Tuesday, September 17, 2024
Homeహెల్త్Flax seeds: అవిసెలతో అందం, ఆరోగ్యం

Flax seeds: అవిసెలతో అందం, ఆరోగ్యం

మీకు నచ్చినట్టు అవిసెలను మితంగా తినటం అలవాటు చేసుకోండి

అవిశె గింజలతో మరింత అందంగా… అవిసె గింజలు ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ మాత్రమే కాదు అందాన్ని కూడా పెంచే బ్యూటీ సీడ్స్. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. వీటి నిండా ఎన్నో ముఖ్యమైన పోషకాలు సైతం ఉన్నాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని బాగా ఇనుమడింపచేయడం వీటి ప్రత్యేకత. ఇవి ఈజిప్టు, చైనాల నుంచి వచ్చాయంటారు. పైగా ఎంతో పురాతనమైన విశేష చరిత్ర వీటికి ఉండడం మరో సుగుణం. వీటిల్లో బ్రౌన్, గోల్డన్ రంగు వెరైటీలు ఉన్నాయి. అవిశె గింజల్లో పీచుపదార్థాలు బాగా ఉన్నాయి. ఈ రెండు వెరైటీ అవిశెగింజల్లో మూడొంతులు ఒకేరకమైన పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి.

- Advertisement -

ఈ గింజల వల్ల ఉన్న బ్యూటీ లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీటిల్లోని పీచుపదార్థాల వల్ల జీర్ణశక్తి బాగా ఉండడమే కాకుండా బరువు తగ్గడంలో ఇవి ఎంతో బాగా పనిచేస్తాయి. వీటిల్లోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్స్   గుండెజబ్బులు, ఆర్తైటిస్, ఆస్తమా, మధుమేహం వంటి సమస్యలపై బాగా పనిచేస్తాయి. అవిశె గింజలను వాల్ నట్స్, చేపలతో కలిపి తింటే కలిగే ప్రయోజనాలు ఎన్నో అంటారు పోషకాహారనిపుణులు. అవిశె గింజల పొడి లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. చేపనూనెలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. అవిశె గింజలను నిత్యం మీ డైట్ లో భాగస్వామ్యం చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ యాంటి ఏజింగ్ ఏజెంట్స్. అవిశె గింజల పొడి ఒక స్పూను తింటే మీ వయసు తెలియనంత యవ్వనమెరుపులు చిందిస్తారంటున్నారు బ్యూటీ నిపుణులు సైతం. ముందరే చెప్పుకున్నట్టు అవిశె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి శరీర బాధల నుంచి ఎంతో వేగంగా ఉపశమనం అందిస్తాయి.

అవిశె గింజల్లో యాంటి ఇన్ఫ్లమేటరీ సుగుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.అందుకే అవిశె గింజల పొడిలో కాస్త కొబ్బరినూనె   లేదా ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి స్కిన్ ఇన్ఫ్లమేషన్ ఉన్న చోట రాస్తే ఎంతో వేగంగా ఆ బాధ తగ్గుతుంది. అంతేకాదు చర్మంపై ఇరిటేషన్, దద్దుర్లు, ఎరుపుదనం వంటి వాటిని కూడా అవిశె గింజలు తగ్గిస్తాయి. యాక్నేతో బాధపడేవారికి అవిశెగింజల పొడి సంజీవని అంటారు బ్యూటీ నిపుణులు.ఈ పొడి బ్రేకవుట్స్ లేదా యాక్నేను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అంతేకాదు బహిష్ఠు సమయాల్లో, హార్మోన్లల్లో మార్పులు తలెత్తినపుడు కూడా అవిసె గింజలు అందించే సాంత్వన ఎంతో. ఈ గింజలు చర్మాన్ని ఎంతో మెరిసేలా చేయడమే కాదు చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తాయి. మంచి ఎక్స్ ఫొయిలెంట్ గా కూడా ఇవి పనిచేస్తాయి. చర్మంపై ఉండే మృతకణాలను పోగొట్టడంలో ఇవి ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆకర్షణీయంగా మెరిసేలా చేస్తాయి.

