Diabetic foot ulcer prevention and care : మధుమేహం.. ఆధునిక జీవనశైలి మనకిచ్చిన ఓ నిశ్శబ్ద మహమ్మారి. ఇది శరీరంలోని ప్రతి అవయవాన్నీ గుట్టుచప్పుడు కాకుండా దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యేవి పాదాలే. పాదంపై ఏర్పడిన ఓ చిన్న పుండు.. కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. ఏకంగా కాలునే తీసేసే పరిస్థితికి దారితీస్తుందంటే ఆశ్చర్యం కలగకమానదు. మన దేశంలో ఏటా సుమారు లక్ష మంది మధుమేహులు ఈ కారణంగానే తమ కాళ్లు, వేళ్లను కోల్పోతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎందుకీ దుస్థితి? చిన్న పుండు ప్రాణాంతకంగా ఎలా మారుతుంది? ఎలాంటి లక్షణాలను గమనించాలి? ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి..?
ఎందుకీ దుస్థితి? అసలు కారణాలేంటి? : మధుమేహం ఉన్నవారిలో దాదాపు 15-20 శాతం మందికి జీవితకాలంలో పాదాలపై పుండ్లు (Diabetic Foot Ulcers) ఏర్పడే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయడం, అది పెద్దగా ముదిరేంత వరకు వైద్యులను సంప్రదించకపోవడమే పెను శాపంగా మారుతోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
రక్త ప్రసరణ తగ్గడం: రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు అధికంగా ఉండటం వల్ల రక్తనాళాలు గట్టిపడి, వాటి లోపలి మార్గం సన్నగా మారుతుంది. దీనివల్ల గుండెకు అత్యంత దూరంగా ఉండే పాదాలకు రక్త సరఫరా గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా చిన్న గాయమైనా అది మానడం కష్టమవుతుంది, ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది.
స్పర్శ కోల్పోవడం (న్యూరోపతీ): అధిక చక్కెర స్థాయిల వల్ల నరాలు దెబ్బతిని పాదాల్లో స్పర్శజ్ఞానం తగ్గిపోతుంది. దీనివల్ల పాదాలకు గాయమైనా, చెప్పులో రాయి గుచ్చుకున్నా, వేడి తగిలినా నొప్పి తెలియదు. ఆ గాయాన్ని గుర్తించేసరికే అది పెద్ద పుండుగా మారి, ఇన్‌ఫెక్షన్ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఈ ముప్పును మరింత రెట్టింపు చేస్తాయి.
చిన్నగా మొదలై.. పెను ప్రమాదంగా : ఈ సమస్య తొలిదశలో పాదాలపై చర్మం ఎర్రబడటం, వేడిగా అనిపించడం, వాపు రావడం వంటి లక్షణాలతో మొదలవుతుంది. కొందరిలో చీమలు పాకినట్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించవచ్చు. ఈ దశలో అప్రమత్తం కాకపోతే, ఆ ప్రదేశంలో చర్మం దానంతటదే పుండుగా మారుతుంది. దీనికి ఇన్‌ఫెక్షన్ తోడైతే చీము పట్టి, కణజాలం కుళ్లిపోయి ‘గ్యాంగ్రీన్’గా పరిణమిస్తుంది. ఈ దశలో ఇన్ఫెక్షన్ ఎముకలకు, రక్తంలోకి పాకకుండా నిరోధించడానికి వైద్యులకు వేళ్లు, పాదం లేదా కాలును తొలగించడం తప్ప మరో మార్గం ఉండదు.
నివారణే నిజమైన మందు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి : నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ సూచనల ప్రకారం, కొన్ని కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా 85% వరకు అవయవాలు తొలగించాల్సిన పరిస్థితులను నివారించవచ్చు.
నిత్య పర్యవేక్షణ: మధుమేహులు ప్రతిరోజూ తమ పాదాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. పాదాల అడుగు భాగాన్ని చూసేందుకు అద్దాన్ని ఉపయోగించాలి. ఏవైనా రంగు మార్పులు, పగుళ్లు, పుండ్లు, బొబ్బలు ఉన్నాయేమో గమనించాలి.
పరిశుభ్రత: గోరువెచ్చని నీటితో పాదాలను రోజూ శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వేళ్ల మధ్య తడి లేకుండా మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి.
రక్షణ: ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పులు లేకుండా నడవకూడదు. సౌకర్యవంతమైన, సరైన సైజు కలిగిన పాదరక్షలనే వాడాలి.
రక్త ప్రసరణ: కూర్చున్నప్పుడు పాదాలను కాస్త ఎత్తులో పెట్టుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పాదాలను కదిలించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
గోళ్ల సంరక్షణ: గోళ్లను కత్తిరించేందుకు బ్లేడ్లు వాడకుండా, నెయిల్ కట్టర్‌ను ఉపయోగించాలి. గోళ్లను మరీ లోతుగా కాకుండా, తిన్నగా కత్తిరించుకోవాలి.
దురలవాట్లకు దూరం: పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. ఇది రక్తనాళాలను మరింత దెబ్బతీస్తుంది.
తాత్సారం తగదు : పాదాల మీద చర్మం రంగు మారినా, పాదాలు ఉబ్బినా, చురుకుగా నొప్పి పుట్టినా, మడమలు పగిలినా, వేళ్ల మధ్య ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం ద్వారా పెను ప్రమాదాన్ని నివారించవచ్చు.


