Friday, September 20, 2024
Homeహెల్త్Heal cracks: పాదాల పగుళ్లు తగ్గించే ట్రిక్స్

Heal cracks: పాదాల పగుళ్లు తగ్గించే ట్రిక్స్

చాలామంది పాదాల పగుళ్లతో బాధపడుతుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో పాదాలు బాగా పగులుతాయి. అంతేకాదు ఎక్కువసేపు నిలబడినా, పాదాలపై ఎక్కువ ప్రెషర్ పెట్టి పనిచేసినా, గట్టిగా ఉన్న పాదరక్షలు వాడినా కూడా పాదాలు పగులుతుంటాయి. పెడిక్యూర్ చేసుకుంటే పాదాల పగుళ్లు చాలావరకూ తగ్గుతాయి. పాదాల పగుళ్లు పోవడానికి కొన్ని వంటింటి చిట్కాలు కూడా ఉన్నాయి.

- Advertisement -

పాదాలు పొడిబారకుండా చూసుకోవాలి. పాదాలపై చేరిన దుమ్ముధూళి పోవడానికి తరచూ వాటిని క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయేముందు పాదాలను శుభ్రం చేసుకోవడం వల్ల పాదాలు పగలవు. ఈ సమస్యకు ఒక వంటింటి చిట్కా ఉంది. పిడికెడు బియ్యప్పిండి తీసుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల తేనెను, కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్ ను జోడించి స్టవ్ మీద కాసేపు వేడిచేసి పేస్టులా తయారుచేసుకోవాలి. అందులో రెగ్యులర్ గా వాడే కొబ్బరినూనె, బాదం లేదా ఆలివ్ ఆయిల్ వంటి ఏదైనా నూనెను రెండు స్పూన్లు వేసి బాగా కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో పాదాలను పదిహేను నిమిషాల పాటు ఉంచుకుని ఆతర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న పేస్టును పాదల పగుళ్లకు రాసి మర్నాడు ఉదయం లేచిన తర్వాత పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచూ చేసుకోవడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. ఇంకొక చిట్కా ఏమిటంటే, గ్లిజరిన్, రోజ్ వాటర్ రెండింటినీ పగుళ్లకు సరిపడే విధంగా సమపాళ్లల్లో తీసుకోవాలి. ఉదాహరణకు రెండింటినీ చెరో రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. పాదాలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ పేస్టును పగుళ్లకు అప్లై చేయాలి. ఇలా చేస్తే పాదాల పగుళ్లు తగ్గుతాయి. మరొక చిట్కా కూడా ఉంది.

అదేమిటంటే పగుళ్ల వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు పాదాలకు వేపాకు పేస్టు రాస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా పోతుంది. పసుపు, ఉప్పు వేసిన గోరువెచ్చటి నీళ్లల్లో పాదాలను పదిహేను నిమిషాలు ఉంచి ఆతర్వాత వేపాకు, పసుపు కలిపి మిశ్రమంలా చేసి దాన్ని పాదాల పగుళ్లపై పూయాలి. దానితోనే పాదాలను గంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గడమే కాకుండా పగుళ్లకు వచ్చిన ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా పోతాయి. సైబాల్ కూడా పాదాల పగుళ్లపై బాగా
పనిచేస్తుంది. ఇది మీకు మందుల షాపుల్లో దొరుకుతుంది. దీంతో పాదాలు ఎంతో మ్రుదువుగా తయారవుతాయి, మీరు చేయాల్సిదల్లా రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చటి నీళ్లల్లో పాదాలను పది పదిహేను నిమిషాలు ఉంచి తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేయాలి. ఆ తర్వాత పాదాల పగుళ్లపై కొద్దిగా సైబల్ అప్లై చేస్తే చాలు ఉదయం లేచిన వెంటనే పగుళ్ల బాధ మటుమాయం. ఇలా రెండు మూడు రోజులు చేస్తే పాదాలపై మంచి ఫలితం కనిపిస్తుంది. నిత్యం రాత్రి పూట పాదాలను శుభ్రం చేసుకుని సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే పాదాలు తొందరగా పగుళ్ల బారిన పడవు. పైగా మీ పాదాలు ఎంతో అందంగా, నాజూగ్గా కనిపిస్తాయి. పాదాలకు కొబ్బరినూనె, నువ్వుల నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి ఏదో ఒక వెజిటబుల్ ఆయిల్ ని అప్పుడప్పుడు పాదాలకు రాసుకొని మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు పొడిబారవు. వెజిటబుల్ ఆయిల్స్ పాదాలకు మంచి మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తాయి. పాదాలపై పగుళ్లు ఏర్పడవు.

ఈ సమస్యను తగ్గించే మరో చిట్కా ఏమిటంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండి ఆ మిశ్రమాన్ని పదిహేను నిమిషాల తర్వాత నిమ్మ చెక్క సహాయంతో పాదాల చుట్టూ రుద్దడం వల్ల పగుళ్లు తగ్గుతాయి. చివరిగా పాదాలను బాగా క్లీన్ చేసుకుని వేజ్ లైన్ లాంటి పెట్రోలియం జెల్లీలను పాదాలకు రాసుకుంటే కూడా పాదాల పగుళ్లు తగ్గి మ్రుదువుగా, నాజూగ్గా తయారవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News