The health benefits of homemade food for children : వీకెండ్ వస్తే చాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు పిల్లలతో, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి. ‘పిల్లలు అడిగారు కదా’ అని బయటి తిండి కొనివ్వడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. కానీ, ఈ తాత్కాలిక సంతోషం, వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో మనం గ్రహిస్తున్నామా..? తరచూ జలుబు, దగ్గు, నీరసం… ఆపై రక్తహీనత, ఊబకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలు. వీటన్నింటి వెనుక ఉన్న అసలు కారణం, పిల్లలు అమ్మ చేతి వంటకు దూరమై, బయటి జంక్ ఫుడ్‌కు బానిసలవడమేనని పోషకాహార నిపుణులు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. అసలు బయటి తిండి మన పిల్లల శరీరంపై ఎలాంటి విషప్రభావాన్ని చూపుతోంది? ఇంటి భోజనం వారి ఆరోగ్యానికి ఎలా రక్షణ కవచంగా నిలుస్తుంది..?
బయటి పదార్థాలతో అనర్థాలెన్నో : పిల్లలకు ఆకలి తీర్చాలనే తొందరలో, తల్లిదండ్రులు తెలియకుండానే వారి ఆరోగ్యానికి హాని చేస్తున్నారు.
విషతుల్యమైన పదార్థాలు: బయటి ఆహారంలో రుచి కోసం వాడే అధిక నూనెలు, మసాలాలు, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు, రసాయనాలు పిల్లల లేత శరీరాలపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతాయి.
దీర్ఘకాలిక వ్యాధులకు దారి: ఈ కల్తీ ఆహారం వల్ల తక్షణమే అజీర్తి, వాంతులు వంటి సమస్యలు వస్తే, దీర్ఘకాలంలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తహీనత వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
రోగనిరోధక శక్తి హరీ: రాష్ట్రంలోని విద్యార్థులలో సుమారు 40 శాతం మందిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటానికి, వారు తరచూ సీజనల్ వ్యాధుల బారిన పడటానికి ఈ ఆహారపు అలవాట్లే కారణమని సర్వేలు చెబుతున్నాయి.
ఇంటి వంట.. ఆరోగ్యానికి అండ : అమ్మ చేతి వంటలో కేవలం రుచి మాత్రమే కాదు, అంతులేని ప్రేమ, ఆరోగ్యం కూడా దాగి ఉంటాయి. ఇంటి భోజనం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.
పరిశుభ్రత, నాణ్యత: వంటకు వాడే పదార్థాల నాణ్యత, వండే ప్రదేశం పరిశుభ్రతపై పూర్తి నమ్మకం ఉంటుంది.
పోషకాల సమతుల్యం: పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవచ్చు. ఉప్పు, నూనె, కారం వంటివి వారి వయసుకు తగినట్లుగా, తక్కువ మోతాదులో వాడుకోవచ్చు.
ఆర్థిక ఆదా: బయటి తిండితో పోలిస్తే ఇంటి వంటతో డబ్బు ఎంతో ఆదా అవుతుంది.
అనుబంధాల పెరుగుదల: కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వల్ల, పిల్లలకు తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుంది. అమ్మ చేతితో తినిపించే గోరుముద్దలు వారిలో మానసిక భద్రతా భావాన్ని పెంచుతాయి.
నిపుణుల మాట : “వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి ఇంటి వంటే శ్రేయస్కరం. బయటి పదార్థాల్లోని కొవ్వులు, కల్తీల కారణంగా చిన్నారులు సులభంగా అనారోగ్యాల బారిన పడతారు. అమ్మ చేతితో వండిన ఆహారం తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. స్నాక్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బయట కొనే చిప్స్, చాక్లెట్లకు బదులుగా, ఇంట్లో చేసిన ఆరోగ్యకరమైన చిరుతిళ్లను అలవాటు చేయాలి.”
– జాహ్నవి, న్యూట్రిషనిస్ట్
పిల్లలు అడిగారు కదా అని ఒక్కసారికి ఏమవుతుందిలే అని సర్దిచెప్పుకోవడం మానేసి, వారి బంగారు భవిష్యత్తు కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం అమ్మ చేతి వంటకే పెద్దపీట వేద్దాం. ఆరోగ్యకరమైన అలవాట్లను చిన్నతనం నుంచే నేర్పిద్దాం.


