నూతనంగా పుట్టిన శిశువును చూడగానే తల్లిదండ్రులు, బంధువులకు ఆపలేని ఆప్యాయత ఉప్పొంగుతుంది. చిన్న చిన్న చేతులు, మృదువైన చర్మం, అమాయకమైన ముఖం చూసి అబ్బా ఎంత ముద్దొస్తుందో అని అనిపించక మానదు. చాలా మంది నవజాత శిశువులపై చూపించే ప్రేమ వారికి లేనిపోని రోగాలను తెచ్చి పెడతాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో అవి వారి ప్రాణాలపైకి తెచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, శిశువులను ముఖంపై, ముఖ్యంగా పెదవులపై ముద్దు పెట్టడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే నవజాత శిశువుల్లో రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. ఆ దశలో చిన్నసైన వైరస్ లేదా బ్యాక్టీరియా కూడా తీవ్రమైన సమస్యలను కలిగించవచ్చు. ముద్దులో ఫ్లూ, కోల్డ్, కరోనా వంటి శ్వాసకోశ వ్యాధులు చాలా సులభంగా శిశువుకు చేరే ప్రమాదం ఉంది. ఇక హెపటైటిస్ బి, హెర్పీస్ వైరస్ వంటి సంక్రమణలు పెదవుల నుంచి నేరుగా శిశువుకి సంక్రమించవచ్చు. ఇక పెద్దవారు వాడే లిప్ స్టిక్‌లు, ఫేస్ క్రీములు శిశువుల సున్నిత చర్మానికి హానికరమవవచ్చు.
నవజాత శిశువుకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు లేకపోతే శిశువు నుదిటిపై, చేతులపై, లేదా కాళ్లపై ముద్దు పెట్టుకోవచ్చు. ఇది శిశువు భద్రతకూ హానికరం కాదు, ప్రేమను వ్యక్తపరచడానికీ మంచి మార్గం. ఇక పాఠశాలకి వెళ్లే పిల్లలు తమ తమ్ముళ్లు, చెల్లెళ్లు శిశుతో మెలగేటప్పుడు ముఖానికి దగ్గరగా రాకుండా చూసుకోవాలి. శిశువుని ఎత్తుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం.. శానిటైజ్ చేయడం తప్పనిసరి. జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి లక్షణాలు ఉన్నవారు శిశువు దగ్గరకు రాకుండా చూడాలి. మనం చూపించే ప్రేమ నవజాత శిశువుకి ప్రమాదం కలిగించ కుండా జాగ్రత్త ఉండటం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు.