Early warning signs of glaucoma : కన్ను ఉబ్బిందా..? దృష్టి మసకబారుతోందా..? లైట్ల చుట్టూ రంగుల వలయాలు కనిపిస్తున్నాయా? చాలామంది వీటిని సాధారణ కంటి సమస్యలుగా కొట్టిపారేస్తుంటారు. కానీ, ఇవే మీ కంటిచూపును శాశ్వతంగా దొంగిలించే ‘గ్లకోమా’ అనే నిశ్శబ్ద హంతకి తొలి అడుగులని మీకు తెలుసా..? ఎలాంటి నొప్పి లేకుండా, ప్రారంభ లక్షణాలు బయటపడకుండా మన కంటి నరాలను నెమ్మదిగా తినేసే ఈ మహమ్మారి గురించి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అసలు ఏమిటీ గ్లకోమా..? దాని బారిన పడకుండా మన కళ్లను ఎలా కాపాడుకోవాలి..? నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.
ఏమిటీ గ్లకోమా – ఎందుకంత ప్రమాదం : గ్లకోమా అనేది కంటి లోపలి ఒత్తిడి (Intraocular Pressure – IOP) పెరగడం వల్ల కంటి నుండి మెదడుకు దృశ్య సమాచారాన్ని చేరవేసే ఆప్టిక్ నరాన్ని దెబ్బతీసే ఒక సంక్లిష్టమైన కంటి వ్యాధి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, ఈ నరం దెబ్బతినడం వల్ల దృష్టి క్షేత్రం నెమ్మదిగా కుంచించుకుపోయి, చివరికి పూర్తి అంధత్వానికి దారితీస్తుంది. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ నష్టం చాలా నెమ్మదిగా జరుగుతుంది. వ్యాధి ముదిరే వరకు చాలామందికి తమకు సమస్య ఉందని కూడా తెలియదు. అందుకే దీనిని ‘సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్’ (కంటిచూపును దొంగిలించే నిశ్శబ్ద దొంగ) అని పిలుస్తారు.
తొలి దశ హెచ్చరికలు – గమనించాల్సిన లక్షణాలు: గ్లకోమా ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోయినా, కొన్ని సూక్ష్మమైన మార్పులను గమనించడం ద్వారా అప్రమత్తం కావచ్చు.
పక్క చూపు మందగించడం (Peripheral Vision Loss): గ్లకోమా అత్యంత సాధారణ ప్రారంభ లక్షణం ఇది. మన కంటికి నేరుగా కాకుండా, పక్కల నుంచి వస్తువులను చూసే సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతుంది. గ్లకోమా ఆస్ట్రేలియా (Glaucoma Australia) ఈ రకమైన లక్షణాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఆప్టిక్ నరం గణనీయంగా దెబ్బతిన్న తర్వాతే దీనిని గుర్తిస్తారు.
దృష్టి మసకబారడం: అప్పుడప్పుడు దృష్టి అస్పష్టంగా, మబ్బుగా అనిపించడం కూడా ఒక లక్షణమే.
కాంతి చుట్టూ వలయాలు (Halos around lights): రాత్రిపూట బల్బులు లేదా దీపాల చుట్టూ ఇంద్రధనస్సు లాంటి రంగుల వలయాలు కనిపించాయంటే మీ కళ్లపై ఒత్తిడి పెరిగిందని అర్థం. ఇది కంటి అలసటకు ఒక ముఖ్యమైన లక్షణం.
తీవ్రమయ్యే లక్షణాలు (medlineplus ప్రకారం): వ్యాధి ముదిరినప్పుడు కొన్ని తీవ్రమైన లక్షణాలు అకస్మాత్తుగా బయటపడవచ్చు.
ఒక కంటిలో తీవ్రమైన నొప్పి
వికారం లేదా వాంతులు
కళ్లు ఎర్రబడటం
కన్ను ఉబ్బినట్లు అనిపించడం
ఎవరికి ప్రమాదం ఎక్కువ? (clevelandclinic ప్రకారం):
వయసు: 40 ఏళ్లు పైబడిన వారికి ఈ ప్రమాదం ఎక్కువ.
కుటుంబ చరిత్ర: కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉంటే, మీకు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఇతర కంటి సమస్యలు: దగ్గరి చూపు (మయోపియా), దూర దృష్టి (హైపరోపియా) ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువే.
దీర్ఘకాలిక వ్యాధులు: అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) ఉన్నవారిలో గ్లకోమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
నివారణ, చికిత్స: గ్లకోమాను పూర్తిగా నయం చేయలేం. కానీ, ఎంత త్వరగా గుర్తిస్తే, అంతగా దృష్టి నష్టాన్ని అరికట్టవచ్చు. చుక్కల మందులు, లేజర్ చికిత్స, కొన్నిసార్లు శస్త్రచికిత్స ద్వారా కంటి ఒత్తిడిని నియంత్రించి, మిగిలిన కంటిచూపును కాపాడుకోవచ్చు. అందుకే, 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పైన పేర్కొన్న ప్రమాద కారకాలు ఉన్నవారు, ఎలాంటి లక్షణాలు లేకపోయినా సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యంత ఆవశ్యకమని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.