ఆరోగ్యవంతమైన స్కిన్ టోన్ కూడా అవిశె గింజలు అందిస్తాయి. చర్మంలోని డల్ నెస్ ను పోగొట్టి పునరుజ్జీవింపచేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఈ   గింజల్లో మాయిశ్చరైజింగ్ సుగుణాలు కూడా బోలెడున్నాయి. ఇవి ఒమోగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్లనే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చర్మాన్ని పొడారిపోకుండా కూడా అవిశెగింజలు పరిరక్షిస్తాయి. చర్మంపై అవాంఛనీయమైన టాన్ ను కూడా పోగొట్టడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే స్కిన్ టోన్ ను సమతుల్యం చేయడంలో కూడా ఈ గింజలు అద్భుతాలు చేస్తాయి. అవిశె గింజలతో చర్మాని అందంగా మెరిపించే కొన్ని ఫేస్ ప్యాకులు, స్క్రబ్స్ ను కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇవి చర్మం అందాన్ని రెట్టింపు చేస్తాయి. బిగువైన చర్మం కావాలనుకుంటే అవిశెగింజలు, నీరు కలిపి చేసే ఫేస్ ప్యాక్ మంచి ఫలితాన్ని చూబిస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ అవిశెగింజలు, కప్పు మూడవ వంతు నీళ్లు, ఒక ప్లాస్టిక్ బౌల్ రెడీ పెట్టుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో అవివెగింజలు వేయాలి. వాటిని బాగా కలిపిన   తర్వాత శుభ్రమైన గుడ్డతో ఆ గిన్నెను చుట్టి మూడు నుంచి నాలుగు గంటలు అలాగే ఉంచాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఆ పేస్టును ఫేస్ కు , మెడకు బాగా రాసుకోవాలి. అది పొడారిన తర్వాత రెండవసారి మరో లేయర్ వేసుకోవాలి. ఇలా నాలుగు లేయర్లు వేసి ఆ మాస్కు మందంగా ముఖానికి వేయాలి. ఆ మాస్కు బాగా పొడారిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. టవల్ తో ముఖాన్ని పొడిగా తుడుచుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే బిగువైన చర్మంతో పాటు, మెరిసే చర్మం మీసొంతమవతుంది. చర్మం కాంతివంతంగా కావాలంటే అవిశెగింజలు, బ్ల్యూ మన్ను మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ అవిశెగింజలు, ఒక టీస్పూను బ్లూ మన్ను, రెండు లేదా నాలుగు చుక్కల రోజ్ వాటర్ రెడీగా పెట్టుకోవాలి. రాత్రి నీళ్లల్లో అవిశెగింజలను నానబోయాలి. ఉదయం మిగిలిన పదార్థాలను దాంట్లో వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ముఖాన్ని శుభ్రంగా   కడుక్కుని ఈ మాస్కును ముఖానికి, మెడభాగంలో సరిగా అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకూ అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీటితో శుభ్రంగా ముఖం కడుక్కుని పొడిగా తుడచుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

చర్మం క్లీన్సింగ్ కోసం అవిశెగింజలు, గుడ్డు కలిపిన ఫేస్ మాస్కు ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ అవిశెగింజల పొడి, ఒక గుడ్డు రెడీ పెట్టుకోవలి. గుడ్డును బాగా గిలకొట్టి అందులో అవిశెగింజల పొడి వేసి మెత్తటి పేస్టులా చేయాలి. ఈ మాస్కును ముఖానికి, మెడ భాగంలో రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో ముఖం కడుక్కొని పొడిగా తుడుచుకోవాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే మరింత మాయిశ్చరైజర్ చర్మానికి అందుతుంది. నెలకు రెండుసార్లు ఈ మాస్కును ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు.   యాక్నే సమస్యకు కూడా అవిశెగింజల ఫేస్ మాస్కు ఉంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ అవిశెగింజలు, రెండు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె రెడీ పెట్టుకోవాలి. రాత్రి అవిశెగింజలను నీటిలో నానబెట్టాలి. ఉదయం లేచిన తర్వాత వాటిని మెత్తగా చేసి అందులో నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. ఆ పేస్టును ముఖానికి అప్లై చేసుకొని మెల్లగా మసాజ్ చేయాలి. అది పూర్తిగా పొడారే వరకూ అంటే అరగంట సేపు అలాగే ఉంచుకుని తర్వాత నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. టవల్ తో ముఖాన్ని బాగా పొడిగా తుడచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మంపై వేధిస్తున్న యాక్నే మటుమాయం అవుతుంది. చర్మాన్ని మంచి మెరుపుతో పునరుద్ధరించడానికి కూడా అవిశెగింజల మాస్కు బాగా పనిచేస్తుంది. ఇందుకు ఒక టేబుల్ అవిశెగింజల పొడి, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను పెరుగులను రెడీ పెట్టుకోవాలి. పైన చెప్పిన   పదార్థాలన్నింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేసి దాన్ని ముఖానికి, మెడకు సమంగా రాయాలి. పదిహేను నిమిషాలు ఆ మాస్కును అలాగే ఉంచుకున్న తర్వాత నీళ్లతో కడుక్కుని టవల్ తో ముఖాన్ని బాగా పొడిగా తుడుచుకోవాలి. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఇలా చేయాలి. దీనివల్ల చర్మం యవ్వన మెరుపులను చిందిస్తుంది. అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే అవిశెగింజలను డైట్ లో చేరిస్తే పొందేలాభాలు ఎలాంటివో చూశారు కదా…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News