Tuesday, May 21, 2024
Homeనేషనల్Karuppanan Venkatesan: ఇతను ‘నేచురల్’ బాడీ బిల్డర్..!

Karuppanan Venkatesan: ఇతను ‘నేచురల్’ బాడీ బిల్డర్..!

- Advertisement -

నేచురల్ బాడీ బిల్డర్.. నేచురల్ బాడీ బిల్డర్ ఏమిటి అనే సందేహం చాలామందికి వచ్చి ఉంటుంది. తమిళనాడు మదురైకి చెందిన వెంకటేశన్ ఇతర బాడీ బిల్డర్ల కన్నా విభిన్నం. మాంసం తినందే బాడీ బిల్డర్ అవడం అసాధ్యం అనే వారికి ఇతను ఒక అద్భుతం. కేవలం శాకాహార డైట్ ను తీసుకుంటూ, పాలు, పాలసంబంధిత ఉత్పత్తులను సైతం తీసుకోని ‘నేచురల్’ బాడీ బిల్డర్ ఇతను. వెజిటేరియన్ ఫుడ్ తీసుకునేవారు బాడీ బిల్డర్ కాలేడన్న వారిని అబ్బురపరిచాడు. అంతేకాదు మాంసాహారం తీసుకునే బాడీ బిల్డర్లపై సైతం పోటీ చేసి పతకాలు కైవశం చేసుకున్న మొనగాడు. ఈ ‘మిస్టర్ ఇండియా’ లో బాడీ బిల్డర్ అవాలన్న స్ఫూర్తి నింపినది హాలివుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వాజ్నగర్. నేచురల్ బాడీ బిల్డర్ గా వెంకటేశన్ జర్నీ అతని మాటల్లోనే… ‘‘ నేచురల్ బాడీ బిల్డర్ గా నా ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ నేను అనుకున్న లక్ష్యం చేరుకోవడమే కాదు…డిఫరెంట్ బాడీ బిల్డర్ అనే కితాబును సైతం సొంతం చేసుకున్నాను. మాది తమిళనాడులోని మదురై. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు టివిలో హాలివుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వాజ్నగర్ నటించిన కమాండో సినిమా చూశాను. కండలు తిరిగిన ఆయన శరీరం నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ క్షణమే ఆయన నా జీవితంలో ‘రియల్ హీరో’ అయిపోయారు. కండలు తిరిగి గ్రీకు శిల్పంలా ఉండే ఆయన శరీరాక్రుతి నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. బాడీ బిల్డర్ కావాలనే ఆలోచన నా మనసులో అప్పుడే పడింది.

