అంతరిక్షం అద్భుతాలతో నిండి ఉంటుంది. ప్రతి కొత్త అన్వేషణ, కొత్త విషయం, రహస్యం ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ విశ్వంలోని అద్భుతాలే. ఇక మరికొన్ని రోజుల్లో ఖగోళ అద్భుతం జరగనుంది. ఫిబ్రవరి 28, 2025న ఖగోళ ప్రేమికులు ఓ అరుదైన దృశ్యాన్ని చూడబోతున్నారు. అంతరిక్షంలో ఏడు గ్రహాల పరేడ్ (Seven-Planet Parade) అనే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ రోజు నాడు సౌరమండలంలోని ఏడు గ్రహాలు.. మెర్క్యురీ, వీనస్, మార్స్, జూపిటర్, శని, యురేనస్, నెప్ట్యూన్.. ఒకే సరళ రేఖపైకి రానున్నాయి.
ఈ వింతని టెలిస్కోప్ లేకుండానే చూడొచ్చు. వీటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖ పై ఉన్నట్లు కనపడతాయి. ఈ విశేషమైన ఖగోళ సంఘటనను గ్రహ పరేడ్ అని పిలుస్తారు. సాధారణంగా, ఇది చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో 2022లో ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనిపించాయి. కానీ ఏడు గ్రహాలు ఇలా ఒకేసారి ఒకే రేఖలో కనిపించడం చాలా అరుదు. ఈ విధమైన గ్రహ సముదాయం ఒకే సరళ రేఖపై మళ్లీ 2036లోనే కనిపిస్తుంది. అప్పుడు కూడా కేవలం ఐదు గ్రహాలే కనిపిస్తాయి.
ఇలా ఏడు గ్రహాలు ఇలా కనిపించేందుకు మరికొన్ని దశాబ్దాలు పట్టొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. కొండలు లేదా బహిరంగ ప్రదేశాలు, తక్కువ కాంతి ఉండే ప్రాంతాల నుంచి వీటిని చూడొచ్చు. టెలిస్కోప్ ఉంటే ఈ గ్రహాలను మరింత స్పష్టంగా చూడటానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ గ్రహ పరేడ్‌ను గురించి నాసా (NASA) మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. నాసా ఖగోళ శాస్త్రవేత్త డా. జేమ్స్ హెన్నెసీ దీనిపై మాట్లాడుతూ.. ఇది సహజమైన ఖగోళ అద్భుతమన్నారు. సౌరమండలంలోని గ్రహాలు కొన్ని సంవత్సరాలకు ఒకే సరళ రేఖపైకి వస్తుంటారు. ఇక ఈ అనంత విశ్వంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని గమనిస్తూ శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్ర రహస్యాలను కనిపెడుతుంటారు. సైంటిస్టులు కాబట్టి వారి వద్ద ఉన్న పెద్ద పెద్ద పరికరాలు, టెలీస్కోప్ లను ఉపయోగించి యూనివర్స్ లో రహస్యాలను తెలుసుకుంటారు. ఆకాశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే కనిపెడతారు. గ్రహాలు, గ్రహ శకలాల కదలికల వల్ల భూమిపై కలిగే మార్పులను అంచనా వేస్తుంటారు.