శిరోజాలు, చర్మ సంరక్షణకు పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది. పెరుగు జుట్టును నిగ నిగలాడేట్టు చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. నిత్యం చేసుకునే బ్యూటీ రొటీన్ లో పెరుగు ఎంతో కీలకం. అంతేకాదు నేచురల్ బ్యూటీ రొటీన్ లో పెరుగుకు ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైంది కూడా. జుట్టుకు డీప్ కండిషనర్ గా పెరుగు బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా పెరుగు తీసుకుని మాడుకు రాసుకుని అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో వెంట్రుకలను శుభ్రంచేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. పొడారినట్టు, పీచులా ఉండే జుట్టు ఉన్నవాళ్లు, శిరోజాల టెక్స్చెర్ దెబ్బతిన్నవాళ్లు పెరుగులో కొబ్బరినూనె లేదా బాదం నూనె కొన్ని చుక్కలు వేసి దానితో మాడును మసాజ్ చేసుకుంటే జుట్టు నిగనిగలాడుతుంది. పెరుగులో బయొటిన్ లాంటి సహజసిద్ధమైన ప్రొటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఉండేట్టు చేస్తాయి. అలాగే మాడుకు నిత్యం పెరుగు రాసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇది శాశ్వత పరిష్కారం కాకపోయినా చుండ్రు సమస్యను నివారిస్తుంది.
మాడుపై తలెత్తే ఇరిటేషన్, చర్మం పొట్టులా ఊడడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పెరుగులో కొన్నినిమ్మరసం చుక్కలు లేదా రెండు మూడు టేబుల్ స్పూన్ల అలొవిరా జెల్ వేసి బాగా కలిపి ఆ పేస్టును మాడుకు రాసుకొని అరగంటసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తేలికపాటి యాంటి డాండ్రఫ్ షాంపుతో తల రుద్దుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాదు పెరుగు జుట్టును ద్రుఢంగా చేస్తుంది. పెరుగులోని ప్రొటీన్ల వల్ల జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. పెరుగులోని ప్రొటీన్ల వల్ల జుట్టు కుదుళ్లు బలిష్టంగా తయారవుతాయి. ఇంట్లో చేసుకున్న పెరుగును వారానికి రెండుసార్లు మాడుకు పెట్టుకొని కొద్దిసేపైన తర్వాత తేలికపాటి నేచురల్ షాంపు, కండిషనర్ల తో తలను శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ద్రుఢంగా ఉంటాయి.
స్కిన్ కేర్ రొటీన్ లో కూడా పెరుగు కీలకంగా వ్యవహరిస్తుంది. పెరుగు చర్మంపై టానింగ్ పోగొడుతుంది. సూర్యరశ్మి వల్ల చర్మంపై ఏర్పడే బర్న్స్ ను తగ్గిస్తుంది. పెరుగులో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల చర్మానికి వాడే పలు ప్యాకుల్లో పెరుగును వాడతారు కూడా. చర్మంపై ఏర్పడ్డ సన్ బర్న్స్ పై పెరుగును రాసి పది పదిహేను నిమిషాలు ఉంచాలి. ఇలా పెరుగు రాయడం వల్ల సన్ బర్న్స్ మంట తగ్గుతుంది. చర్మంపై ఉన్న ట్యాన్ పోవడానికి అరకప్పు శెనగపిండి తీసుకుని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని నిమ్మరసం, రోజ్ వాటర్ చుక్కలు కూడా వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని చర్మంపై రాసుకోవాలి. అది బాగా ఎండిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే టాన్ పోయి చర్మం మిల మిల మెరుస్తుంది. ఇంట్లో తయారుచేసుకున్న స్వచ్ఛమైన పెరుగులో యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ సుగుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి పెరుగును చర్మంపై రాస్తే మంచి ఫలితం కనపడుతుంది. పెరుగు జుట్టుకే కాదు చర్మానికి కూడా సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. నార్మల్ స్కిన్ నుంచి డ్రై స్కిన్ వరకూ అన్ని రకాల చర్మానికి కావలసిన హైడ్రేషన్ ని పెరుగు అందిస్తుంది.
చర్మ నాణ్యతను ఎంతో వేగంగా పెంచుతుంది. పెరుగులో ఒక చెంచా తేనె కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖం, మెడ, డ్రై పాచెస్ పై అప్లై చేసి మసాజ్ చేసి పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మంలోకి తేమదనం బాగా ఇంకి చర్మం కాంతివంతంగా అవుతుంది. అంతేకాదు పెరుగులో యాంటి యాక్నే సుగుణాలు కూడా బాగా ఉన్నాయి. ముందరే చెప్పినట్టు పెరుగులో యాంటీ బాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల యాక్నే నివారణంలో పెరుగు ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. పెరుగు లేదా పెరుగుతో పాటు అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మానికి కావలసిన హైడ్రేషన్ అంది యాక్నే మచ్చలను కూడా తగ్గుతాయి.