కేవలం అరటి పండ్లే కాదు, అరటి పువ్వులు కూడా మనకు మేలు చేస్తాయి. అరటి పువ్వును కూరగా లేదా పచ్చడి రూపంలో తయారు చేసి తినవచ్చు. దీన్ని సలాడ్స్, సూప్గాను తయారు చేసి తింటారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం తగ్గేలా చేస్తుంది.
అరటి పువ్వులో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, టానిన్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
అరటి పువ్వులో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీని నియంత్రిస్తాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.
అరటి పువ్వు గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక దీన్ని తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరగవు. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
మహిళలు రుతు సమయంలో ఈ పువ్వులను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ పువ్వులను తినడం వల్ల అతిగా రక్తస్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నెలసరి సక్రమంగా వస్తుంది.
అరటి పువ్వును తింటే బాలింతల్లో పాలు బాగా పడతాయి. ఈ పువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక ఈ పువ్వులను తింటే హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది.