శ్రామికశక్తిలో మహిళల స్వల్ప ప్రాతినిధ్యం, వారెదుర్కొంటున్న వివక్ష, వేతనా అంతరాలు, గ్లోబెల్ లేబర్ మార్కెట్ లో స్త్రీల కెరీర్ అవకాశాలు, కుటుంబ బాధ్యతలు , పెళ్లి, సమాజంలో పొడసూపిన రకరకాల మార్పులు, పారిశ్రామికవిప్లవం ….వీటన్నింటిపై క్లాడియా గోల్డిన్ చేసిన విస్తృత అధ్యయనం ఆమెకు ఎకనామిక్ సైన్సెస్ లో నోబెల్ అవార్డు వచ్చేలా చేసింది. ఈ పరిణామాల వల్ల స్త్రీపురుషులు ఇరువురూ ఎలా నష్టపోతున్నారో కూడా ప్రంపంచం ముందుంచడంలో క్లాడియా సక్సెస్ అయ్యారు. ఆమె గురించిన కొన్ని మాటలు..
ఎకనామిక్ సైన్సెస్ లో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్ నోబెల్ బహుమతిని కైవసం చేసుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి ఇరాన్ మహిళకు వచ్చిన ఆనందం ఇంకా తీరకముందే మరో మహిళకు ఎకనామిక్స్ సైన్సెస్ లో నోబెల్ పురస్కారం లభించడం అంతర్జాతీయ మహిళా లోకానికి మరో గొప్ప తీపి వార్తని చెప్పాలి.
నోబెల్ పురస్కారాల్లో మహిళల విజయకేతనం గ్లోబల్ విమెన్ కి నిజంగా ఎంతో గర్వ కారణం కూడా. మహిళల లేబర్ మార్కెట్ పరిణామాలపై కనబరిచిన అత్యున్నత అవగాహన, ప్రతిభలకు, ఆ దిశగా క్లాడియా అందించిన గొప్ప సహకారానికి ఈ ఏడాది క్లాడియాకు నోబెల్ పురస్కారం లభించింది. ఎన్నో శతాబ్దాలుగా మహిళల సంపాదన, లేబర్ మార్కెట్ ప్రాతినిధ్యాలపై మొట్టమొదటిసారి సమగ్ర వివరాలను క్లాడియా గోల్డిన్ అందించారు. క్లాడియా చేసిన విస్తృత అధ్యయనం లేబర్ మార్కెట్ లో మార్పులకు కారణాలను వెల్లడించడమే కాకుండా అందులోని స్త్రీపురుష జండర్ అంతరాల గురించి సైతం ఎన్నో ఆసక్తికర వివరాలను ప్రపంచం ముందుంచారు.
గ్లోబల్ లేబర్ మార్కెట్ లో మహిళల సంఖ్య అత్యల్పంగా ఉండడాన్ని క్లాడియా పేర్కొన్నారు. అంతేకాదు మహిళలు పనిచేసినా కూడా వారికి ఈ రంగంలో పురుషుల కన్నా తక్కువ వేతనం రావడాన్ని క్లాడియా లేవనెత్తారు. తన అధ్యయనంలో భాగంగా క్లాడియా ఎన్నో ఆర్కీవ్స్ కు వెళ్లారు. 200 పైగా సంవత్సరాల డేటాను ఆమె క్రోడీకరించారు. గ్లోబల్ మార్కెట్ లో ఉద్యాగాలపరంగా, వేతనాల్లోను మహిళలు ఎందుకు తగినంత ప్రాతినిధ్యాన్ని, ప్రాధాన్యతను పొందలేకపోతున్నారన్న దానిపై ఆమె విస్తృత అధ్యయనాలు చేశారు. అక్కడ జండర్ తేడాపాడాలు ఎలా, ఎందుకు ఉన్నాయన్నదీ తన అధ్యయనాల్లో క్లాడియా పేర్కొన్నారు.
