Delayed Sleep Phase Syndrome : రాత్రిళ్లు స్నేహితులతో కబుర్లు, ఒంటిగంటకు అసైన్‌మెంట్లు, రెండు దాటాక వెబ్ సిరీస్‌లు.. తెల్లవారితే కళాశాలకు పరుగులు. నేటి యువతరం జీవనశైలికి ఇదొక అద్దం. అయితే, సరదాగానో, తప్పనిసరి పరిస్థితుల్లోనో చేస్తున్న ఈ ‘లేట్ నైట్’ జాగరణలు వారి భవిష్యత్తును నిశ్శబ్దంగా ఎలా చిధిమేస్తున్నాయో తెలుసా? నిపుణులు ఈ పరిస్థితిని ‘డిలేడ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్’ (DSPS) లేదా ‘మార్నింగ్ సిక్‌నెస్’ అని పిలుస్తున్నారు. అసలు ఏమిటీ సిండ్రోమ్? దీనివల్ల కేవలం జ్ఞాపకశక్తి తగ్గడమేనా, లేక ప్రాణాంతక వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉందా..? ఆందోళనకరమైన ఈ వాస్తవాలపై నిపుణుల విశ్లేషణ మీకోసం.
కుప్పకూలుతున్న జీవ గడియారం.. కారణాలివే : మన శరీరం ఒక జీవ గడియారం (సర్కేడియన్ రిథమ్) ప్రకారం పనిచేస్తుంది. చీకటి పడగానే నిద్రకు ఉపక్రమించి, వెలుతురు రాగానే మేల్కోవడం సహజ ప్రక్రియ. కానీ, ఆధునిక జీవనశైలి ఈ చక్రాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తోంది.
స్క్రీన్ వ్యసనం: అర్ధరాత్రి వరకు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్లకు అతుక్కుపోవడం ప్రధాన కారణం. అధిక ఫ్రీక్వెన్సీ కాంతికి కళ్లు అలసిపోవడమే కాక, నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, రోజుకు 6 గంటల కన్నా ఎక్కువ స్క్రీన్ చూసే వారిలో నిద్ర నాణ్యత దారుణంగా పడిపోతోందని, ఇది ఏకాగ్రత లేమి, పగటిపూట నిద్రమత్తుకు దారితీస్తోందని తేలింది.
ఒత్తిడి, ఆలస్య భోజనాలు: విద్యాసంస్థల్లో తీవ్రమైన పోటీ, అసైన్‌మెంట్ల భారం విద్యార్థులను అర్ధరాత్రి వరకు మేల్కొనేలా చేస్తున్నాయి. దీనికితోడు, రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయడం, పార్టీల పేరుతో బయట కొవ్వు పదార్థాలు తినడం జీవక్రియను దెబ్బతీసి, నిద్రలేమికి కారణమవుతోంది.
భావోద్వేగ అస్థిరత: నిద్రలేమి కారణంగా మెదడు పనితీరులో మార్పులు వచ్చి భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి సన్నగిల్లుతుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
యుక్తవయసులో తెలియదు.. భవిష్యత్తులో పెను నష్టం : యువ వయసులో ఈ నిద్రలేమి ప్రభావం పైకి కనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది పెను ఆరోగ్య సమస్యల సుడిగుండంలోకి నెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవక్రియా సంబంధిత వ్యాధులు: ఆలస్యంగా తినడం, నిద్రలేమి వల్ల జీర్ణక్రియ మందగించి శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఇది ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. అమెరికాలో ప్రతి ముగ్గురు పెద్దల్లో ఒకరు ఈ ‘మెటబాలిక్ సిండ్రోమ్’ బారిన పడ్డారని, భారత్‌లోనూ ఈ సంఖ్య వేగంగా పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
గుండె జబ్బులు, పక్షవాతం: నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, దీర్ఘకాలిక నిద్ర రుగ్మతలు గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్) ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.
మానసిక ఆరోగ్యం: నిద్రలేమి నేరుగా మానసిక ఆరోగ్యంపై దాడి చేస్తుంది. ఇది దీర్ఘకాలంలో నిరాశ (డిప్రెషన్), ఆందోళన వంటి సమస్యలకు కారణమవుతుంది.
పరిష్కారం సులభం.. మంచి నిద్రే అసలైన మందు: ఈ ప్రమాదకరమైన సిండ్రోమ్ బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవడమే ఉత్తమ మార్గం.
డిజిటల్ డిటాక్స్: పడుకోవడానికి కనీసం గంట ముందు మొబైల్స్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా పెట్టండి.
నిద్రకు ఓ సమయం: రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి.
శారీరక శ్రమ: వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించి, గాఢమైన నిద్రకు దోహదం చేస్తాయి.
సూర్యరశ్మి: ఉదయం పూట కాసేపు సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్, ఆనందాన్నిచ్చే సెరటోనిన్ హార్మోన్లు సక్రమంగా విడుదలవుతాయి. యువత ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టకుండా, తమ ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తిస్తే, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు వారే బాటలు వేసుకున్న వారవుతారు.


