అల్లం ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది వంటలకు రుచిని పెంచడమే కాకూండా, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అల్లం జింజెరాల్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ గుణాలు వాంతులు, మలబద్ధకం, వాపు, ఒత్తిడి, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అయితే అల్లాన్ని మోతాదుకు మించి తినడం కూడా మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
జీర్ణక్రియకు అల్లం మంచిదే అయినప్పటికీ కొన్ని అధ్యయనాల ప్రకారం.. అల్లం ఎక్కువగా తినడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
అల్లం ఎక్కువగా తీసుకుంటే అలెర్జీని కలిగిస్తుంది. చర్మంపై మచ్చలు, దురద, దద్దుర్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తవచ్చు.
అల్లంలో రక్తపోటును తగ్గించే గుణాలు ఉంటాయి. కావున తక్కువ రక్తపోటు ఉన్నవారు అల్లాన్ని అతిగా తీసుకోవడం మానుకోవాలి.
గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్నెస్, వాంతులు రాకుండా గర్భిణులు అల్లం తీసుకుంటారు. అయితే, దీని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే గర్భస్రావం లేదా బిడ్డ పెరుగుదలపై ప్రభావం పడవచ్చు.