Tuesday, September 17, 2024
Homeహెల్త్Hair fall alert: వెంట్రుకలు రాలుతున్నాయా..

Hair fall alert: వెంట్రుకలు రాలుతున్నాయా..

జుట్టు ఊడిపోతోందా? తలపై వెంట్రుకలు పలచబడుతున్నాయా? మాడుపై వెంట్రుకలు వెనక్కి పోతున్నాయా? ఈ సమస్యలు తలెత్తడానికి కారణాలు ఎన్నో. కుటుంబ వారసత్వం వల్ల ఇవి వస్తాయి. అంతేకాదు పోషకాహారలోపం, ఒత్తిడికి గురికావడం, ముసలితనంలో వచ్చే అనారోగ్య సమస్యలు, చెమట బాగా కారడం, రకరకాల మందులు, వైద్య చికిత్సల వల్ల, హార్మన్ల సమస్యల వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యకు ఎన్నో మెడికల్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. అయితే సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా కూడా వీటిని పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు.

- Advertisement -

* ఆరోగ్యకరమైన డైట్ తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అందుకే డైటీషియన్ ని సంప్రదించి మంచి డైట్ ప్లాన్ పాటిస్తే ఫలితాలు బాగా ఉంటాయి. పోషకాలు, ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తింటే జట్టు ఊడదు.

*రోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాలు సరైన ప్రమాణాల్లో ఉంటాయి. ఫలితంగా శిరోజాలు బాగా పెరుగుతాయి. పప్పులు, చేపలు, మాంసం వంటివి మీ డైట్ లో సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.

*ఆయిల్ మసాజ్ వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టును పెంచే రకరకాల నూనెలు మనకు ఉన్నాయి. వాటిల్లో భ్రుంగరాజ్ తైలం ఒకటి. ఇది ఆయుర్వేద చికిత్సలో ప్రసిద్ధమైంది. జుట్టుపై బాగా పనిచేస్తుందనే పేరు దీనికి ఉంది. ఈ ఆయిల్ తలలోని చుండ్రును పోగొడుతుంది. పొడారినట్టుండే మాడుపై బాగా పనిచేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రక్తప్రసరణ బాగా జరిగేలా సహకరిస్తుంది. జుట్టును మెరిసేలా చేయడమే కాదు వెంట్రుకలు తెల్లబడకుండా కూడా సంరక్షిస్తుంది. వెంట్రుకలు నల్లగా నిగ నిగలాడేట్టు చేస్తుంది. ఈ ఆయిల్ ని గోరువెచ్చగా చేసి దాన్ని మాడుకు, కుదుళ్లకు బాగా పట్టించి అరగంట సేపు అలాగే ఉంచుకొని ఆ తర్వాత నీటితో తలను శుభ్రంగా రుద్దుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

*కొందరు మార్కెట్ లో దొరికే రకరకాల స్టైలింగ్ ప్రాడక్టులను, విషతుల్యమైన రసాయనాలుండే వాటిని జుట్టుపై ఎక్కువగా వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీరు వాడే హెయిర్ స్టైలింగ్ ప్రాడక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎలాంటి వాటిని జుట్టు సంరక్షణకు వాడితే మంచిదో సంబంధిత నిపుణులను సంప్రదించి వారి సలహా పాటించాలి.

*చలికాలంలో జుట్టు విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకు నేచురల్ హెయిర్ మాస్కులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. వీటిని ఇంట్లోనే మనం తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకు అరటిపండులో పాలు లేదా మీగడ వేసి పేస్టులా చేసి దాన్ని వెంట్రుకలకు పట్టిస్తే జుట్టుకు తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది.ఈ హెయిర్ మాస్కు వెంట్రుకలు చిట్లకుండా సంరక్షిస్తుంది కూడా.

* ఉసిరి ఆరోగ్యానికి, అందానికి ఎంతో పనికివస్తుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పలచబడకుండా ఉండేందుకు ఉసిరి పొడితో తల రుద్దుకోవచ్చు. రోజు విడిచి రోజు దీన్ని తలకు పెట్టుకోవడం వల్ల ఉసిరిలోని లాభాలన్నీ వెంట్రుకలకు అంది ఆరోగ్యంగా ఉంటాయి.

*జుట్టు పలచబడకుండా, ఊడకుండా ఉండేందుకు అలొవిరాను కూడా వాడొచ్చు. ఇది మాడుపై బాగా పనిచేయడమే కాదు హెయిర్ కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. చుండ్రును పోగొడుతుంది. అధిక నూనె వల్ల మూసుకుపోయిన జుట్టు కుదుళ్లను విశాలంచేసి గాలి తగిలేలా చేస్తుంది. వారంలో రెండు మూడుసార్లు అలొవిరా జల్ ని మాడుకు, వెంట్రుకలకు రాసుకుంటే మంచిది. అంతేకాదు అలొవిరా ఉన్న షాంపు, కండిషనర్లను జుట్టుకు వాడితే మంచిది.

*ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అలొపేసియా ఆటోఇమ్యూన్ డిసీజ్ (జుట్టు రాలిపోవడం)పై కూడా ఉల్లిపాయరసం బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

*నిత్యం వ్యాయామాలు చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుంది. కొందరిలో తలపై జుట్టు వత్తుదనం పోయి వెంట్రుకలు వెనక్కి పోతుంటాయి. దానిపై కూడా ఎసెన్షయిల్ ఆయిల్స్ బాగా పనిచేస్తాయి. రోజ్ మేరీ, లావండర్, పిప్పర్ మెంట్, లెమన్ గ్రాస్, టీ ట్రీ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ చుండ్రు వంటి ఇన్ఫెక్షన్లపై బాగా పనిచేస్తాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ తో తల మర్దన చేసుకుంటే కూడా జుట్టు ఊడడం తగ్గుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News