Thursday, March 13, 2025
Homeహెల్త్హెచ్‌పీవీ వ్యాక్సిన్ అవగాహన పెంచేందుకు అపోలో క్రెడిల్ కార్యక్రమం.. వైద్యుల సూచనలు ఇవే..!

హెచ్‌పీవీ వ్యాక్సిన్ అవగాహన పెంచేందుకు అపోలో క్రెడిల్ కార్యక్రమం.. వైద్యుల సూచనలు ఇవే..!

మహిళల ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం కోసం అపోలో క్రెడిల్, చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎంఎస్డీ ఫార్మాస్యూటికల్స్ కలిసి ‘టుగెదర్ ఫర్ హర్ వెల్‌ బీయింగ్’ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. 2022లో భారతదేశంలో 1.5 లక్షల కంటే ఎక్కువ హెచ్‌పీవీ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మహిళల్లో రెండో అతిపెద్ద క్యాన్సర్‌గా సర్వైకల్ క్యాన్సర్ మారింది. ఈ సమస్యల నేపథ్యంలో బంజారా హిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో మీడియా సమావేశం జరిగింది.

- Advertisement -

ఈ సందర్భంగా అపోలో క్రెడిల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ (జూబ్లీ హిల్స్) సీనియర్ వైద్యురాలు డాక్టర్ మహితా రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. గైనకాలజిస్టును కలవడం, హెచ్‌పీవీ వ్యాక్సిన్ వంటి టీకాల గురించి తెలుసుకోవడం, స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, నివారణ చర్యలు తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు. ఇది కేవలం చికిత్స గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు.

అపోలో క్రెడిల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ (కొండాపూర్) సీనియర్ వైద్యురాలు డాక్టర్ పద్మిని శిల్ప మాట్లాడుతూ ప్రతి మహిళ తనను తాను రక్షించుకునే శక్తి కలిగి ఉందని.. ముఖ్యంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ గురించి అవగాహన పెంచుకోవాలని అన్నారు. దీనివల్ల హెచ్‌పీవీ సంబంధిత వ్యాధులు, గర్భాశయ క్యాన్సర్ వంటివి రాకుండా నివారించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఏడాది గైనకాలజిస్ట్‌ను కలిసి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి అని సూచించారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మహిళలు ఆరోగ్యంగా ఉండవచ్చు అని అన్నారు.

డాక్టర్ జాస్మిన్ రాథ్ మాట్లాడుతూ ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, శరీరంలో వచ్చే మార్పులను గమనించడం, నివారణ చర్యలు తీసుకోవడం, ఏటా వైద్య పరీక్షలు చేయించుకోవడం, స్క్రీనింగ్‌లో పాల్గొనడం వంటివి చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు అని అన్నారు. వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమమని సూచించారు.

గైనకాలజిస్టులు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి: 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు వచ్చిన అమ్మాయిలు గైనకాలజిస్టును కలవాలి. నెలసరి ప్రారంభం అయినా, కాకపోయినా ప్రతి సంవత్సరం వైద్యుడిని కలవడం మంచిది. ప్రతి మహిళ తనకు అవసరమైన టీకాల గురించి తెలుసుకోవాలి. తల్లులు తమ పిల్లల టీకాల షెడ్యూల్‌ను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. హెచ్‌పీవీ వ్యాక్సిన్, ఎంఎంఆర్, హెపటైటిస్ బీ, వరిసెల్లా వంటి టీకాలు వేయించుకోవాలి. అవసరమైన ఆరోగ్య పరీక్షల గురించి డాక్టర్‌తో మాట్లాడాలి. పాప్ స్మియర్, బ్రెస్ట్ స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, శరీర బరువు నిర్వహణ ముఖ్యం. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డీ, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు తీసుకోవాలి. ఆకుకూరలు, గింజలు, గింజల నూనెలు, పాల పదార్థాలు తీసుకోవాలి. ఒత్తిడి, నిద్రలేమి వల్ల రుతు చక్రం సరిగ్గా ఉండదు. ధ్యానం, యోగా, తగినంత నిద్ర అవసరమని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News