Foods that reduce anxiety : పని ఒత్తిడి, జీవనశైలి మార్పులు.. కారణమేదైనా, నేటి సమాజంలో ఆందోళన (Anxiety), కుంగుబాటు (Depression) అనే మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే, అవి దీర్ఘకాలంలో బీపీ, షుగర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కంగారు పడాల్సిన పనిలేదు. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, ఈ మానసిక రుగ్మతలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి.
తినాల్సినవి.. మీ మానసిక ఆరోగ్య మిత్రులు : సరైన పోషకాలున్న ఆహారం, మన శరీరంలో ఒత్తిడిని తగ్గించి, ‘సంతోషపు హార్మోన్ల’ను పెంచుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు: ఇవి మెదడు పనితీరుకు అత్యంత కీలకం. వీటిలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఒత్తిడికి కారణమయ్యే ‘కార్టిసాల్’ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి.
ఏం తినాలి : చేపలు (సీ-ఫుడ్), వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు.
విటమిన్ డి: ఈ ‘సన్‌షైన్ విటమిన్’ లోపం, డిప్రెషన్‌కు దారితీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏం తినాలి: పాలు, పెరుగు, పుట్టగొడుగులు, గుడ్డులోని పచ్చసొన, మాంసం. వీటితో పాటు, రోజూ కాసేపు ఉదయం ఎండలో గడపడం చాలా ముఖ్యం.
పసుపు: మన వంటింటి దివ్యౌషధం పసుపు. ఇందులో ఉండే ‘కర్కుమిన్’ అనే రసాయనం, డిప్రెషన్‌కు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ (National Library of Medicine) అధ్యయనంలో తేలింది.
తినకూడనివి.. మీ మానసిక ఆరోగ్య శత్రువులు : కొన్ని రకాల ఆహార పదార్థాలు, మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కృత్రిమ స్వీటెనర్లు, చక్కెర: బరువు తగ్గేందుకు వాడే ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు, శరీరంలో సెరటోనిన్, డోపమైన్ వంటి ‘హ్యాపీ హార్మోన్ల’ ఉత్పత్తిని అడ్డుకుంటాయి. ఇది ఒత్తిడి, డిప్రెషన్‌ను మరింత పెంచుతుంది.
గ్లూటెన్: గోధుమలు, బ్రెడ్, పాస్తా, బిస్కెట్లు వంటి వాటిలో ఉండే గ్లూటెన్, కొందరిలో జీర్ణ సమస్యలతో పాటు, డిప్రెషన్ లక్షణాలకు కూడా దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులుగా రాగులు, జొన్నలు, ఓట్స్ వంటి చిరుధాన్యాలు తీసుకోవడం మంచిది.
కీటో డైట్ మంచిదేనా : బరువు తగ్గడానికి ప్రాచుర్యం పొందిన ‘కీటో డైట్’, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, కిడ్నీ, షుగర్ వంటి సమస్యలున్న వారు, ఈ డైట్‌ను పాటించే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.ఆహారంలో మార్పులతో పాటు, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర, యోగా, ధ్యానం వంటివి కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


