తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరుచుకోవడం, నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మన పురాతన ఆహార సంస్కృతిలో ఎండాకాలంలో మజ్జిగ తాగడం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతోంది. మజ్జిగ కేవలం శరీరాన్ని తేమగా ఉంచడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ కథనంలో మజ్జగ శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.
ఎండాకాలంలో మజ్జిగ తాగితే కలిగే ప్రయోజనాలు: ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం నీటిశాతం కోల్పోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. మజ్జిగ తాగడం వల్ల శరీరాన్ని చల్లబరచి, తేమను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మజ్జిగలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. గ్యాస్, అజీర్ణం, పేగు సమస్యలు తగ్గుతాయి. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉండటంతో ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అంతేకాదు, మజ్జిగలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొబయోటిక్స్ ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల వ్యాధులు దరిచేరకుండా సహాయపడుతుంది.
మజ్జిగ తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఇది తక్కువ ఫ్యాట్ ఉండే పానీయం కావడంతో అధిక బరువును పెంచకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందులోని కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. మజ్జిగ తాగడం వల్ల చర్మ ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. శరీరంలోని మలినాలను బయటికి పంపి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. ఎసిడిటీ, మైనర్ అల్సర్ సమస్యలను తగ్గించడంలో కూడా ఇది చాలా ఉపయోగకరం.
ఎండాకాలంలో కడుపు నిండిన భావన రావడంతో పాటు, శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే మజ్జిగను ప్రతి రోజూ మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మేలు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ సహజ పానీయం ఎంతో మంచిది. ఈ వేసవిలో మజ్జిగను తప్పక తాగండి, ఆరోగ్యంగా ఉండండి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)