గుడ్డులోని పచ్చసొన గుడ్డా…బ్యాడా?
గుడ్డులోని పచ్చసొన తినొచ్చా? లేదా అన్నది ఎంతోమందిని వేధించే సమస్య. నిజానికి గుడ్లు మనిషికి ఆరోగ్యకరమైన నేస్తంగా శతాబ్దాల తరబడి వస్తోంది. వీటిని వండడం కూడా చాలా సులభం. అంతేకాదు వీటిల్లో బోలెడు ఎసెన్షియల్ న్యూట్రియంట్లు ఉంటాయి. అంతా బాగానే ఉంది కానీ అసలు సమస్య గుడ్డులోని పచ్చసొనతోనే వస్తోంది. పచ్చసొన తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కొందరు భావిస్తే, మరికొందరేమో పచ్చసొన శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారమంటారు. వీటిల్లో ఏది నిజం? దేనిని నమ్మొచ్చు? పచ్చసొన తింటే మంచిది కాదని, తెల్లసొనే ఆరోగ్యానికి చాలా మంచిదనే అభిప్రాయం బాగా ఉంది. ఇంతకూ పచ్చసొన ఎందుకు వద్దంటే అందులో కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్లు బాగా ఉండడం వల్లే.
ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, మనుషులు బరువు పెరుగుతారని, రక్తపోటు ప్రమాణాలపై సైతం ఇది ప్రభావం చూపుతుందని ఎందరో గాఢంగా నమ్ముతున్నారు. శిల్పా ఆరోరా లాంటి పోషకాహారనిపుణుల ఉద్దేశంలో పోషకవిలువలు పుష్కలంగా ఉన్న పచ్చసొనలో అత్యధికంగా కొలెస్ట్రాల్ ఉంటుందని ఎందరో దానిని ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అయితే ఇటీవల చేబట్టిన పలు స్టడీల్లో గుడ్ల (పచ్చసొనతో తింటే) వల్ల గుండెజబ్బులు రావడం మాట అటుంచితే ఆ రిస్కును గుడ్లు బాగా తగ్గిస్తాయని వెల్లడైందని అంటున్నారు. అంతేకాదు పచ్చసొనలో కొలైన్ ఎక్కువగా కేంద్రీక్రుతమై ఉంటుందంటున్నారు. గుడ్డులోని పచ్చసొనలో కొలైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎసిటిల్ కొలైన్ కి చెందిన ముఖ్యమైన కాంపొనెంట్. ఇది మెదడులోని ప్రధాన న్యూరో ట్రాన్స్ మీటర్స్ లో ఒకటి కూడా.
గర్భధారణ సమయంలో, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే సమయంలో సరిపడినంత కొలైన్ సరఫరా చాలా అవసరం. ఎందుకంటే మెదడు వ్రుద్ధిచెందడానికి కొలైన్ చాలా ముఖ్యం. ఒక స్టడీ ప్రకారం వారానికి పచ్చసొనతో పాటు ఒక గుడ్డు తింటున్న వారిలో కన్నా కూడా వారానికి పచ్చసొనతో నాలుగు గుడ్లను తింటున్న వారిలో కొలెస్ట్రాల్ తీవ్రత బాగా తక్కువగా ఉందని వెల్లడైంది. క్లీవ్ ల్యాండ్ క్లినిక్ రిపోర్టు ప్రకారం రోజుకు ఒక పచ్చసొన తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొంది. వ్యక్తుల పోషక అవసరాలు, ఆరోగ్య సమస్యల కనుగుణంగా గుడ్డులోని పచ్చసొన తినడంపై వైద్యులను, పోషకనిపుణులను సంప్రదించి వారి నుంచి తగిన సలహాలను తీసుకుంటే మంచిదని మరోవైపు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.