200 సంవత్సరాలుగా లేబర్ మార్కెట్ లో మహిళల పాత్ర ఏమాత్రం పెరగలేదని కూడా క్లాడియా అంటారు. వ్యవసాయ సమాజం నుంచి పారిశ్రామిక సమాజానికి మార్పు చెందే దశలో ఈ రంగంలో వివాహిత స్త్రీల సంఖ్య మరింత తగ్గడాన్ని ఆమె గుర్తించారు. అంతేకాదు ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో మహిళల సంఖ్య సర్వీస్ సెక్టర్ లో పెరగడాన్ని కూడా ఆమె గమనించారు. మారిన సామాజిక పరిస్థితులు, వ్యవస్థల నిర్మాణ తీరుతెన్నుల్లో పొడసూపిన మార్పులు ఇందుకు కారణమంటారు. ముఖ్యంగా ఇల్లు, కుటుంబ బాధ్యతల బరువు స్త్రీలపై పడడమే ఇందుకు ఒక ముఖ్య కారణమంటారు క్లాడియా. క్లాడియా గోల్డిన్ అమెరికా లేబర్ ఎకానమిస్ట్. హార్వార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. అంతేకాదు ఎన్ బి ఇ ఆర్ డెవలెప్మెంట్ ఆఫ్ ది అమెరికన్ ఎకనామిక్ ప్రోగ్రామ్ కు 1989 నుంచి 2017 వరకూ డైరక్టర్ గా వ్యవహరించారు. దాంతోపాటు ఎన్ బి ఇఆర్ జండర్ ఇన్ ఎకానమీ గ్రూప్ కోడైరక్టర్ కూడా. ఆర్థిక చరిత్రకారిణి మాత్రమే కాదు లేబర్ ఎకానమిస్ట్. కార్మికశక్తిలో జండర్ అంతరాలకు గల కారణాలను తన
లోతైన అధ్యయనం ద్వారా బయటపెట్టారు. వేతనాల్లోనూ కార్మిక మహిళల పరిస్థితి ఇదే. ఎకనామిక్స్ రంగంలో అవార్డు పొందిన మహిళల్లో క్లాడియా మూడవ మహిళ మాత్రమే. డెబ్భై ఏడేళ్ల క్లాడియా గోల్డిన్ తనకు నోబెల్ బహుమతి రావడంపై ఆశ్చర్యంతో పాటు సంతోషాన్ని కూడా ప్రకటించారు. క్లాడియా చేసిన ఒక అధ్యయనంలో స్త్రీకి తొలి బిడ్డ పుట్టిన ఒకటి లేదా రెండుసంవత్సరాల్లో వారి వేతనంలో అంతరం కనిపించడాన్ని క్లాడియా గుర్తించారు. తన సుదీర్ఘ అధ్యయనం ద్వారా లేబర్ మార్కెట్ లో జండర్ అంతరానికి కారణాలను క్లాడియా గోల్డిన్ ప్రపంచానికి చాటారు. గ్లోబల్ లేబర్ మార్కెట్ లో మహిళల ప్రాతినిధ్యం కొరవడడాన్ని బయటపెట్టారు. స్త్రీల కెరీర్ ప్లానింగ్ లో, వివాహపరమైన నిర్ణయాల్లో కాంట్రాసెప్టివ్ పిల్స్ కీలకపాత్ర పోషించిందని క్లాడియా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆధునికత, ఆర్థిక ప్రగతితో పాటు 20 వ శతాబ్దంలో మహిళల ఉద్యోగ అవకాశాలు పెరిగినా కూడా సుదీర్ఘకాలంగా స్త్రీ,పురుషుల మధ్య వేతన అంతరాలు కొనసాగుతూనే వచ్చాయని ఆమె చెప్తారు. చరిత్ర రీత్యా చూస్తే స్త్రీల వేతనాల్లో అంతరాలకు విద్య పరంగా ఉన్న తేడాపాడాలు, ఆక్యుపేషనల్ చాయిస్ లు కారణమని క్లాడియా అభిప్రాయపడతారు. శ్రామికశక్తిలో మహిళల పాత్ర అర్థం చేసుకోవడం సమాజానికి చాలా ముఖ్యమంటారు.