Friday, September 20, 2024
Homeహెల్త్kids dental care: చిన్నారుల దంతాల ఆరోగ్యం ఇలా

kids dental care: చిన్నారుల దంతాల ఆరోగ్యం ఇలా

పిల్లల ఆరోగ్యం విషయాలలో తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధచూబుతుంటారు. అయితే పిల్లల సాధారణ ఆరోగ్యంతో పాటు దంతాల ఆరోగ్యం విషయంలోనూ పెద్దవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల దంత సంరక్షణలో గమనించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సరైన పద్ధతిలో దంతాలు బ్రష్ చేసుకోవడాన్ని పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని చెప్తున్నారు. పసిపిల్లలకు చిన్న బ్రష్ లతో దంతాలన శుభ్రం చేయాలంటున్నారు. చిన్నారులకు చాలాకొద్ది పరిమాణంలో ఫ్లోరైడ్ టూత్ పేస్టు ను వాడి నీటితో దంతాలను సున్నితంగా క్లీన్ చేయాలంటున్నారు. బేబీకి రెండు సంవత్సరాలు నిండిన తర్వాత ఫ్లోసింగ్ చేయడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. పళ్లు తోమేటప్పుడు నోట్లోంచి వచ్చే పేస్టు నురుగును ఉమ్మడం ఎలాగో కూడా పిల్లలకు నేర్పించాలంట. నోటిలోని పేస్టున్నారు. నురుగను ఉమ్మేటప్పుడు పిల్లలకు నీటిని అస్సలు ఇవ్వొద్దని చెప్తున్నారు. అలా చేస్తే నీటితో పాటు పేస్టును కూడా పిల్లలు మింగుతారని హెచ్చరిస్తున్నారు. మూడు సంవత్సరాలున్న పిల్లలకు ఫ్లోరైడ్ టూత్ పేస్టును బటానీ గింజంత మాత్రమే ఉపయోగించాలని చెప్తున్నారు. ఈ వయసు పిల్లలకు దగ్గరుండి పళ్లు తోముకోవడం ఎలాగో తల్లిదండ్రులు నేర్పించాలని సలహా ఇస్తున్నారు. చాలామంది గమనించని మరొక విషయం
ఏమిటంటే చిన్న బేబీల్లో సైతం దంతక్షయం సంభవిస్తుందిట. దీనికి కారణం నిద్రపోతున్న పసిపిల్లల నోటిలో చాలామంది తల్లులు పాల సీసాలు లేదా జ్యూసు సీసాలు పెడుతుంటారు.
చక్కెర వేసిన పాలు, జ్యూసులు చిన్న పిల్లల దంతాలకు ఎన్నో గంటలు అంటిపట్టుకుని ఉండడం వల్ల దంతాలపైన ఉండే ఎనామిల్ దెబ్బతిని పండ్లు పాడవుతాయి. దీన్ని ‘బేబీ బాటిల్ మౌత్ డికే’ అంటారు. దీంతో ముందున్న పండ్ల వరుస రంగు మారుతుంది. దంతాలు మెరుపును కోల్పోతాయి. దంతక్షయం తలెత్తుతుంది. కొన్నిసార్లు సమస్య తీవ్రమయి చిన్నారుల దంతాలు పీకేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలకు ఆరు నెలలు నిండిన తర్వాత బాటిల్ నుంచి సిప్ కప్ లో పాలు తాగడం అలవాటు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

