ఏటీఎంలు బ్యాంకింగ్ రంగంలో అనూహ్య మార్పుని తెచ్చాయి. ఏటీఎంలు బ్యాంకింగ్ సేవలను సులభతరం చేశాయి. బ్యాంకుల్లో క్యూలో నిలుచోకుండానే డబ్బు విత్ డ్రా చేసుకునే వీలు ఉంది.
ఇక బ్యాంకులు ఇచ్చే డెబిట్ లేదా ఏటీఎం కార్డులు దుర్వినియోగం కాకుండా ఓ పిన్ నెంబర్ కూడా ఉంటుంది. ఏటీఎంలో డెబిట్ కార్డు పెట్టి పిన్ నెంబర్ ఎంటర్ చేస్తేనే డబ్బులు వచ్చేది. ఇక్కడివరకూ అందరికీ తెలిసిందే. కానీ.. ఏ కార్డు పిన్ నెంబర్ చూసినా నాలుగు అంకెలకు మించదు. ఇలా ఎందుకు అన్న సందేహం ఎప్పుడైనా కలిగిందా? మరి సమాధానం తెలుసుకుందాం పదండి.
1925లో మేఘాలయలోని షిల్లాంగ్‌లో జన్మించిన ఇంజినీర్ జాన్ షెపర్డ్ బ్యారన్ ఈ ఏటీఎంను కనుగొన్నారు. ఆయన 1969లో ఏటీఎం యంత్రాన్ని కనిపెట్టారు.
ఓ రోజు స్నానం చేస్తుండగా ఆయనకు ఈ యంత్రాన్ని డిజైన్ చేయాలన్న ఐడియా వచ్చింది. మరి బ్యాంకు కస్టమర్లు మాత్రమే ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసుకునేలా ఏం చేయాలా అని ఆలోచించగా పిన్ నెంబర్ ఆలోచన మదిలోమెదిలింది.
మొదట ఆయన ఏటీఎం కార్డు పిన్ నెంబర్‌కు ఆరు సంఖ్యలు ఉంటే భద్రతాపరంగా ఎటువంటి ఢోకా ఉండదు అని అనుకున్నారట. ఇదే విషయాన్ని తన భార్య కెరోలిన్కు చెప్పగా ఆమె పెదవివిరిచిందట.
ఆరు సంఖ్యలు గుర్తుపెట్టుకోవడం మహా కష్టం అని కెరోలిన్ కుండబద్దలు కొట్టిందట. దీంతో..ఆయన నాలుగు అంకెలున్న పిన్ నెంబర్‌తో ఏటీఎం యంత్రాన్ని డిజైన్ చేశారు.
అలా, జాన్ షెపర్డ్ సతీమణి మతిమరుపే తరువాతి కాలంలో మనందరి పాలిట వరంగా మారింది. ఈజీగా గుర్తుండిపోయే నాలుగు అంకెల ఏటీఎం పిన్ ఉనికిలోకి వచ్చింది. అప్పట్నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది.
అయితే.. నాలుగు అంకెలు ఏవో దొంగలు సులభంగా గుర్తించే అవకావం ఉండటంతో ఏటీఎంలో అనేక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ముఖ్యంగా మూడుసార్లకు మించి ఏటీఎంలో తప్పు పిన్ ఎంటర్ చేస్తే ఆరోజుకు కార్డు బ్లాక్ అయిపోవడంతో పాటూ కస్టమర్లకు కార్డ్ బ్లాక్ అయిన విషయం ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది.