Health Tips for early wakeup In winter Season: ఉదయాన్నే నిద్ర లేవాలంటే చాలా మందికి బద్దకంగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం.. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే, ఈ అలవాటును మానుకోవాలని, ఉదయాన్నే లేవడం కోసం అలారం సైతం పెట్టి పడుకుంటారు. అయినప్పటికీ, గాఢ నిద్రలో ఉదయం లేవడం సాధ్యపడదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉదయం 5 గంటల సమయంలో నిద్ర లేవక చాలా మంది బద్ధకస్థులుగా మారుతుంటారు. ముఖ్యంగా చలి కాలంలో మరీ ఎక్కువగా ఈ బద్ధకం ఆవహిస్తుంది. చలి కారణంగతా ఉదయాన్నే లేవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే, ఉదయం పూట మంచం నుంచి లేవడానికి ఐదు సులభ చిట్కాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సులభమైన చిట్కాల ద్వారా ఈజీగా ఉదయం లేచి వ్యాయామం చేయవచ్చని చెబుతున్నారు. మరి ఆ సలహాలేంటో చూద్దాం.
త్వరగా నిద్ర లేవడానికి పాటించాల్సిన చిట్కాలు..
రాత్రి త్వరగా నిద్రపోవడం
ఉదయం త్వరగా లేవాలంటే.. రాత్రిపూట సరైన సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. మొబైల్ లేదా టీవీ చూస్తూ ఆలస్యంగా పడుకుంటే.. శరీరానికి తగినంత విశ్రాంతి లభించదు. దీనివల్ల
ఉదయం లేవడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి, రాత్రి 9 లేదా 10 గంటల మధ్య నిద్ర పోవాలి. ఇది శరీర జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించి.. త్వరగా నిద్ర లేచేలా ఉపకరిస్తుంది.
అలారం గడియారం దూరం
ఉదయం అలారం మోగినప్పుడు చాలా మంది సోమరితనం వల్ల వెంటనే దాన్ని ఆపేస్తారు. ఈ అలవాటును మానుకోవడానికి.. అలారం గడియారాన్ని మంచానికి కొంచెం దూరంగా పెట్టాలి. అలారం ఆపడానికి తప్పనిసరిగా లేవాల్సి వస్తుంది. అలా లేవగానే సగం సోమరితనం దానంతటదే తొలగిపోతుంది.
లేవగానే కర్టెన్లు తెరవడం
ఉదయం లేవగానే వెంటనే కర్టెన్లు తెరిచి.. వెలుతురు ఇంట్లోకి వచ్చేలా చేయండి లేదా లైట్లు వేయండి. ప్రకాశవంతమైన కాంతి మెదడుకు మేల్కొనడానికి సంకేతాలు పంపి.. వెంటనే చురుకుదనాన్ని కలిగిస్తుంది. తద్వారా మీ మత్తు వదిలి నిద్ర ధ్యాసే రాదు.
అందుబాటులో వెచ్చని దుస్తులు
చలిని తగ్గించుకోవడానికి..మంచం పక్కనే స్వెటర్ లేదా జాకెట్ సిద్ధంగా ఉంచాలి. అలారం మోగగానే దాన్ని వెంటనే ధరించాలి. ఇది చలి అనుభూతిని తగ్గించి నిద్ర పోగొడుతుంది. తద్వారా సులభంగా లేచి మన పనులు చేసుకోవచ్చు.
గోరువెచ్చని నీరు
నిద్ర లేచిన వెంటనే గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఇది శరీరానికి హైడ్రేషన్‌ను అందించి బాగా శక్తినిస్తుంది. నీరు తాగడం వల్ల నిద్రమత్తు, సోమరితనం తక్షణం తగ్గుతాయి. ఈ 5 సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా చల్లని వాతావరణంలో కూడా ఉదయం త్వరగా లేచి మీ రోజును సకాలంలో ప్రారంభించగలుగుతారని నిపుణులు సలహా ఇస్తున్నారు.