దంతాలు శుభ్రంచేసే ఎక్విప్ మెంటును వాడడాన్ని, దంతాలు శుభ్రంగా ఉంచుకోవడాన్ని చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పించాలని సూచిస్తున్నారు. పిల్లల్లో దంతాల పరిశుభ్రత అలవాట్లు కొరవడితే పలు దంత సంబంధిత జబ్బులు వస్తాయి. ముఖ్యంగా చెడు బాక్టీరియా దంతాలలో ఏర్పడి పిల్లల్లో
దంతక్షయం ఏర్పడుతుంది. నోటిలో మంచి బాక్టీరియా, చెడ్డ బాక్టీరియా రెండు ఉంటాయి. వీటిని సమతుల్యం చేసుకుంటూ నోటిలో మంచి బాక్టీరియా ఉండేట్టు దంత సంరక్షణ చేబట్టాలి. బాక్టీరియా లేకుండా నోటిని ఉంచలేం. ఎందుకంటే ఓరల్ మైక్రోబయొమ్ అనేది జీర్ణశయ ఆరోగ్యానికి, నోటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందుకే నోటిని బాక్టీరియా ఫ్రెండ్లీగా ఉంచుకుంటూ పిల్లల దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించాలి. చెడు బాక్టీరియా పండ్లల్లో చేరకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో గమనించినదేమిటంటే చాలామంది ఫ్లోరైడ్ లేని టూత్ పేస్టునే పిల్లలకు వాడాలని అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఫ్లోరైడ్ తక్కువగా ఉన్న టూత్ పేస్టు పిల్లలకు ఉపయోగించడం వల్ల దంతక్షయం బారిన చిన్నారులు పడరని వైద్యులు చెప్తున్నారు. బాక్టీరియా బారిన దంతాలు పడకుండా ఫ్లోరైడ్ టూత్ పేస్టు నిరోధిస్తుందంటున్నారు. అంతేకాదు పండ్ల ఎనామిల్ లో ఉండే కాల్షియంను ఇది పరిరక్షిస్తుంది. నోటిలో ఏర్పడే సెలైవాలో పిహెచ్ ప్రమాణాలను పెంచుతుంది.పిల్లల్లో చిన్నతనం నుంచి మౌత్ వాష్ లేదా ఓరల్ రిన్స్ అలవాటును పేరెంట్స్ పెంపొందించాలి. దీనివల్ల దంతాలు ఆరోగ్యంగా,
పరిశుభ్రంగా ఉంటాయి. పిల్లలు తీసుకునే ఆహారం, దంతాల పరిశుభ్రతా లోపం, వంశపారంపర్య కారణాల వల్ల కూడా దంతక్షయం సమస్య చిన్నారుల్లో తలెత్తుతుంది. రోజూ మౌత్ వాష్ చేసుకోవడం వల్ల దంతక్షయానికి కారణమైన బాక్టీరియా తగ్గుతుంది. అంతేకాదు చిగుళ్ల ఇన్ఫెక్షన్లకు కారణమైన బాక్టీరియా సమస్యను కూడా ఓరల్ రిన్స్ నివారిస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే రోజుకు రెండుసార్లు పండ్లు తోముకోవడాన్ని చిన్నారులకు తల్లిదండ్రులు అలవాటు చేయాలి. స్వీట్లు తిన్నప్పుడు ఈ పనిని పిల్లలు మరింత ముఖ్యంగా చేయాలని దంతవైద్యులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల దంతాలపై బాక్టీరియా చేరదు. పిల్లలు ఆహారం తినేటప్పుడు దంతాల మధ్యలో ఆహారపదార్థాలు ఇరుక్కుంటుంటాయి. వీటిని తొలగించడం అంత సులభం కాదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పలు దంత సమస్యలు తలెత్తుతాయి. పండ్ల సందుల్లో ఇరుక్కున ఆహారపదార్థాలను తొలగించే ఫ్లోసింగ్ గాడ్జెట్లు మార్కెట్ లో ఎన్నో ఉన్నాయి. వీటి వినియోగాన్ని చిన్నతనం నుంచే చిన్నారులకు తల్లిదండ్రులు అలవాటు చేయాలి. ఫ్లోసింగ్ వల్ల దంతాలు శుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంటాయి. అలాగే పిల్లలకు పెట్టే డైట్ కూడా దంత సంరక్షణ విషయంలో కీలకమవుతుంది. స్వీట్లు, ప్రోసెస్డ్ ఫుడ్స్ పిల్లలకు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా తక్కువ తీపి ఉన్నవి, ప్రోసెస్డ్ ఫుడ్స్ కానివి తినడం వల్ల పిల్లల నోటిలోని సెలైవాలో పిహెచ్ ప్రమాణం దెబ్బతినదు. దంతాలు కూడా దెబ్బతినవు. ఆకుకూరలు, కాల్షియం బాగా ఉన్న పాలు, పాల ఉత్పత్తులు, తీపిలేని పాలు, జున్ను వంటివి పిల్లలకు పెడితే దంతాల ఆరోగ్యానికి మంచిది. అలాగే దంతాల పరిశుభ్రత కోసం దంతవైద్యుల దగ్గరకు పిల్లలను తరచూ తీసుకెళ్లాలి. ఇలా చేస్తే ఆరోగ్యమైన దంతాలతో, పంటి ఆరోగ్యంతో పిల్లలు ఆనందంగా ఉంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News