Nutrition during pregnancy and breastfeeding : ఓ స్త్రీ గర్భం దాల్చిందంటే, అది కేవలం ఓ కుటుంబానికే కాదు, ఓ కొత్త తరానికి నాంది. ఆ పసికందు భవిష్యత్తు, సంపూర్ణ ఆరోగ్యం, తల్లి తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డకు రెండేళ్లు నిండేవరకు.. ఈ ‘తొలి 1000 రోజులు’ అత్యంత కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేస్తోంది.
ఎందుకీ 1000 రోజులు ఇంత ముఖ్యం : “తల్లి పోషకాహారమే, బిడ్డ శారీరక, మానసిక పెరుగుదలను, రోగనిరోధక శక్తిని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది,” అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (National Library of Medicine) అధ్యయనాలు చెబుతున్నాయి.
పోషకాహార లోపం వల్ల నష్టాలు: ఈ కీలక సమయంలో తల్లికి సరైన పోషకాలు అందకపోతే, బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది.
భవిష్యత్తుపై ప్రభావం: అలాంటి పిల్లలు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటమే కాకుండా, పెద్దయ్యాక డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది.
ఎంత తినాలి? ఏమేమి తినాలి? : గర్భిణులు, బాలింతలకు సాధారణం కంటే అదనపు పోషకాలు అవసరం. ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ (ICMR-NIN) సీనియర్ శాస్త్రవేత్త కె. దమయంతి ప్రకారం..
క్యాలరీలు: గర్భిణులు (2-3వ త్రైమాసికం) రోజుకు అదనంగా 350 క్యాలరీలు తీసుకోవాలి.
ప్రొటీన్లు: రోజుకు అదనంగా 8-18 గ్రాముల ప్రొటీన్ అవసరం.
పాలిచ్చే తల్లులు: పాలిచ్చే తల్లులకు ఈ అవసరం ఇంకా ఎక్కువ. మొదటి ఆరు నెలలు అదనంగా 600 క్యాలరీలు, ఆ తర్వాత 520 క్యాలరీలు తీసుకోవాలి.
ఈ సూక్ష్మ పోషకాలు అత్యవసరం : క్యాలరీలు, ప్రొటీన్లతో పాటు, కొన్ని సూక్ష్మ పోషకాలు తల్లి, బిడ్డ ఆరోగ్యానికి అత్యంత కీలకం.
ఫోలిక్ యాసిడ్: గర్భం దాల్చిన తొలి 28 రోజుల్లో ఇది చాలా ముఖ్యం. బిడ్డలో నాడీ లోపాలు రాకుండా, తల్లిలో రక్తహీనతను నివారిస్తుంది. (ఆకుకూరలు, చిక్కుళ్లు, నట్స్‌లో లభిస్తుంది).
ఐరన్: రక్తకణాల నిర్మాణానికి తల్లికి, బిడ్డకు ఇది తప్పనిసరి. లోపిస్తే, తల్లికి ప్రాణాపాయం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది. (మాంసం, చేపలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలలో లభిస్తుంది).
విటమిన్-డి, కాల్షియం: బిడ్డ ఎముకలు, దంతాల నిర్మాణానికి ఇవి అవసరం.
అయోడిన్, విటమిన్-ఎ: శిశువు మెదడు, శారీరక పెరుగుదలకు దోహదపడతాయి.
నిపుణుల సూచనలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
సప్లిమెంట్లు: ఆహారంతో పాటు, డాక్టర్ల సూచన మేరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం సప్లిమెంట్లను తప్పనిసరిగా వాడాలి. రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. టీ, కాఫీలను తగ్గించాలి. ఇవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. నిల్వ ఉన్న, అపరిశుభ్రమైన ఆహారానికి, అధిక ఉప్పు, చక్కెర ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ 1000 రోజుల పాటు తల్లి తీసుకునే శ్రద్ధ, ఓ ఆరోగ్యవంతమైన, దృఢమైన తరం నిర్మాణానికి పునాది వేస్తుంది.


