Health benefits of humming : ఓంకారం, ఐంకారం.. ఇలా మంత్రోచ్ఛారణలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయని మనకు తెలుసు. కానీ, తుమ్మెద చేసే ‘ఝుంకారం’ (హమ్మింగ్) కూడా ఓ అద్భుతమైన ఔషధమని, దాంతో ఒత్తిడిని, బీపీని సైతం తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? యోగాలో ‘భ్రమరి ప్రాణాయామం’గా పిలిచే ఈ సులభమైన ప్రక్రియ, మన మానసిక, శారీరక ఆరోగ్యంపై విశేష ప్రభావం చూపుతుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.
ఏమిటీ ‘భ్రమరి ప్రాణాయామం’ : ‘భ్రమరి’ అంటే సంస్కృతంలో ఆడ తుమ్మెద. తుమ్మెద చేసే శబ్దం (ఝుంకారం)లా చేస్తూ, శ్వాసను నియంత్రించడమే ఈ ప్రాణాయామం. యువత నుంచి వృద్ధుల వరకు, ఎవరైనా, ఎక్కడైనా దీనిని సులభంగా సాధన చేయవచ్చు.
శాస్త్రీయంగా నిరూపితమైన ప్రయోజనాలు : ఇది కేవలం నమ్మకం కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ’ వంటి ప్రతిష్ఠాత్మక పత్రికలు దీని ప్రయోజనాలను ప్రచురించాయి.
ఒత్తిడికి చెక్: ఝుంకారం చేసేటప్పుడు పుట్టే కంపనాలు (vibrations), ఒత్తిడికి కారణమయ్యే ‘కార్టిసాల్’ హార్మోన్ స్థాయిలను తగ్గించి, మనసును ప్రశాంతపరుస్తాయి.
హైబీపీకి మందు: ఈ కంపనాలు రక్తనాళాలను విశాలంగా చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది అధిక రక్తపోటును (హైబీపీ) తగ్గించడంలో సహాయపడుతుంది.
శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం: ఈ ప్రక్రియ నాసికా మార్గాలలో ‘నైట్రిక్ ఆక్సైడ్’ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శ్వాస మార్గాలను శుభ్రపరిచి, సైనస్, అలర్జీ, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మెరుగైన నిద్ర, ఏకాగ్రత: క్రమం తప్పకుండా చేయడం వల్ల ఏకాగ్రత, నిద్ర నాణ్యత మెరుగుపడతాయి.
“ఓంకారం, ఝుంకారం.. రెండింటినీ ధ్యాన ప్రక్రియలో ఉపయోగిస్తాం. ఈ ఉచ్ఛారణల వల్ల శరీరంలోని నాడీ కేంద్రాలు స్పందించి, వాటితో ముడిపడి ఉన్న అన్ని అవయవాల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇవన్నీ శాస్త్రీయంగా రుజువైనవే.”
– ప్రొఫెసర్ కె. రమేశ్‌బాబు, విభాగాధిపతి, ఏయూ యోగా కేంద్రం
ఎలా చేయాలి? : ఈ ప్రాణాయామం కోసం రోజూ 5-10 నిమిషాలు కేటాయిస్తే చాలు.
ప్రశాంతమైన ప్రదేశంలో సుఖాసనంలో కూర్చోవాలి. కళ్లు, చెవులను చేతివేళ్లతో సున్నితంగా మూసుకోవాలి. లోతుగా శ్వాస తీసుకుని, బయటకు వదులుతూ, తుమ్మెద ఝుంకారం చేసినట్లుగా గొంతులోంచి శబ్దం చేయాలి. ఈ ప్రక్రియను 5-10 నిమిషాల పాటు పునరావృతం చేయాలి.
ఉదయం, నిద్రపోయే ముందు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఎలాంటి ఖర్చు, పరికరాలు అవసరం లేని ఈ సులభమైన ప్రక్రియతో, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.


