Friday, September 20, 2024
Homeఫీచర్స్No makeup Look: నో మేకప్ లుక్ ఎలా ?

No makeup Look: నో మేకప్ లుక్ ఎలా ?

మేకప్ లేకుండా అందంగా కనిపించడం నేటి బ్యూటీ ట్రెండు. ప్రత్యేక సందర్భాలలో సైతం మేకప్ లేకుండా అందంగా కనిపించే బ్యూటీ రెజీమ్ ను నేడు చాలామంది అనుసరిస్తున్నారు. ఫుల్ మేకప్ వేసుకోకుండా సింపుల్ మేకప్ తో అందంగా, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికే నేటి యువతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ పెళ్లికి సైతం సింపుల్ మేకప్ కే పెద్ద పీట వేస్తున్నారు. ప్రత్యేక సందర్భాలలో సైతం సహజమైన అందంతో కనిపించాలని కోరుకుంటున్నారు. దాన్నే క్లీన్ మేకప్ స్టైల్ లేదా నేచురల్ అప్పియరన్స్ గా పేర్కొంటున్నారు. ‘నో మేకప్’ మేకప్ లుక్ లో ఆరోగ్యంగా, అందంగా కనిపించడానికి
ప్రయత్నిస్తున్నారు. అదెలా అంటారా? ఇందుకోసం చర్మానికి కావలసినంత హైడ్రేషన్ అందేలా నిత్యం జాగ్రత్తపడాలి. చర్మంలో తేమ ఎంత ఎక్కువగా ఉంటే అంత సహజసిద్ధమైన కాంతితో మీ స్కిన్ మెరుస్తూ కనిపిస్తుంది. చర్మంలో తగినంత తేమ లేకపోతే వేసుకున్న మేకప్ అట్టగట్టినట్టు ఉండి డ్రైగా కనిపిస్తుంది. అందుకే నిత్యం నీళ్లు బాగా తాగడంతో పాటుగా చర్మానికి సరిపడే మాయిశ్చరైజర్ ని తప్పకుండా రాసుకోవాలి. సహజ అందంతో కనిపించాలంటే మంచి స్కిన్ కేర్ రొటీన్ ను కూడా అనుసరించాలి. అలా చేయడం వల్ల సింపుల్ మేకప్ తో కూడా మీరు ఎంతో అందంగా కనిపిస్తారు.

- Advertisement -


చర్మాన్ని క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసిన తర్వాత మీ చర్మ స్వభావాన్ని బట్టి డ్యూఈ లేదా మాట్టిఫైయింగ్ ప్రైమర్ ని వాడాలి. ఇది చర్మాన్ని నున్నగా కనిపించేలా చేస్తుంది. ప్రధానంగా డబుల్ క్లీన్సింగ్ మంచి ఫలితాలను చూపుతుంది. గుడ్ స్కిన్ రొటీన్ వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించడమే కాదు ఎక్కువ మేకప్ అవసర పడదు. సహజసిద్ధమైన అందంతో కనిపించాలంటే తక్కువ ఫౌండేషన్ వేసుకోవడం మంచిది. దీనివల్ల తేమ బాగా ఉన్న చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘నో మేకప్’ మేకప్ లుక్ కనిపించాలంటే ఫౌండేషన్ కు దూరంగా ఉంటేనే మంచిది. అలాగే క్రీమ్ బేస్డ్ లేదా వాటర్ బేస్డ్ ఫార్ములాలను వాడితే మంచిది. అంటే క్రీమ్ బేస్డ్ లేదా వాటర్ బేస్డ్ బ్లష్, హైలైటర్స్, లిప్ టింట్స్, చీక్ టింట్, ఐషాడో, మస్కారాలు వాడాలి. కారణం ఇవి మీ చర్మంలో బాగా కలిసిపోయి మీకు నేచురల్ ఫినిష్ ను ఇస్తాయి. పౌండర్ ఫార్ములేషన్లు అయితే వీటిలా చర్మంలో కలిసిపోవు. చర్మంపై ఉండే నల్లమచ్చలు, నల్లటి వలయాలు కనిపించకుండా ఉండడానికి లైట్ వెయిట్ హైడ్రేటింగ్ కన్సీలర్ వాడాలి. దీన్ని చర్మంపై ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే అప్లై చేయాలి. ‘నో మేకప్’ మేకప్ ఫార్ములాలో కన్సీలర్లను ఎంతో వ్యూహాత్మకంగా వాడాల్సి ఉంటుంది. దాంతో మీ కాంప్లెక్షన్ ఎంతో బ్రైట్ గా కనిపిస్తుంది.

అలాగే కనుబొమ్మల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కనుబొమ్మలను దువ్వి, అవసరమైతే ఎక్స్ ట్రా హెయిర్ ని పెట్టి ట్రాన్స్ పరెంట్ మస్కారాను అప్లై చేస్తే ఎక్కువ సమయం అది నిలిచి ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మేకప్ చేసుకోబోయేముందు ముఖాన్ని పూర్తిగా షేవ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు పోతాయి. జిడ్డు పోతుంది. మలినాలు పోతాయి. మ్రుతకణాలు పోతాయి. దీంతో చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. అప్పుడు మేకప్ చేయడం సులభం కావడమే కాదు ఆ మేకప్ ఎక్కువసేపు ముఖానికి అంటిపెట్టుకుని ఉంటుంది. దీనివల్ల స్వచ్ఛమైన చర్మ సౌందర్యంతో వెలిగిపోతూ కనిపిస్తారు.

మేకప్ లో ఫినిషింగ్ ఫౌండర్లు కూడా చాలా ముఖ్యం. మీ స్కిన్ కు ఎలాంటి ఫౌండేషన్, కన్సీలర్ సూట్ అవుతాయో తెలుసుకోవడం ఎంత కష్టమో అలాగే మీ స్కిన్ టోన్ కు సరైన ఫినిషింగ్ ఫౌండర్ల వినియోగం కూడా చాలా ముఖ్యమైంది. నూనె ఎక్కువ కారే చోట్లలో లైట్ వైట్ సెట్టింగ్ పౌడర్ ని అద్దాలి. మేకప్ చివరలో సెట్టింగ్ పౌడర్ వాడడం వల్ల మీ లుక్స్ మరింత నేచురల్ గా కనిపిస్తాయి. వీటిని అనుసరించేటప్పుడు చర్మనిపుణుల సలహాలను కూడా తీసుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News