మనం వాడే రకరకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, క్లీనింగ్ పదార్థాలు, బ్యూటీ ఉత్పత్తులు నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల ఇళ్లు, ఆఫీసుల్లో గాలి కలుషితం అవుతుంటుంది. ఇలాంటి కలుషిత గాలిని పోగొట్టి స్వచ్ఛమైన గాలితో ఇంటిని, ఆఫీసుని నింపే మొక్కలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో వెదురు మొక్క ఒకటి. ఇది గాలిలోని వ్యర్థాలను పీల్చుకుని గాలిని శుభ్రంచేస్తుంది. ఇల్లు లేదా ఆఫీసుల్లో టేబుల్స్, కుర్చీల పక్కన ఈ మొక్కను పెట్టుకోవచ్చు. ఇది పెరగడానికి రోజూ నీళ్లు పొయ్యాల్సిన అవసరం కూడా లేదు.
ఇంకో మొక్క పీస్ లిల్లీ. ఇది రెండు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. తెల్లని పూలు, ముదురు ఆకుపచ్చని ఆకులతో చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. పొడిగా, సారవంతంగా ఉండే మట్టి పోసిన కుండీలో దీన్ని పెంచాలి. ఇది పెరగడానికి ద్రవరూపంలో ఉండే ఎరువులను వేయాలి. దీని కాండం చివర వచ్చే పిలకల్ని తీసి విడిగా నాటితే కొత్త మొలకలు వస్తాయి. ఈ మొక్క ఫ్లోరోసెంట్ లైట్ కింద పెడితే బాగా పెరుగుతుంది. ఇళ్లు, ఆఫీసుల్లో పెట్టుకునే మరో మొక్క శాన్ వెరియా. అంతగా పోషణ అవసరం లేకుండా పెరిగే మొక్క ఇది. ఇది ఇంట్లో ఉంటే ఆక్సిజన్ సిలిండర్ ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క గాలిని శుభ్రంచేస్తుంది.
మరో మొండి మొక్క కలబంద. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా సులభంగా పెరిగే మొక్క ఇది. దీనికి ఎక్కువ నీరు అవసరం ఉండదు. తక్కువ స్థలంలో సైతం ఇది బాగా పెరుగుతుంది. గాలిని శుధ్ధిచేసే గుణం దీని ప్రత్యేకత. దీన్ని తగినంత వెలుతురు ఉన్న చోట పెడితే బాగా ఎదుగుతుంది. దీని ఆకుని కత్తిరించి మట్టిలో లేదా కుండీలో నాటితే చాలు ఇది పెరుగుతుంది. ఇంకోటి స్పైడర్ మొక్క. ఇది నీడపట్టున పెరుగుతుంది. ఆఫీసులో, గదుల వరండాలలో దీన్ని పెట్టి పెంచుకోవచ్చు. ఈ మొక్క గాలిని శుభ్రం చేస్తుంది. కాలుష్యాన్ని పోగొట్టే మరో మొక్క జెర్బరా డైసీ. దీనికి గుండ్రపు ఆకారంలో ఉన్న పూలు రకరకాల రంగుల్లో పూస్తాయ. ఈ మొక్క గాలిని బాగా శుద్ధిచేస్తుంది. ఇంటి అలంకరణలో కూడా దీనిని వాడొచ్చు. ఇది వెలుతురులో పెరుగుతుంది. ఎండ ఎక్కువ సేపు పడే చోట కుండీల్లో వేసి దీనిని పెంచుకోవచ్చు.
జెరానియం అనే మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మొక్క మంచి సువాసనలు చిందిస్తుంది. దోమలు రాకుండా చేయడంలో ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది ఇంటిలోపల పెరిగే మొక్క అయినా వెలుగు తప్పనిసరిగా దీనికి కావాలి. వేళ్లు పొడిబారకుండా నీళ్లు పోస్తుండాలి. పుదీనా మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మొక్క గాలిని శుద్ధిచేస్తుంది. ఈ మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీన్ని కుండీలో నాటొచ్చు. కుండిలోని మట్టిలో నీరు నిలవ ఉండకుండా చూసుకుంటూ దీన్ని పెంచాలి. గాలిలోని కాలుష్యాన్ని తగ్గించే గుణం చామంతి మొక్కకూ ఉంది. ముఖ్యంగా సిగరెట్ నుంచి వచ్చే రసాయనాన్ని, గాలిని శుభ్రం చేయడంలో చేమంతి పూలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. గాలి ఎక్కువగా తగిలే ప్రదేశంలో, నీళ్లు నిలవని సారవంతమైన మట్టిలో చామంతిని పెంచాలి. ఉదయంపూట ఎండ బాగా పడే ప్రదేశంలో ఈ మొక్కను ఉంచి పెంచాలి. మనీ ప్లాంట్ కూడా గాలిని శుభ్రపరిచే ప్యూరిఫైయింగ్ ప్లాంట్. అందుకే ప్రతి వంద చదరపు అడుగులకు ఒక మొక్క చొప్పున ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచితే అవి మీ ఇంటిని పరిశుభ్రమైన గాలితో నింపడమే కాదు మిమ్మల్ని కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.