Saturday, November 15, 2025
Homeహెల్త్Betel Beauty: తమలపాకుతో తలదన్నే అందం

Betel Beauty: తమలపాకుతో తలదన్నే అందం

మీరు ఇంట్లోనే ఈ తీగలను పెంచుకోవచ్చు కూడా

తమలపాకుల్లో బ్యూటీని కాపాడే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. తమలపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ సుగుణాలు ఉన్నాయి. ఇవి యాక్నే లక్షణాలను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. కొన్ని తమలపాకులను తీసుకుని వాటిని నీటిలోనానబెట్టి ఆ నీటితో ముఖం కడుక్కోవచ్చు. లేదా తమలపాకులను పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని ఐదు నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే చర్మం శుభ్రం అయి ఆరోగ్యంగా ఉంటుంది.

- Advertisement -

పొడిచర్మం, ఎలర్జీలు, ఇతర చర్మసంబంధమైన సమస్యల వల్ల దురద,మంటలు, దద్దుర్లు తలెత్తుతాయి. తమలపాకుల్లో సాంత్వన నిచ్చే లక్షణం ఉంది. ఇది చర్మంపై తలెత్తిన ఇరిటేషన్, దద్దుర్లు వంటివాటిని శక్తివంతంగా నివారిస్తుంది. పది తమలపాకులను నీళ్లల్లో ఉడకబెట్టి స్నానం చేసే నీళ్లల్లో ఆ నీటిని కలిపాలి. ఇలా తమలపాకులతో నిత్యం స్నానం చేస్తే ఈ ఆకుల్లోని యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల చర్మంపై మంట, దురద, వాపు ఉంటే అవి తగ్గుతాయి. శరీరం నుంచి వచ్చే దుర్వాసనను కూడా తమలపాకులు తగ్గిస్తాయి. నీటిలో బీటిల్ లీవ్స్ ఆయిల్ (తమలపాకునూనె) ను కొద్దిగా వేసి స్నానం చేస్తే శరీరం తాజాగా ఉండడమే కాకుండా, శరీర దుర్వాసనకు కారకమైన బాక్టీరియాను తమలపాకు ఆయిల్ నివారిస్తుంది. ఉడకబెట్టిన నీళ్లల్లో తమలపాకులు నానబెట్టి వాటితో డ్రింకు చేసి తాగితే కూడా ఎంతో మంచిది. ఈ డ్రింకును రోజూ తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పోతాయి.

దంతక్షయం తగ్గడానికి, చిగుళ్ల బలోపేతానికి తమలపాకులను పూర్వకాలం నుంచీ వాడుతున్న ఘన చరిత్ర మనది. చర్మాన్ని తెల్లగా చేసే గుణాలు కూడా తమలపాకుల్లో ఉన్నాయి. చర్మంపై ఉండే నల్ల మచ్చలను కూడా తమలపాకులు నివారిస్తాయి. తమలపాకుల్లోని యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా అన్ని రకాల మచ్చలను,మొటిమలను నివారించడంలో బాగా పనిచేస్తాయి. కళ్ల కింద ఏర్పడిన వాపు, సంచులు పోయేందుకు తమలపాకు ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.. దద్దుర్లు ఏర్పడిన చోట తమలపాకు పేస్టు రాస్తే మంచి ఫలితం ఉంటుంది అవి తగ్గుతాయి. చర్మం ఇన్ ఫెక్షన్ కు గురికాకుండా కూడా ఇది సంరక్షిస్తుంది. తమలపాకుల్లోని యాంటీబాక్టీరియల్ గుణాలు దురద, నొప్పుల కారణంగా ఎదరయ్యే బాధలను నివారిస్తుంది. యాక్నేను నిరోధిస్తుంది. వారానికి రెండుసార్లు తమలపాకు పేస్టు ముఖానికి రాయడం వల్ల యాక్నే సమస్య తగ్గుతుంది.

కొన్ని తమలపాకులను తీసుకుని అందులో పెరుగు, ముల్తానీ మట్టి లేదా మీ చర్మానికి సరిపడే ఏదైనా పదార్థం కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని అది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కేవలం తమలపాకు పేస్టును ముఖానికి రాసుకున్నా కూడా చర్మం ఎంతో తాజాదనంతో మెరుస్తుంది. తమలపాకులతో చేసిన ఫేస్ వాష్ కూడా ముఖానికి ఎంతో మంచిది. ఇది చర్మంపై చేరిన బాక్టీరియాను తొలగిస్తుంది. నీళ్లల్లో కొన్ని తమలపాకులు వేసి ఉడికించాలి. తర్వాత ఆ నీళ్లను వడగట్టాలి. ఆకుపచ్చని రంగులో ఉండే ఆ నీళ్లను బాగా చల్లార్చి ముఖాన్ని కడుక్కోవాలనుకున్నప్పుడల్లా ఆ నీటిని వాడొచ్చు. వెంట్రుకలు రాలిపోకుండా కూడా తమలపాకులు పనిచేస్తాయి.

తమలపాకుల్లో నువ్వులనూనె లేదా కొబ్బరినూనె కొద్దిగా వేసి మెత్తగా నూరాలి. ఆ పేస్టును మాడుకు రాసుకొని గంటసేపు అలాగే ఉంచుకుని ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే శిరోజాలు రాలిపోకుండా ద్రుఢంగా ఉంటాయి. యాక్నే ఉన్న చోట తమలపాకు పేస్టు రాస్తే అది పోతుంది. ఫంగస్ వ్రుద్ధికాకుండా తమలపాకులు నివారిస్తాయి. పలు అలర్జిక్ రియాక్షన్లపై కూడా ఇవి ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. గాయాలు తొందరగా మానేలా చేస్తాయి. గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad