Thursday, July 4, 2024
Homeహెల్త్Eggs expiry: కోడిగుడ్డు ఎన్నిరోజులు నిల్వ ఉంటుందో తెలుసా?

Eggs expiry: కోడిగుడ్డు ఎన్నిరోజులు నిల్వ ఉంటుందో తెలుసా?

ఒకేసారి ఎక్కువ గుడ్లు కొని, నిల్వ చేయకండి

గుడ్డుకూ షెల్ఫ్ లైఫ్ ఉంది

- Advertisement -

గుడ్లు మంచిగా ఉన్నాయా లేదా పాడయ్యాయా అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది. కొందరు గుడ్లు చాలాకాలం వరకూ పాడవవని భావించి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొంటుంటారు. అలా చేయొద్దని సూచిస్తున్నారు ఆహార నిపుణులు. గుడ్లకు కూడా షెల్ఫ్ లైఫ్ ఉందంటున్నారు. అది దాటితే వాటిల్లో ఇకొలీ కారకాలైన సూక్ష్మజీవులు వంటివి సైతం చేరి ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు.

గుడ్లు ఏడు లేదా ఎనిమిది రోజుల పాటు గది ఉష్ణోగ్రతలో నిల్వ ఉంటాయిట. సరైన పద్ధతిలో గుడ్లను రిఫ్రిజిరేటర్ లో భద్రపరిస్తే 45 రోజుల పాటు బాగా ఉంటాయని చెప్తున్నారు. వీటిని ఫ్రీజర్ లో పెడితే ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయిట. పాడైన గుడ్లు తినడం వల్ల ఆహార సంబంధమైన సమస్యలు తలెత్తుతాయిట. అంతేకాదు డయేరియా, ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి వంటి సమస్యల బారిన పడతామట. అందుకే మనం వాడే గుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకునే చిట్కాలు కొన్ని ఉన్నాయని కూడా ఆహారనిపుణులు చెప్తున్నారు.

ఒక గిన్నెలో నిండుగా నీళ్లు పోసి అందులో గుడ్డును మెల్లగా వేయాలి. అది కనుక నీళ్లల్లో పూర్తిగా మునిగితే గుడ్డు పాడవకుండా ఉందని అర్థం. అలా కాకుండా నీళ్లపైన నిటారుగా గుడ్డు తేలుతుంటే అది నిలవైందని గ్రహించాలి. గుడ్లు పూర్తిగా నీళ్ల మీద తేలియాడుతుంటే అవి పనికిరావని గ్రహించి వాటిని వెంటనే పారేయాలి. ఇది ఒక చిట్కా. గుడ్డు తాజాగా ఉందా లేదా అన్న విషయాన్ని తెలిపే మరో చిట్కా ఏమిటంటే, పచ్చి గుడ్డుపై చిన్న పగులు చేసి గుడ్డు సొనలో ఏవైనా మచ్చలు కనిపించినా లేదా రంగు మారినట్టు అనిపించినా ఆ గుడ్డును వాడకూడదు. గుడ్డులో జరిగిన రసాయన మార్పు కారణంగా సొన రంగు మారుతుంది. గుడ్డును వాసన చూసి కూడా అది మంచిదో కాదో గ్రహించవచ్చని ఆహార నిపుణులు చెప్తున్నారు. పగలగొట్టిన గుడ్డు సాధారణ వాసన కాకుండా సల్ఫర్ వాసన వస్తుంటే దాన్ని వాడకుండా పారేయాలి.

గుడ్డును చెవిదగ్గర పెట్టుకుని దాన్ని ఊపితే వచ్చే శబ్దం బట్టి కూడా గుడ్డు బాగా ఉందో లేదో గ్రహించవచ్చుట. మంచి గుడ్డులోంచి వచ్చే శబ్దం కన్నా పాడయిన గుడ్డులోంచి వచ్చే శబ్దంలో తేడా కొట్టొచ్చినట్టు తెలుస్తుందిట. అలా అనిపించిన వెంటనే గుడ్డు పాడయిందని గ్రహించి దాన్ని వాడకుండా పారేయాలి. గుడ్డును పగలగొట్టి లోపల పరికిస్తే కూడా అది పాడయిందో లేదో తెలుస్తుందిట. గుడ్డు లోని సొన టెక్చ్చెర్ అసహజంగా ఉంటే అది పాడవుతున్న స్టేజ్ లో ఉందని గ్రహించాలి. గుడ్డు సొన పూర్తిగా ఫ్లాట్ గా అయితే గుడ్డు పూర్తిగా పాడయిందని అర్థం. సో గుడ్డు వాడేటప్పుడు ఈ టెస్టులు చేసి మరీ వాడండి…ఆరోగ్యంగా ఉండండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News