Saturday, November 15, 2025
Homeహెల్త్Kidney Damage : కిడ్నీలకు 'కిల్లర్' అలవాట్లు ఇవే.. మీ రోజువారీ పనులే మూత్రపిండాలకు ముప్పు!

Kidney Damage : కిడ్నీలకు ‘కిల్లర్’ అలవాట్లు ఇవే.. మీ రోజువారీ పనులే మూత్రపిండాలకు ముప్పు!

Common habits that damage the kidneys : శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ఒక సైలెంట్ సైనికుడు… కిడ్నీ! మన ఆరోగ్యాన్ని కాపాడే ఈ కీలక అవయవం గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల మంది ఏదో ఒక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, మనం రోజూ ఎలాంటి ఆలోచనా లేకుండా చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన కిడ్నీల పాలిట శాపంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, చేజేతులా మన కిడ్నీల ఆరోగ్యాన్ని పాడుచేసే ఆ అలవాట్లేమిటో తెలుసుకోకపోతే ప్రమాదంలో పడ్డట్టే..!

- Advertisement -

మన దైనందిన జీవితంలో భాగమైపోయిన కొన్ని అలవాట్లు మూత్రపిండాలపై ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయో చూద్దాం.

నొప్పి మాత్రలతో అతి జాగ్రత్త : చిన్న తలనొప్పి వచ్చినా, ఒళ్లు నొప్పులొచ్చినా వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకోవడం చాలామందికి అలవాటు. అయితే, వైద్యుని సలహా లేకుండా తరచూ నొప్పి నివారణ మందులు (NSAIDs) వాడటం మూత్రపిండాలను నేరుగా దెబ్బతీస్తుందని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ హెచ్చరిస్తోంది. ఈ మందులు కిడ్నీలకు జరిగే రక్త సరఫరాను తగ్గించి, దీర్ఘకాలంలో వాటి పనితీరును పూర్తిగా దెబ్బతీస్తాయి.

ఉప్పుతో ముప్పు : రుచి కోసం ఆహారంలో ఉప్పును అధికంగా వాడటం రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం. ఈ అధిక రక్తపోటు కిడ్నీల రక్తనాళాలను దెబ్బతీసి, వాటి వడపోత సామర్థ్యాన్ని క్రమంగా నాశనం చేస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఊరగాయలు వంటి వాటిలో సోడియం అధికంగా ఉంటుంది. వీటికి ఎంత దూరంగా ఉంటే కిడ్నీలకు అంత మంచిది.

నీళ్లు తాగకపోతే… నిలువునా దెబ్బే : పని ఒత్తిడిలో పడి చాలామంది సరిగ్గా నీళ్లు తాగడమే మరిచిపోతారు. శరీరానికి తగినంత నీరు అందకపోతే (డీహైడ్రేషన్), కిడ్నీలు వ్యర్థాలను బయటకు పంపడంలో విఫలమవుతాయి. ఇది దీర్ఘకాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

నిద్రలేమి… కిడ్నీలకు బడలికే : నిద్రకూ, కిడ్నీల ఆరోగ్యానికీ ప్రత్యక్ష సంబంధం ఉంది. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ నిర్వహించిన పరిశోధనల ప్రకారం, మన నిద్ర-మేల్కొలుపు విధానం (స్లీప్-వేక్ సైకిల్) కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. సరైన నిద్ర లేనప్పుడు ఈ సమతుల్యత దెబ్బతిని, కిడ్నీలపై అదనపు భారం పడుతుంది. రోజూ కనీసం 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర తప్పనిసరి.

తీపి మోజు… కిడ్నీలకు చేదు : అధిక చక్కెర వినియోగం ఊబకాయానికి, మధుమేహానికి దారితీస్తుంది. ఈ రెండు సమస్యలూ కిడ్నీ వ్యాధులకు అతిపెద్ద ప్రమాద కారకాలు. చక్కెర పానీయాలు, స్వీట్లు, బేకరీ పదార్థాలను తగ్గించడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు.

ధూమపాన  విషవలయం: పొగతాగడం వల్ల ఊపిరితిత్తులే కాదు, కిడ్నీలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ధూమపానం రక్తనాళాలను కుంచింపజేసి, కిడ్నీలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. అంతేకాదు, ఇది కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందని కిడ్నీ కేర్ యూకే (kidney care uk) స్పష్టం చేస్తోంది.

మద్యపానం.. మూత్రపిండాలకు హానికరం: అతిగా మద్యం సేవించడం వల్ల కిడ్నీల పనితీరు అస్తవ్యస్తమవుతుంది. ఇది శరీరంలో నీటి సమతుల్యతను దెబ్బతీసి, డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఫలితంగా రక్తపోటు పెరిగి, కిడ్నీలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad