ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు అకి థమి. ఆర్టిస్టు, మహిళా యాక్టివిస్టు. మహిళా రచయిత్రులు రాసిన పుస్తకాల కన్నా పురుషులు రాసిన పుస్తకాలనే ఎక్కువ మంది చదవడాన్ని అకి గమనించారు. అది ఆమెను వినూత్న ప్రయోగానికి పూనుకునేలా చేసింది. మహిళలు రాసిన పుస్తకాలను సేకరించి వాటిని క్యూరేట్ చేయడంతోపాటు స్త్రీ పురుషులిరువురు వాటిని చదివి స్వేచ్ఛగా చర్చించేలా ఒక స్పేస్ స్రుష్టించాలనుకున్నారు. అలా 2019లో ముంబయిలోని బాంద్రాలో ‘సిస్టర్ లైబ్రరీ’ అనే ట్రావలింగ్ లైబ్రరీకి శ్రీకారం చుట్టారు. ఆ విశేషాలు …
అకి థమిది డార్జిలింగ్. ప్రస్తుతం ఆమె ముంబయిలో ఉంటున్నారు. స్త్రీలపై జరుగుతున్న హింసపై ఎన్నో కళాత్మక పోస్టర్లను ఆమె రూపొందించారు. ఆమె చుట్టూ ఎప్పుడూ హింస, అణచివేతలకు గురైన మహిళా బాధితులు, పిల్లలు ఉంటారు. స్టోరీ టెల్లింగ్ కు ఆర్ట్ ను ఒక మీడియంగా ఎంచుకున్నారు. ఇరుగు పొరుగు ఉండే ఎందరో ఆడవాళ్లు, పిల్లలు, యువతులతో మాట్లాడుతూ వారికి ఉపయోగపడేలా రాజకీయ, సామాజిక లక్ష్యాల సాధన కోసం క్రుషిచేస్తున్నారు. 2012 నుంచి ‘ధరావి ఆర్ట్ రూమ్’ లో పనిచేస్తున్నారు. సోషల్ వర్కులో డాక్టోరల్ డిగ్రీని చేస్తున్నారు.
కమ్యూనిటీలోని స్త్రీలు, పిల్లలు తమ బాధలను, వెతలను ఆర్ట్ ద్వారా వ్యక్తంచేస్తూ సాంత్వన పొందేలా వారికి ఈ సంస్థ ద్వారా ‘స్పేస్’ కల్పిస్తున్నారు. అంతేకాదు తక్కువ ఖర్చుతో కళాత్మక రీతిలో పత్రికలు (జైన్స్) ప్రచురిస్తూ అందులో స్త్రీల బహిష్టు బాధలు, మెనుస్ట్రుయేషన్ అనుభవాలు వంటి ఎన్నో వినూత్న కథనాలను వెలువరిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సిస్టర్ లైబ్రరీ’ అనే ట్రావలింగ్ లైబ్రరీని కూడా థమి ప్రారంభించారు. ఈ ట్రావలింగ్ లైబ్రరీలో థమి సేకరించిన పుస్తకాలే నూరు వరకూ ఉన్నాయి.
ఇవన్నీ మహిళా రైటింగ్సేకి సంబంధించినవే. ఈ ట్రావలింగ్ లైబ్రరీ ముంబయి, కొచిన్, పూనె, ఢిల్లీ, బెంగళూరు, గోవా వంటి నగరాలలో టూర్ చేస్తుంటుంది. సాహిత్యంలో స్త్రీల ప్రాతినిధ్యం గురించి చర్చలు, సంభాషణలు, సమావేశాలు సైతం టూర్లలో చోటుచేసుకుంటాయి. స్త్రీల రచనలకు స్పేస్ లేకపోవడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని… అదే సిస్టర్ లైబ్రరీ ప్రాజక్టుకు పూనుకునేట్టు చేసిందని థమి అకి అంటారు. సిటీల్లో రోడ్డు మీద అమ్మే పుస్తకాల దుకాణాల నుంచి పెద్ద పెద్ద పుస్తకాల షాపుల దాకా ఎక్కడా స్త్రీలు రాసిన పుస్తకాలు తనకు కనపడేవి కావని అకి చెప్పారు.
సిస్టర్ లైబ్రరీ ఇతర సాధారణ లైబ్రరీల్లాగ ఉండదు. సమకాలీన ద్రుశ్య, పఠన సంస్క్రుతులతో కూడి పరిణితిని, కొత్త పోకడలను ప్రతిఫలించే ఆర్ట్ వర్కును ఈ లైబ్రరీ ఆవిష్కరిస్తుందంటారు అకి. అకి ‘అండర్ గ్రౌండ్ బుక్ హౌస్’ సభ్యురాలు కూడా. ఇందులో బుక్ షాపుతో పాటు లైబ్రరీ కూడా ఉంటుంది. రకరకాల పబ్లిక్ ఆర్ట్ ప్రాక్టీసెస్, పర్ఫామెన్స్ ఆర్ట్స్, జైన్ మేకింగ్ వంటి ప్రయోగాలకు సైతం ఇది కేంద్రం.
సిస్టర్ లైబ్రరీలో ఆర్ట్, కల్చర్, యాక్టివిజానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఇతర లైబ్రరీల్లో మనం చూసే రీడింగ్, రైటింగ్ పద్ధతులు ఇందులో ఉండవు. ‘ఒక ఆర్టిస్టుగా, యాక్టివిస్టుగా, స్కాలర్ గా నా ఆసక్తులన్నింటినీ తీర్చే, స్త్రీలను ఆనందపరిచే ‘స్పేస్’ ఈ లైబ్రరీ అంటారు అకి.
అకి మాటల్లో చెప్పాలంటే ఇది క్యూరేటెడ్ లైబ్రరీ. మహిళా రచయితలు, పత్రికల, కళాకారుల వర్క్సు ఇందులో ఉంటాయి. ఈ ప్రాజక్టును పూర్తిగా ఇంటారాక్టివ్ వర్కుగా అకి అభివర్ణిస్తారు. పలు నగరాలలో ప్రయాణిస్తూ గ్రంధాలయం అనే మాటకే కొతత్త అర్థాన్ని మా ట్రావలింగ్ లైబ్రరీ ఇస్తుందంటారు అకి. ‘మా లైబ్రరీ మౌఖికత (ఓరాలిటీ)కి ప్రాధాన్యం ఇస్తుంది. మౌఖిక సాహిత్యం అనేది కేవలం మన సాంస్క్రుతిక వారసత్వ సంపద మాత్రమే కాదు భాషను, విజ్గానాన్ని, ఆచారాలను నేర్పేది కూడా’ అంటారు అకి. ఇప్పటివరకూ వెయ్యి పుస్తకాలను అకి సేకరించారు. ఇది ట్రావలింగ్ లైబ్రరీ కావడం వల్ల పుస్తకాల సంఖ్య విషయంలో పరిమితికి లోబడవలసి వస్తోందంటారామె.
ఈ పుస్తకాలలో నాన్ ఫిక్షన్ మొదలు నవలలు, పత్రికలు, కవితా సంపుటాలు, పీరియాడికల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. పుస్తకం డిజైన్, వాడిన పేపరు వీటన్నింటి కన్నా అందులో ఉండే కంటెంట్కే ప్రాధాన్యం ఉంటుందంటారు అకి. స్త్రీలు తీసుకువచ్చే జైన్స్(పత్రికలు) లో మట్లాడే అంశాలు ఏ ఇతర మ్యాగజైన్లలో కనపడవంటారామె. అలాగే నాన్ ఫిక్షన్ ఎక్కువగా చదివే అకి అది తన వర్కు ను, జీవనాన్ని మరింత సంపద్వంతం చేస్తుందంటారు.
స్త్రీల ఉద్యమాలు, కవిత్వం రెంటి మధ్య ఉండే సంబంధాన్ని పట్టించుకోకుండా ఉండలేనంటారు. తన జీవితంలో ఎదురైన ఎన్నో క్లిష్ట సందర్భాలలో కవిత్వం మందులా పనిచేసిందని చెప్తారు. టూర్లు చేస్తూ, ప్రజలతో ఇంటరాక్షన్ల చేస్తూ సిస్టర్స్ లైబ్రరీ సమకాలీనంగా తనను తాను మెరుగుపరచుకుంటూ వస్తోందంటారు అకి. ఈ లైబ్రరీకి ప్రపంచంలోని పలు ప్రాంతాల నుంచి రకరకాల పత్రికలు వస్తుంటాయి. ఎందరో రచయిత్రులు తమ రచనలను పంపిస్తుంటారు. స్త్రీవాదులు, యాక్టివిస్టులు తమలో స్పూర్తి నింపిన పుస్తకాల గురించి ఈ లైబ్రరీతో పంచుకుంటుంటారు. ఎవరైనా సరే ఈ లైబ్రరీలో సభ్యులు కావచ్చు. ఇక్కడకు వచ్చి పుస్తకాలు చదువుకోవచ్చు. స్త్రీలు కోరుకునేలాంటి ‘స్పేస్’ ఈ లైబ్రరీ ఇస్తుంది. దీనికి ఎందరో పుస్తకాల రూపంలో, ధనం రూపంలో, స్పేస్ రూపంలో తమ తోడ్పాటును అందిస్తున్నారు.
పలు సామాజిక, రాజకీయ అంశాలను లేవనెత్తే కళావేదికగా కూడా ఇది పనిచేస్తుంది. తాను అందిస్తున్న వినూత్న సేవలకు గాను ఎన్నో ప్రఖ్యాత అవార్డులను కూడా అకి అందుకున్నారు. ఆమె వేసిన ఆర్ట్ ప్రపంచంలోని పలు సమకాలీన ఆర్ట్ మ్యూజియంలలో, ఆర్ట్ ఫౌండేషన్లలో మనకు దర్శనమిస్తాయి. సిస్టర్ లైబ్రరీ దక్షిణ ఆసియాలోనే తొలి స్త్రీవాద లైబ్రరీ. స్త్రీవాద స్ప్రుహను రేకెత్తించే, మహిళలకు పర్మెనెంట్ స్పేస్ స్రుష్టించే లైబ్రరీ ఇది.