Karuppanan Venkatesan

నేను కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ అండ్ రెలిజియన్ లో పట్టా పొందాను. నా చదువుకు పూర్తిగా భిన్నమైన బాడీ బిల్డర్ ప్రొఫెషన్ ని కెరీర్ గా ఎంచుకున్నాను. ప్రొఫెషన్ రీత్యా ప్రస్తుతం భార్య, పిల్లలతో హైదరాబాద్ వచ్చి బాడీ బిల్డింగ్ ట్రైనర్ గా ఇక్కడ స్థిరపడ్డా. పదవతరగతి తర్వాత నుంచి జిమ్ కు వెళ్లి శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను. చిన్నతనం నుంచి నాకు మాంసాహారం తినడం మంటే ఇష్టం ఉండేది కాదు. జంతువులను బాధపెట్టడం అనేది నా మనసుకు ఎందుకో అస్సలు నచ్చేది కాదు. ఇంట్లో అమ్మానాన్న ఇతర కుటుంబ సభ్యులందరూ మాంసాహారమే తినేవారు. నేను మటుకు దాన్ని ముట్టేవాడిని కాదు. పాలు సైతం తీసుకునేవాడిని కాదు. పూర్తిగా శాకాహారాన్నే తినేవాడిని. 14 ఏళ్ల వయసు నుంచి పాల ఉత్పత్తులను కూడా తినడం మానేశాను. నాలాంటి ఆహారపు అలవాట్లు పాటించే వారిని వేగాన్ అని ఇప్పుడు అంటున్నారు. నేను ఎన్నో ఏళ్ల నుంచి వేగాన్ గా ఉంటున్నాననే విషయం వేగాన్ పదం పాప్యులర్ అయినప్పటి నుంచి మాత్రమే నాకు తెలిసింది. నేను పూర్తి వెజిటేరియన్ ని కావడంతో బాడీ బిల్డర్ అవడం అసాధ్యమని చాలామంది నన్ను నిరుత్సాహపరిచారు. నా లక్ష్యం సాధించాలంటే తప్పనిసరిగా మాంసాహారంగాని లేదా సప్లిమెంట్లుగాని తీసుకోవాలనేవారు. అయినా నేను నా పట్టుదలను వీడలేదు. విలువలను వదులుకోలేదు. ప్యూర్ వెజిటేరియన్ గా ఉంటూ నా లక్ష్యాన్ని సాధించాలనుకున్నా. శాకాహారి బాడీ బిల్డర్ అవడం ఏమిటంటూ నన్ను హేళన చేసిన, వెక్కిరించిన, చిన్నబుచ్చిన వారెందరో ఉన్నారు. వేగాన్ బాడీబిల్డర్ కాలేడని నా స్నేహితులు, చుట్టుపట్ల వాళ్లు, పోటీల్లో పాల్గొన్న కో-పార్టిసిపెంట్లు చివరకు జిమ్ లోని ట్రైనర్లతో సహా ఎందరరో నన్ను నిరుత్సాహపరిచారు . మాంసాహారం తింటేనే నీ కల సాధించగలవని అన్నారు. నన్ను నిరాశ పరిచిన వారి వల్ల నాలో పట్టుదల మరింత పెరిగింది. అందరూ అసాధ్యమన్నదానిని సుసాధ్యం చేయాలనకున్నాను. నేచురల్ బాడీ బిల్డర్ అయి అందరికీ నేనేంటో చూపించాలనుకున్నాను. నిజం చెప్పాలంటే నన్ను నిరుత్యాహపరిచిన వారి మాటలే నన్ను బాడీ బిల్డర్ అయ్యేలా చేశాయి. కొన్నేళ్లు ఎంతగానో శ్రమపడ్డాను. అలా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేచురల్ బాడీ బిల్డర్ గా పలు పతకాలు గెలిచి ఒక వేగాన్ కూడా గొప్ప బాడీ బిల్డర్ కాగలడని నిరూపించాను.

