Dangers of excessive fiber : బరువు తగ్గాలన్నా, పేగులు ఆరోగ్యంగా ఉండాలన్నా పీచుపదార్థాలు (ఫైబర్) ఎక్కువగా తినాలని వైద్యులు చెబుతుంటారు. ఈ సలహాను మరీ సీరియస్‌గా తీసుకుని, కొందరు ‘ఫైబర్ మాక్సింగ్’ అనే కొత్త ట్రెండ్‌ను పాటిస్తున్నారు. అంటే, తమ ఆహారంలో పీచు మోతాదును విపరీతంగా పెంచేస్తున్నారు. అయితే, అమృతం కూడా అతిగా తీసుకుంటే విషమవుతుందన్నట్లు, ఈ ‘ఫైబర్ మాక్సింగ్’ మేలుకు బదులుగా కీడు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
అసలు రోజుకు ఎంత తినాలి : ఆరోగ్యంగా ఉండటానికి ఫైబర్ అవసరమే, కానీ ಅದೊಂದು పరిమితిలో ఉండాలి.
జాతీయ పోషకాహార సంస్థ (NIN) సిఫార్సులు: పెద్దలకు రోజుకు సుమారు 30 గ్రాముల ఫైబర్ అవసరం.
వయసును బట్టి: 1-3 ఏళ్ల పిల్లలకు 15 గ్రాములు, పాఠశాలకెళ్లే పిల్లలకు 20-25 గ్రాముల వరకు అవసరం.
హార్వర్డ్ హెల్త్ సిఫార్సులు: మహిళలకు 25 గ్రాములు, పురుషులకు 38 గ్రాములు, 50 ఏళ్లు పైబడిన వారు కొంచెం తక్కువగా తీసుకోవాలని సూచిస్తోంది.
ఫైబర్ ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు : సరైన మోతాదులో ఫైబర్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పేగుకు మేలు: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు నియంత్రణ: కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అతిగా తినడాన్ని నివారిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులకు చెక్: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, గుండె జబ్బులు, పేగు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అతి సర్వత్ర వర్జయేత్.. మోతాదు మించితే ముప్పే : ‘ఫైబర్ మాక్సింగ్’ పేరుతో పౌడర్లు, సప్లిమెంట్లను వాడటం, ఆహారంలో పీచును ఒక్కసారిగా విపరీతంగా పెంచడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని మేయోక్లినిక్ (Mayo Clinic) వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
జీర్ణ సమస్యలు: పొట్టలో ఉబ్బరం, గ్యాస్, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఖనిజాల లోపం: అతిగా ఫైబర్ తీసుకోవడం వల్ల, శరీరం ఆహారంలోని కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలను సరిగా గ్రహించలేదు.
నీరు తప్పనిసరి: ఫైబర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, దానికి అనుగుణంగా నీరు, ద్రవ పదార్థాలు కూడా ఎక్కువగా తాగాలి. లేదంటే, పేగుల్లో చికాకు, తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి.
“సిఫార్సు చేసిన ఫైబర్ కంటే అదనంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. మీ ఆహారంలో ఫైబర్ మోతాదును క్రమంగా పెంచుకుంటూ, మీ శరీరం దానికి ఎలా స్పందిస్తుందో గమనించాలి.”
– మానస, డైటీషియన్
సహజమైన ఆహార పదార్థాల (పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలు) ద్వారా ఫైబర్ తీసుకోవడమే సురక్షితమైన మార్గం. సప్లిమెంట్ల జోలికి వెళ్లే ముందు, తప్పనిసరిగా వైద్యులు లేదా డైటీషియన్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.


