Mental health issues in Indian youth : నచ్చని చదువు.. దక్కని కొలువు.. నిలవని బంధం! ఆధునిక జీవనశైలి యువతరంపై మోపుతున్న అదృశ్య భారం ఇది. పైకి ఉత్సాహంగా కనిపిస్తున్నా, లోలోపల తీవ్రమైన ఒత్తిడితో, కుంగుబాటుతో (డిప్రెషన్) కుమిలిపోతున్నారు. ఈ మానసిక వేదన కొన్నిసార్లు వారిని ఆత్మహత్యల వైపు కూడా ప్రేరేపిస్తోంది. మన దేశంలో ప్రతి నలుగురు టీనేజర్లలో ఒకరు డిప్రెషన్‌తో బాధపడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసలు యువతను ఇంతలా కుంగదీస్తున్న ఆ సమస్యలేంటి? ఏ దశలో, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
ఒక్కో దశ.. ఒక్కో సవాల్ : యువత జీవితంలోని ప్రతి దశలోనూ విభిన్నమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని, వాటిని సకాలంలో గుర్తించి, అండగా నిలవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
పాఠశాల విద్యార్థులు (10-17 ఏళ్లు): పసి మనసులపై ఒత్తిడి బండ
సమస్యలు: పరీక్షల ఒత్తిడి, ఫలితాల భయం, తల్లిదండ్రుల అంచనాలు, స్నేహితులతో పోలికలు.
లక్షణాలు: చదువుపై ఆసక్తి తగ్గడం, స్నేహితులతో కలవకపోవడం, నిస్పృహ, తీవ్రమైన భావోద్వేగాలు.
నిజాలు: 2019-21 మధ్య 13,000 మందికి పైగా స్కూల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని NCRB గణాంకాలు చెబుతున్నాయి.
“తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దడంతో, వారిలో తెలియకుండానే ఒత్తిడి పెరుగుతోంది. జీవన నైపుణ్యాలు నేర్పకపోవడంతో, చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతున్నారు.”
– డాక్టర్ గౌరీదేవి, సీనియర్ సైకియాట్రిస్ట్
కాలేజీ యువత (18-24 ఏళ్లు): భవిష్యత్తుపై భయం.. బంధాల సంక్షోభం
సమస్యలు: ర్యాంకులు, ప్లేస్‌మెంట్ల టెన్షన్, ప్రేమ వైఫల్యాలు, సోషల్ మీడియా ప్రభావం, వ్యసనాలకు బానిస కావడం.
లక్షణాలు: తీవ్ర ఆందోళన, అకస్మాత్తుగా కోపం, నిద్రలేమి, పానిక్ అటాక్స్.
నిజాలు: కౌన్సెలింగ్ కోరుతున్న కాలేజీ విద్యార్థుల సంఖ్య 65% పెరిగిందని ‘పీక్ మైండ్’ నివేదిక చెబుతోంది.
ఉపాధిలో ఉన్న యువత (25-29 ఏళ్లు): కొలువుల కురుక్షేత్రం
సమస్యలు: ఉద్యోగ ఒత్తిడి, టార్గెట్లు, జాబ్ ఇన్‌సెక్యూరిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం.
లక్షణాలు: వర్క్‌ప్లేస్ బర్నవుట్, కుంగుబాటు, ఆల్కహాలిజం, ఆత్మహత్య ఆలోచనలు.
నిజాలు: దేశంలో 23 కోట్ల మంది మానసిక ఒత్తిడిలో ఉంటే, అందులో ఎక్కువ మంది యువ ఉద్యోగులేనని ‘నీతి ఆయోగ్’ సర్వే స్పష్టం చేస్తోంది.
పరిష్కారం.. మన చేతుల్లోనే : ఈ సమస్య నుంచి బయటపడాలంటే, మందు మన దగ్గరే ఉందని నిపుణులు భరోసా ఇస్తున్నారు.
తల్లిదండ్రుల పాత్ర: పిల్లల ఇష్టాలను గౌరవించాలి. వారిపై అనవసరమైన ఒత్తిడి పెట్టకూడదు. విలువలు, కుటుంబ సంబంధాలను చిన్నతనం నుంచే నేర్పించాలి.
ఉపాధ్యాయుల బాధ్యత: కేవలం బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థులకు నైతిక విలువలు, జీవన నైపుణ్యాలు నేర్పించాలి.
స్వీయ జాగ్రత్త: యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి అనిపించినప్పుడు, నమ్మకమైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. అవసరమైతే, మానసిక నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదు. కుంగుబాటుకు గురైన వారిని వెన్నుతట్టి, “మేమున్నాం” అనే భరోసా ఇస్తే, వారిని ఈ ఊబి నుంచి బయటకు తీసుకురావడం కష్టమేమీ కాదు.


