ధనియాల నీళ్లు ఎప్పుడైనా తాగారా? దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ నీళ్లు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను అందిస్తాయి. ఉదయమే ధనియాల నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ధనియాలను రాత్రంతా నీళ్లల్లో నానబెట్టి పొద్దున్న లేచిన తర్వాత ఆ నీటిని వొడగట్టి తాగితే చాలు.
పోషకాలు అపరిమితంగా ఉండే ఈ నీళ్లను ఖాళీ కడుపుతో తాగడం వల్ల థైరాయిడ్ సమస్యల నుంచి సాంత్వన పొందుతారు. థైరాయిడ్ సమస్యలంటే ప్రధానంగా శరీరంలో తలెత్తే హార్మోన్లకు సంబంధించిన అసమతుల్యతలు, ఇతర్రా సమస్యలు. వాత, కఫ దోషాల్లోని అసమతుల్యత వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ముందే చెప్పినట్టు ధనియాలలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, పొటాషియంలతో సహా ఎన్నో ఖనిజాలు ఈ గింజల నీళ్లల్లో ఉన్నాయి. ధనియాల నీళ్లల్లో డైటరీ ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లు కూడా సమ్రుద్ధిగా ఉన్నాయి.
ధనియాల నీళ్లు ఎన్నో ఎసెన్షియల్ న్యూట్రియంట్ల నిధి. అంతేకాదు ధనియాల నీళ్లు జీర్ణశక్తి బాగా జరిగేలా సహకరిస్తాయి. నీళ్లల్లో ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టి పొద్దున్నే ఖాళీ కడుపుతో ఆ నీళ్లను తాగడం వల్ల గాస్ట్రోఇంటస్టైనల్ సమస్యల నుంచి సాంత్వన పొందుతాము. కడుపులో పోట్లు, ఎసిడిటీ , గ్యాసు వంటివి తలెత్తవు. గట్ హెల్త్ ఎంతో బాగుంటుంది. పైగా ధనియాల నీళ్లు బ్లడ్ షుగర్ ను సైతం క్రమబద్ధీకరిస్తుంది. ఈ విషయం అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. నిత్యం ధనియాల నీళ్లు తాగడం మధుమేహ నియంత్రణకు ఎంతో మంచిది.
అంతేకాదు ధనియాల గింజల్లో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వీటిని రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీళ్లను ఉదయం తాగడం వల్ల శరీరంలోని ఇన్ఫ్లమేషన్ బాధలు తగ్గుతాయి. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్లతో బాధపడేవాళ్లు ఈ నీళ్లను నిత్యం తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉందని డైటీషియన్లు కూడా అంటున్నారు. ఈ నీళ్ల వల్ల శరీరం యొక్క సాధారణ ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది.