చిన్నారులు రోజుకొక గుడ్డు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాదు వారి బ్రెయిన్ కూడా ఎంతో చురుకుగా పనిచేస్తుందట. పిల్లల్లో జ్ఞాపకశక్తిని ఇది బాగా పెంచుతుందట. గుడ్డు పోషకాల నిధి. ఎమినో యాసిడ్, విటమిన్స్, ఐరన్, ఖనిజాలు, కెరటొనాయిడ్స్‌తో పాటు జబ్బులపై పోరాడే ల్యూటిన్, జెక్సాన్‌తిన్ వంటి పోషకాలు సైతం ఇందులో ఉన్నాయి. రోజుకు ఒక గుడ్డు తినడమంటే 75 కాలరీలు, ఏడు నుంచి ఎనిమిది గ్రాముల ప్రొటీను, ఐదు గ్రాముల ఫ్యాట్, 1.6 గ్రాముల శాచ్యురేటెడ్ ఫ్యాట్ శరీరానికి మనం అందించనట్టే. వీటితో పాటు కండరాలను శక్తివంతం చేసే, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు కూడా గుడ్డులో ఎన్నో ఉన్నాయి. కణాలు, టిష్యూల పునరుత్పత్తికి కూడా గుడ్డులోని పోషకాలు ఎంతగానో తోడ్పడతాయి. నిత్యం గుడ్డు తింటే జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు ఆలోచనా శక్తి, సృజనాత్మక శక్తి వృద్ధి చెందుతాయట. గుడ్డును తింటే మానసికంగా కూడా పిల్లలు బలంగా ఉంటారట. అలా అని గుడ్డు అతిగా పెట్టకండి. అలా చేస్తే గుడ్డు పచ్చసొనలోని కొవ్వుపదార్థాలు శరీరంలో బ్లడ్ షుగర్‌ని పెంచే ప్రమాదం ఉంది. ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరుగుతాయి. ఊబకాయం, గుండె జబ్బుల బారిన పడతారు.