Saturday, November 23, 2024
Homeహెల్త్Fig the best fruit: అంజీర్ తో చలి బాధలు దూరం

Fig the best fruit: అంజీర్ తో చలి బాధలు దూరం

అత్తిపండ్లు చాలా టేస్టీ కూడా

అత్తిపండ్లు (అంజీర్)ఇష్టపడని వారు ఉండరు. అందులోనూ చలికాలంలో వీటిని తింటే ఎంతో మంచిదని పలువురు పోషకాహారనిపుణులు అంటున్నారు. అత్తిపండ్లు పోషకాల నిధి. వీటిల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి.

- Advertisement -

ముఖ్యంగా శీతాకాలంలో అత్తిపండ్లు శరీరానికి చేసే మేలు ఎంతో. పచ్చి అత్తిపండ్లైనా, ఎండబెట్టినవైనా తినాలే గానీ అవి శరీరానికి అందించే ప్రయోజనాలు ఎన్నో అంటున్నారు నిపుణులు. శీతాకాలంలో ఈ పండ్లు శరీరానికి అందించే వెచ్చదనం ఎంతో. పోషకాలతో నిండి ఉన్న అత్తిపండ్లు చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి. ఈ సీజన్ లో అనారోగ్యసమస్యలేవీ మనల్ని చుట్టబెట్టకుండా అంజీర్లు సంరక్షిస్తాయి. అత్తిపండ్లల్లోని పీచుపదార్థాల వల్ల మన జీర్ణవ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా పనిచేస్తుంది.

ఉదయమే ఖాళీ కడుపుతో రెండు మూడు అత్తిపండ్లు తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. ముందరే చెప్పినట్టు అత్తిపండ్లల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది. అంతేకాదు కీళ్ల నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. చలికాలంలో బరువు పెరగకుండా కూడా అత్తిపండ్లు మనకు తోడుంటాయి. వీటిని రెండు మూడు తింటే చాలు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఆకలి వేయదు. అలా వెయిట్ లాస్ మేనేజ్మెంట్ లో అత్తిపండ్లు ముఖ్యంగా చలికాలంలో ఎంతో సహాయపడతాయి. అలాంటి అత్తిపండ్లను మన డైట్ లో రకరకాలుగా చేర్చుకోవచ్చు. ఉదాహరణకు మీరు తాగే పాలలో రెండు అత్తిపండ్లను వేసి మరిగించాలి. ఇందులో చక్కెర వేయద్దు. రాత్రి నిద్రపోయే ముందు ఈ పాలు తాగితే మంచి నిద్రపడుతుంది. అలాగే సెరెల్స్ లేదా ఓట్స్ లో అంజీర్ ముక్కలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తింటే అవి శరీరానికి ఇచ్చే బలం ఎంతో. దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉండడమే కాదు రుచిలో కూడా సూపర్ గా ఉంటుంది. అలాగే డెజర్టులు తినే అలవాటు ఉంటే అందులో చక్కెర వాడకుండా అత్తిపండ్లను వేసుకుని తినండి. మళ్లీ చక్కెర జోలికి పోరు. రుచి బాగుంటుంది. పైగా ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు.

డెజర్టులనే కాదు ఎలాంటి పుడింగ్ లో గానీ, జామ్, పిగ్స్ వంటి వాటిల్లో గాని అత్తిపండ్లు వాడడం వల్ల దానికి సహజసిద్ధమైన తీపిదనం చేరి ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఉదయం ఆరోగ్యకరమైన షేక్ తీసుకోవాలనుకుంటే పాలలో అరటిపండు, అత్తిపండ్లు వేసుకుని మిల్క్ షేక్ లా చేసుకుని తాగితే బలానికి బలం. రుచికి రుచి. ఎందులోనూ ఈ మిల్క్ షేక్ తీసిపోదు. ఇది తాగిన తర్వాత కడుపు నిండినట్టుండి తొందరగా ఆకలి వేయదు కూడా. ఇవి కాకుండా నీళ్లల్లో నానబెట్టిన అంజీర్లు కూడా ఎంతో బాగుంటాయి. రెండు లేదా మూడు అంజీర్లను రాత్రి నీళ్లల్లో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత తింటే చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. అత్తిపండ్లు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల కూడా శరీరానికి ఎంతో మంచిది. అంజీర్ బ్లడ్ షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. అందులోనూ చలికాలంలో బ్లడ్ షుగర్ పెరగకుండా సహకరిస్తుంది. అంతేకాదు అంజీర్లల్లో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. శీతాకాలంలో తలెత్తే దగ్గు, జలుబు వంటి శ్వాససంబంధమైన సమస్యలను ఇవి నివారిస్తాయి.

అంజీర్లల్లో సహజమైన చక్కెర గుణాలతో బాటు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తిని పెంచి శీతాకాలం రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. అంజీర్లను శీతాకాలంలో స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. అంజీర్ తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరించి కార్డియోవాస్కులర్ జబ్బుల రిస్కున పడకుండా కాపాడతాయి కూడా. అంజీర్ లోని పీచుపదార్థాలు కొలెస్ట్రాల్ ప్రమాణాలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇవి చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మీ నిత్య జీవనశైలిలో ఎంతో ఉపయోగపడతాయి కూడా. మరి చలికాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, బలంతో తిరగాలంటే తప్పకుండా మీ డైట్ లో అంజీర్ ను భాగం చేయండని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News