ప్రస్తుత జీవనశైలిలో వంట నూనె వినియోగం గణనీయంగా పెరుగుతోంది. భారతదేశంలో ఒక వ్యక్తి సగటున ఏడాదికి సుమారు 23.5 లీటర్ల వంట నూనెను ఉపయోగిస్తున్నాడు. అయితే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సిఫార్సుల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 20 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ నూనె తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అంటే నలుగురు సభ్యుల కుటుంబానికి నెలకు గరిష్ఠంగా 4 లీటర్ల వరకు మాత్రమే వాడాలి.
వంట నూనె అధికంగా వినియోగించడం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, అధిక వినియోగం ఆర్థిక భారంగా కూడా మారుతుంది. ముఖ్యంగా, ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడడం ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. వేడి చేసిన నూనె రంగు మారినపుడు, జిగురుగా మారినపుడు దాన్ని వాడకూడదని నిపుణులు అంటున్నారు.
డీప్ ఫ్రై చేసిన నూనెను మళ్లీ వాడితే అది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. పదేపదే మరిగించిన నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని.. జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, పదేపదే వేడి చేసిన నూనెలో పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు వంటి ప్రమాదకర సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చని హెచ్చరించారు.
అలాగే వేడి చేసిన నూనెలో విటమిన్-ఈ, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషక విలువలు నశిస్తాయని, అదే సమయంలో నూనె రుచి కూడా మారి ఆహార రుచికీ దెబ్బ తగులుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నూనె వినియోగాన్ని నియంత్రించుకోవడం, ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడకపోవడం అత్యవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.