Karuppanan Venkatesan

ఇటీవల లాస్ ఏంజెల్స్ లో జరిగిన వరల్డ్ నేచురల్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో కూడా మిస్టర్ నేచురల్ బాడీ బిల్డర్ గా నిలిచాను. 2013లో భారతదేశం తరపున శాండియాగోలో జరిగిన నేచురల్ ఓలంపియా మల్టీ స్పోర్టు ఎక్స్ పోలో పాల్గొని గెలిచాను. ఇప్పటి దాకా నేచురల్ బాడీ బిల్డింగ్ లో 50కి పైగా పతకాలు గెలిచాను. అంతేకాదు మాంసాహారం తిని బాడీ బిల్డర్లయిన వారిపై సైతం గెలిచి పతకాలు సొంతం చేసుకున్నాను. ప్రస్తుతం మాత్రం కేవలం నేచురల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మాత్రమే పాల్గొంటున్నాను. నాకు నూరేళ్లు వచ్చే వరకూ నేచురల్ బాడీ బిల్డర్ పోటీల్లో పాల్గొని విజయాలు అందుకోవాలన్నదే జీవితాశయం. టీన్స్ లో ఉన్నప్పటి నుంచి జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేయడం ప్రారంభించాను. సహజసిద్ధమైన మొక్కలనుంచి తయారుచేసిన పొడులను ఆహారంగా తీసుకుంటాను. వీటిల్లో 30 రకాలకు పైగా నట్స్ తో చేసిన పొడులు కూడా ఉన్నాయి. కమర్షియల్ ప్రొటీన్ సప్లిమెంట్లను అస్సలు వాడను. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్లాంట్ ఆధారిత డైట్ ఎంతో మంచిది. కానీ కండలు పెంచడం అన్నది మటుకు సవాలుతో కూడుకున్నది. నేను కూడా ఆ దిశగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. కానీ మార్కెట్లలో దొరికే కమర్షియల్ ప్రొటీన్ల జోలికి మటుకు అస్సలు వెళ్లలేదు. వాటికి దూరంగానే ఉన్నా. కారణం ఇవి ఆరోగ్యం మీద, శరీరంలోని పలు భాగాలమీద ఎంత దుష్ప్రభావం చూపుతాయో నాకు అవగాహన ఉంది. ఏ కండరాలకు ఎలాంటి పోషకాలు అవసరమవుతాయి వాటిని నాకు నేనే తయారుచేసుకుంటా. ఆ రకంగా 32 రకాల పప్పులతో కూడిన పొడులను తయారుచేసుకోవడమే కాదు నా శరీరానికి ఎలాంటి వ్యాయామాలు కావాలో కూడా నేనే డిజైన్ చేసుకుంటా. నేచురల్ బాడీ బిల్డర్ ఎలా ఉండాలన్నదాని గురించి ఇంటర్నెట్లో బాగా స్టడీ చేశా. బాడీ బిల్డింగులో శరీరం కండలు తిరిగి ఉండడమే కాదు శరీరంలోని వివిధ అంగాలు కూడా ఆరోగ్యంగా, యాక్టివ్ గా పనిచేయాలి. ఈ విషయాన్ని గమనించుకోకపోతే శారీరకంగా చాలా సమస్యలు తలెత్తుతాయి. నా శరీర భాగాలకు ఎలాంటి ఆహారం కావాలో దాన్ని బట్టి పోషకవిలువలతో కూడిన ప్రొటీన్ పొడులు, ప్రొటీన్ షేకులు నేనే తయారుచేసుకుంటా. నిజానికి మా ముత్తాతలు వాళ్లు ఈ రకమైన పొడులను తయారుచేసుకుని వాడేవారు. అలా నాకు వాటిపట్ల అవగాహన ఉంది. నేను వాడే పప్పులు, నట్స్, వెజిటబుల్స్ పొడుల్లో రకరకాల పోషకవిలువలతో పాటు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు సైతం పుష్కలంగా ఉంటాయి. కండలు పెరగాలంటే శరీరానికి ప్రొటీన్లు చాలా అవసరం. ఏయే కండరాలకు ఎలాంటి వ్యాయామాలు అవసరమో వాటిని చేస్తా. వాటితో పాటు యోగ, ధ్యానం తప్పనిసరిగా రోజుకు రెండు మూడు గంటలు చేస్తా. యోగ శరీర అంగాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. ధ్యానం మనసుకు, శరీరానికి ప్రశాంతతను ఇస్తుంది. ఇవి రెండూ ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నిజానికి 40 సంవత్సరాలు వస్తే మనవాళ్లు రిటైర్మెంట్ వయసు వచ్చేసిందనుకుంటారు. కానీ 40 ఏళ్ల నుంచి యంగ్ ఏజ్ మొదలవుతుంది. మనలో ఎంతో మెచ్యూరిటీ వచ్చి అన్ని విషయాలను సరిగా ఆలోచించగలుగుతాం.

Karuppanan Venkatesan

ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు. మీకు తెలుసా నా మెటబాలిజం వయసు 27 సంవత్సరాలే. ఇది తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అందరికీ ఎంతో మంచిది. నా భోజనం, పోషకాలతో కూడిన పొడులు, సలాడ్లతో సాగుతుంది. బ్రేక్ ఫాస్ట్ గా ప్రొటీన్ పౌడర్, పళ్లు తింటా. టైము గ్యాపుతో ప్రతి రోజూ ఐదు సార్లు ప్రొటీన్ పౌడర్ తో నేను చేసుకున్న డ్రింకులు తాగుతా. చక్కెర, మైదాలను అస్సలు తీసుకోను. నా శరీరం ఇంత బలంగా, ద్రుఢంగా, ఫిట్ నెస్ తో ఉందంటే నేను తీసుకుంటున్న డైట్, వ్యాయామాలు, యోగ, ధ్యానం ప్రధాన కారణాలు. ఓవర్ వెయిట్ వర్కవుట్లు చేయను. ఏ కండరంతో ఎంత వ్యాయామం చేయొచ్చు, అది ఎంత తీవ్రతతో పనిచేయగలదన్నదాని పట్ల నాకు అవగాహన ఉంది. లైట్ వెయిట్స్ తో కండరాల బలాన్ని పెంచడంపై ద్రుష్టిపెడతాను. వ్యాయామాలు చేసేటప్పుడు గుండెవేగం ఎలా ఉంటోందన్నది జాగ్రత్తగా గమనించుకోవాలి. నీరు బాగా తీసుకోవాలి. మెదడు అలసినట్టు ఉందా అన్న విషయం కూడా గమనించుకోవాలి. కొన్ని నెలలు అయిన తర్వాత నా వ్యాయామాలను కండరాల అవసరానికి తగ్గట్టు మార్చి చేస్తుంటా. కాలరీ ఇన్ టేక్, బర్నింగ్ వంటి అంశాలను గమనించుకోవడం కూడా చాలా ముఖ్యం. నేచురల్ బాడీ బిల్డింగ్ సంస్క్రుతి మనదేశంలో ఇంకా ప్రారంభం కాలేదు. మనదేశంలో ఈ పోటీలను ఇంకా నిర్వహించడం లేదు. విదేశాలవారు ఇక్కడ నిర్వహించిన పోటీల్లో పాల్గొనడమే చూస్తాం. అంతేకాదు ఇండియాలో నేచురల్ బాడీ బిల్డింగ్ ఆర్గనైజేషన్ కూడా లేదు. నేను దాన్ని ఏర్పాటుచేశాను. బాడీ బిల్డర్లకు శిక్షణ కూడా ఇస్తున్నా. శారీరక శిక్షణ, ఆహారం వ్యక్తి వ్యక్తికీ వారి శారీరక స్థితిగతులు, ఆరోగ్య సమస్యలనుసరించి మారుతుంటుంది. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అలా మార్గదర్శకం చేసే ట్రైనర్లు మనకు చాలా పరిమితంగా మాత్రమే ఉన్నారు. చాలామంది ట్రైనర్లు ప్రొటీన్ ఫుడ్ అంటూ బాడీబిల్డర్లకు మార్కెట్లో దొరికే రకరకాల సప్లిమెంట్లను , స్టెరాయిడ్లను సూచిస్తున్నారు. కానీ వాటిని తీసుకుంటున్న వారిలో అనారోగ్య సమస్యలు ఎంతో తీవ్రంగా ఉంటున్నాయి. మార్కెట్లో లభిస్తున్న సప్లిమెంట్ల దుష్ఫలితాలను పరిశీలిస్తే అదంతా ఒక పెద్ద మాఫియా అని అర్థమవుతుంది ఎవరికైనా. కంస్యూమరిజం సంస్క్రుతిలో అందరూ కొట్టుకుపోతున్నారు. అంతేకాదు బరువు తగ్గడం దగ్గరి నుంచి బాడీ బిల్డింగ్ వరకూ ప్రతి దాంట్లో వేగంగా ఫలితాలు కనిపించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే పూర్వం మన పెద్దవాళ్లు అనుసరించిన సంప్రదాయబద్ధమైన ఫుడ్ కల్చర్ ఎంతో మంచిది. కానీ ఆ ఫుడ్ కల్చర్ నేడు పూర్తిగా అద్రుశ్యమైపోతోంది. రసాయనాల వాడకం పెరిగి ప్రజలు తీసుకుంటున్న ఆహారం విషమయం అవుతోంది. నేను ఫిట్నెస్ కోసం తీసుకుంటున్న ఆహారం పాతతరం వాళ్లు చెప్పినదే. గత కొన్నేళ్లుగా నేను హైదరాబాదులో ఫిట్ నెస్ ట్రైనర్ గా పలువురికి శిక్షణ ఇస్తున్నా. బాడీ బిల్డర్లు కావలని ఎందరో పురుషులు, స్త్రీలు నా దగ్గరకు ట్రైనింగ్ కు వస్తున్నారు. సినీతారలు, పారిశ్రామికవేత్తలు కూడా నా క్లయింట్లలో ఉన్నారు. వీరికే కాకుండా ఊబకాయులైన చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా. నేనెప్పుడు చెప్తుంటా ఈ రంగంలో నా సక్సెస్ కి ఒకటే కారణం. నా శరీరాన్ని నేను ఎంతో ప్రేమిస్తా. నా శరీరానికి తగ్గట్టు నా వ్యాయామాలు, ఫుడ్ అన్నీ నేనే డిజైన్ చేసుకుంటా. ఫిట్నెస్, ఆహారం విషయంలో టైము తప్పకుండా వ్యవహరిస్తా. నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు అందరూ పూర్తి శాకాహారులం. నా సక్సెస్ తన స్ఫూర్తి అని మా బాబు అంటాడు. శరీర ఆరోగ్యం విషయంలో వారిది కూడా నా తోవే…’’ అని వెంకటేశన్ చెప్పుకొచ్చారు.

-నాగసుందరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News