ఈ రోజుల్లో సిగరెట్ తాగడం అనేది చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది. అయితే గుట్కా నమలడం ఇప్పుడు ఎంతో మందికి అలవాటైంది. పొగాకుతో తయారయ్యే ఈ సిగరెట్, గుట్కా వల్ల ప్రాణాలకే ప్రమాదం. అయితే సిగరెట్ తాగడం కంటే పొగాకు నమలడం ఇంకా డేంజర్ అని మీకు తెలుసా..
సిగరెట్ తాగడం కంటే పొగాకు నమలడం మరింత వేగంగా, తీవ్రంగా క్యాన్సర్‌కు దారితీస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. గుట్కా, పాన్ మసాలా, జర్దా వంటి పొగలేని పొగాకు ఉత్పత్తులు సిగరెట్ల కంటే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి.
పొగాకులో ఉండే కెమికల్స్ నేరుగా నోరు, గొంతు కణాలను దెబ్బతీసి, క్యాన్సర్ వేగంగా, మరింత తీవ్రంగా అభివృద్ధి చెందేలా చేస్తాయి. పొగాకులో ఉండే నైట్రోసమైన్స్ (TSNAs), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) వంటి ప్రమాదకరమైన పదార్థాలు DNAను నాశనం చేస్తాయి.
సిగరెట్ పొగ కొంతవరకు వాతావరణంలో చెదిరిపోతుంది. కానీ నమిలే పొగాకు నేరుగా నోటి లోపలి కణజాలంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.
ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా మంది పొగాకు నములుతుంటారు. అయితే ఇది క్యాన్సర్‌తోపాటు పంటి క్షయం, చిగుళ్ల వ్యాధులు, జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది. పొగాకు సంబంధిత క్యాన్సర్లు అడ్వాన్స్డ్ స్టేజ్‌లో గుర్తించడం వలన చికిత్స కష్టతరం అవుతుంది.
నోరు, నాలుక, గొంతు, అన్నవాహిక క్యాన్సర్లకు సాధారణంగా శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ వంటి సంక్లిష్ట, ఖరీదైన చికిత్సలు చేయాలి. పొగాకును పీల్చినా లేదా నమిలినా అది ప్రాణాంతకమేనని.. ఈ అలవాటును త్వరగా మానుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.