఏదైనా చేసి ఆదుకోవాలనే అభిప్రాయానికి ఆరతి వచ్చారు. అప్పుడే ఒక సంఘటన జరిగింది. 2011లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు కసూటి కళాకారుల పనితనాన్ని చూడడానికి ఆరతి దగ్గరకు రావడం తటస్థించింది. అది ఆరతిలో కొత్త ఆశలను రేపింది. ‘ వారంతా గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా మర్చండైజ్ పై ఇంటర్న్ షిప్ చేస్తున్నారు. వీళ్లు మా కళాకారుల ఉత్పత్తుల అమ్మకం కోసం ఒక ఫేస్ బుక్ పేజ్ ప్రారంభించి ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ను క్రియేట్ చేశారు. అలా ఆన్ లైన్ ద్వారా కసూటీ ఎంబ్రాయిడరీ చీరలను అమ్మడం మొదలెట్టాం’ అని ఆరతి చెప్పారు. మెల్లగా వారి కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఇదంతా 2012లో జరిగింది.

కసూటీ ఎంబ్రాయిడరీ చీరల డిమాండ్ బాగా పెరగడంతో వాటిని ధరించేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. దేశమంతా సంప్రదాయ హస్త రీతులపై హఠాత్తుగా ఆసక్తి పెరగడంతో వాటిల్లో కొత్త కొత్త పేట్రన్లు తీసుకురావడం ప్రారంభించారు. ఆ ట్రెండుతో కసూటీ ఎంబ్రాయిడరీ చీరలపై కూడా చాలామందిలో ఆసక్తి పెరిగింది. ఇది ఆరతి బిజినెస్ ను మరింత ఊపందుకునేలా చేసింది. ఇక ఆ తర్వాత ఆరతి వెనుదిరిగి చూడలేదు. ఆరతి ‘ఆర్ట్ క్రాఫ్ట్స్’ వెంచర్ తయారుచేస్తున్న కసూటీ ఎంబ్రాయిడరీ దుస్తుల్లో షాల్స్, చీరలు, దుప్పట్టాలు, బ్యాగులు వంటివెన్నో ఉన్నాయి. వీటిపై దేవాలయాలపై కనిపించే ఆర్కిటెక్చర్, పక్షులు, జియోగ్రాఫికల్ డిజైన్లు, దేవుడి బొమ్మలు వంటి మోటిఫ్స్ ఉన్నాయి. ఈ ఎంబ్రాయిడరీలో నాలుగురకాల కుట్టే రీతులు ఉన్నాయి. ఒకటి గవాంతి. ఇది డబుల్ రన్నింగ్ స్టిచ్ తో ఉంటుంది.

రెండవది ముర్గి కుట్టు. ఇది జిగ్ జాగ్ గా ఉండే స్టిచ్. మూడవది నేగీ స్టిచ్. ఇది రన్నింగ్ స్టిచ్. నాల్గవది, చివరిది మెంతి స్టిచ్. ఇది క్రాస్ స్టిచ్. ఇప్పటివరకూ ఆరతి 850 మంది మహిళలకు ఇందులో శిక్షణ ఇచ్చారు. ఆమె ఆర్టిక్రాఫ్ట్స్ ఉత్పత్తులు దేశ విదేశాల్లో కొంటున్నారు. అమెరికా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, యుకె దేశాలలో కూడా వీరి వినియోగదారులు ఉన్నారు. వ్యాపార టర్నోవర్ సంవత్సరానికి 40 లక్షల రూపాయలు ఉంది. నెలకు కసూటీ ఎంబ్రాయిడరీ చేసిన 50 వరకూ చీరలకు ఆర్డర్లు వస్తాయి. ఆరతి కసూటీలో ఐదురోజుల శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. ఈ కళా ప్రయాణం తనకెంతో సంత్రుప్తిని, ఆనందాన్ని, ఉత్సాహాన్నీ ఇస్తోందంటారు ఆరతి. కనుమరుగైపోతున్న అపురూపమైన, ప్రాచీనమైన ఈ కళారూపానికి మళ్లీ జీవం పోయగలగడం తనకు ఇస్తున్న ఆనందం మాటల్లో చెప్పలేనన్నారు.

ఈ కళ ఎంతోమంది గ్రుహిణులకు జీవనోపాధిని ఇస్తోంది. ఈ ఎంబ్రాయిడరీ కళ బతికుందంటే ఆ క్రెడిట్ కూడా గ్రుహిణులకే దక్కుతుంది. కసూటీ అన్న పదంలోనే ఆ కళ యొక్క అర్థం దాగుంది. ‘కాయ్’ అంటే కన్నడంలో చెయ్యి అని అర్థం. ‘సూటి’ అంటే కాటన్ దారం. కర్నాటకకే పరిమితమైన ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ స్టైల్ ఇది. కర్నాటకలోని చాలామంది మహిళలు ఇళ్లల్లో ఈ ఎంబ్రాయిడరీ వర్కును తప్పకుండా నేర్చుకుంటారు. ఒక దారపు పోగుతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. ఈ ఎంబ్రాయిడరీ స్టైల్ చూడడానికి ఎంతో సున్నితంగా, హుందాగా మరెంతో కళాత్మకంగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ ముందు, వెనక కూడా దీని కుట్టు ఒకేలా ఉండడం ఈ ఎంబ్రాయిడరీ ప్రత్యేకత. ముఖ్యంగా కర్నాటకలోని ధార్వాడ, హుబ్లీలలో నేతగాళ్ల భార్యలు ఈ వర్కును ఎక్కువగా చేస్తుండడం కనిపిస్తుంది. కర్నాటకకు చెందిన సంప్రదాయ ఫ్యాబ్రిక్ ఆర్ట్ ఇది. దీన్ని కుట్టే మహిళలు తమ చుట్టూ ఉన్న ప్రక్రుతి అందాలు, పక్షులు, రకరకాల కళాత్మకమైన నిర్మాణాలు, దేవాలయాలు వంటి వాటిని క్లాత్ పై ఎంతో స్రుజనాత్మకంగా ఆవిష్కరిస్తుంటారు.

ఈ కళ ఒకప్పుడు ధార్వాడకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ మెల్లగా బీజాపూర్, బెల్గామ్, మిరాజ్, సాంగ్లి, జామ్ ఖాండి జిల్లాల్లో కూడా ఇది ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ కళారూపం ప్రస్తుతం దక్షిణ ఇండియాలోని పలుచోట్ల సైతం కనిపిస్తోంది. ముదురు రంగు చేనేత వస్త్రాలపై లేత రంగు దారాలతో సంప్రదాయ శోభను ఆవిష్కరిస్తూ ఈ ఎంబ్రాయిడరీ వర్కు చేస్తారు. కసూటీ ఎంబ్రాయిడరీని స్కర్టు, పల్లు, చీర వంటి వాటిపై ఎక్కువ చేస్తారు. ఎంతో క్లిష్టమైన ఎంబ్రాయిడరీ వర్కు ఇది. ఇప్పుడు కసూటీ ఎంబ్రాయిడరీని అన్నిరకాల ఫ్యాబ్రిక్స్ పై చేస్తున్నారు. కాని గతంలో ఖాన్స్ బ్లౌజ్ పీసులపై, ఇర్కాల్ చీరలపై ఈ ఎంబ్రాయిడరీ వర్కు చేసేవారు. చీరలు వంటి వాటిపైనే కాకుండా ఈ వర్కును ఇపుడు కర్టెన్లపై, షాల్స్ పై, దిండుకవర్లు, టేబుల్ క్లాత్, చేతితో అల్లే వాటిపై కూడా చేస్తున్నారు. కసూటీ కళలో ఎక్కువగా ఆరంజ్, ఆకుపచ్చ, ఎరుపు, వంకాయ రంగులను వాడతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News