ఖర్జూరాలు సూపర్ ఫుడ్ అంటున్నారు పోషకాహారనిపుణులు. వీటిల్లో పోషక గుణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. వీటిని తిన్న వెంటనే శరీరంలో ఎనర్జీ పెరుగుతుందంటున్నారు. అంతేకాదు నూరు గ్రాముల ఖర్జూరాల్లో 300 కాలరీలు ఉంటాయట. వీటిల్లో ఫ్యాట్, పోషకాలు తక్కువే అయినప్పటికీ సెలీనియం, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎసెన్షియల్ ఖనిజాలు బోలెడు ఉన్నాయి. ఖర్జూరాల్లో ముఖ్యంగా విటమిన్లు బాగా ఉన్నాయి. ప్రధానంగా బికాంప్లెక్స్, విటమిన్ సిలు అధికంగా ఉన్నాయి.
అంతేకాదు అవసరమైన యాంటాక్సిడెంట్లు అంటే కెరటనాయిడ్స్, ఫెనొలిక్స్ వంటివి కూడా ఖర్జూరాల్లో బాగా ఉన్నాయి. ఖర్జూరం గుజ్జుతిని గింజలు పడేస్తుంటాం కదా. కానీ ఈ గింజల్లో సైతం ఖర్జూరం గుజ్జులో కన్నా ఎక్కువ ప్రొటీన్లు, ఫ్యాటు, డయటరీ పీచుపదార్థాలు,ఫెనొలిక్స్, యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. అంతేకాదు ఆకలిని తగ్గించే అన్ని రకాల ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు కూడా ఖర్జూరాల్లో ఉన్నాయి. వీటిని తింటే ఆకలి వేయదు. అలాగే భారీ కాయాన్ని పెంచే చిరుతిళ్లు తినే దురలవాటు ఉండదు కూడా. ఖర్జూరాల్లో ఉండే యాంటాక్సిడెంట్ల వల్ల గుండెజబ్బులు, ప్రొస్టేట్ కాన్సర్ వంటివి సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఖర్జూరాలను మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. ఖర్జూరాల్లో ఖునేజీ, ఖలాస్, ఖద్రావ్, మెద్జూల్, మజఫటి, సఫారి, బార్హి, ఒమానీ రకాలు ఉన్నాయి. వీటన్నింటిలోకి ఒమానీ ఖర్జూరాల్లో పోషకవిలువలు ఎక్కువగా ఉన్నాయని పోషకాహారనిపుణులు చెప్తున్నారు.
ఖర్జూరాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. మలబద్దకం తదితర సమస్యలు తగ్గుతాయి. రోజుకు ఏడు ఖర్జూరాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అంతేకాదు రోజుకు ఏడు ఖర్జూరాలు తినడం వల్ల ఒకరోజుకు అవసరమయ్యే 40 శాతం పీచుపదార్థాలు శరీరానికి అందుతాయట. కాన్సర్, ఇతర జబ్బులను నిరోధించడంలో కూడా ఖర్జూరాలు బాగా పనిచేస్తాయి. కాలేయం ఇన్ఫ్లమేషన్ ను ఇవి తగ్గిస్తాయి. ఖర్జూరంలో సహజసిద్ధమైన ఫ్రుక్టోజ్,గ్లూకోజ్ లు ఉన్నాయి.
ఇవి చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరంలో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల వాటిని తినడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. నరాల వ్యవస్థ బాగా పనిచేయడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. ఖర్జూరం రోజూ తినడం వల్ల వ్రుద్ధాప్యంలో తలెత్తే అల్జమీర్ వచ్చే రిస్కు కూడా తగ్గుతుంది. ఖర్జూరాలు తింటే యాంగ్జయిటీ తగ్గుతుందట. అలాగే ఇవి మనిషి జ్ఝాపకశక్తిని కూడా ఎంతో పెంపొందిస్తాయిట.
గర్భవతులు నిత్యం ఖర్జూరం తినడం వల్ల నేచురల్ డెలివరీలు అయ్యే ఛాన్ను బాగా ఉంది. స్త్రీలు మెనోపాజ్ లోకి ప్రవేశించేటప్పుడు తలెత్తే లక్షణాల తీవ్రతను కూడా ఖర్జూరాలు తగ్గిస్తాయని పలు అధ్యయాలల్లో వెల్లడయింది. రోజుకు ఎండు ఖర్జూరం ఒకటి తినడం వల్ల శరీరంలోని ఎముకలు పటిష్టమవుతాయని తేలింది. పోస్ట్ మెనోపాజ్ సమయంలో స్త్రీలలో తలెత్తే అనేక సమస్యల్లో ఎముకలు బలహీనపడ్డం ఒకటి. ఖర్జూరం తినడం వల్ల స్త్రీలకు ఆ వయసులో కావలసిన కాల్షియం అంది ఎముకలు బలపడతాయి. మెనోపాజ్ వల్ల తలెత్తే ఇలాంటి ఎన్నో సమస్యల నివారణకు ఖర్జూరం శక్తివంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వైద్యుల సలహాతో పరిమిత ప్రమాణంలో రోజూ ఖర్జూరం తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి…నిత్యం ఉత్సాహంతో ఉండండి.