Health risks of competitive eating : “అరగంటలో ఈ ‘బాహుబలి థాలీ’ తినేయండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి!” – ఈ మధ్యకాలంలో హోటళ్లు, రెస్టారెంట్లు భోజన ప్రియులను ఆకర్షించడానికి వేస్తున్న కొత్త ఎర ఇది. ఈ ప్రకటన చూడగానే, “ఓ పట్టు పడితే పోయేదేముంది?” అని చాలామంది ఉత్సాహంగా ఈ ‘ఫుడ్ ఛాలెంజ్’లకు సిద్ధమవుతున్నారు. కానీ, ఆ గెలుపు, ఓటముల మాట అటుంచితే, ఈ సరదా పోటీ మీ ప్రాణాలకే ముప్పు తెస్తుందని మీకు తెలుసా..? ఈ ఛాలెంజ్‌ల వెనుక దాగి ఉన్న ఆరోగ్య ప్రమాదాలపై వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
శరీరానికి ‘షాక్’.. జీర్ణవ్యవస్థ గందరగోళం : మన జీర్ణాశయం పరిమాణంలో సగం మాత్రమే ఆహారం తీసుకోవాలని, అప్పుడే జీర్ణప్రక్రియ సక్రమంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ, ఈ ఫుడ్ ఛాలెంజ్‌లలో ఆ పరిమితిని మించి, అతి తక్కువ సమయంలో, అధిక మొత్తంలో ఆహారాన్ని కడుపులోకి కుక్కేయాల్సి ఉంటుంది.
“ఏళ్ల తరబడి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవడానికి అలవాటుపడిన శరీరానికి, అకస్మాత్తుగా ఇంత పెద్ద మొత్తంలో ఆహారం చేరితే అది షాక్‌లాంటిది. జీర్ణవ్యవస్థ గందరగోళానికి గురై, ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.”
వైద్యులు హెచ్చరిస్తున్న ప్రమాదాలు : ఈ ఫుడ్ ఛాలెంజ్‌ల వల్ల తక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ (National Library of Medicine) అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
గ్యాస్ట్రోపరేసిస్: జీర్ణాశయం కండరాలు దెబ్బతిని, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం. దీనివల్ల తగ్గని వికారం, వాంతులు వస్తాయి.
గుండెపై భారం: గెలవాలనే ఒత్తిడి వల్ల గుండె వేగం పెరిగి, కొన్నిసార్లు గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది.
శ్వాసనాళంలోకి ఆహారం: వేగంగా, ఎక్కువ మొత్తంలో తినేటప్పుడు, ఆహారం అన్నవాహికకు బదులుగా శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరాడకుండా పోవచ్చు.
ఊబకాయం: తరచుగా ఇలాంటి ఛాలెంజ్‌లలో పాల్గొనడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
“శరీర తత్వం, తినగలిగే సామర్థ్యం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. నలుగురు తినే ఆహారాన్ని ఒక్కరే, అదీ తక్కువ సమయంలో తినడం అత్యంత ప్రమాదకరం.”
– డా. ఎం. జగన్‌మోహన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, విజయవాడ
ముందుంది ముప్పు : చాలామంది ఈ ఛాలెంజ్‌లలో గెలవలేక, ఆ భారీ భోజనానికి బిల్లు కట్టి వెనుతిరుగుతారు. కానీ, ఆ ఓటమితో పాటు, తెలియకుండానే కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. డబ్బు కోసం, సరదా కోసం మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని, ఇలాంటి ప్రమాదకరమైన ఛాలెంజ్‌లకు దూరంగా ఉండాలని వైద్యులు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.


