Leg pain as a symptom of PAD : కొద్ది దూరం నడవగానే కాళ్లు, పిక్కల్లో తీవ్రమైన నొప్పి.. కాసేపు ఆగితే తగ్గిపోవడం.. మళ్లీ నడక మొదలుపెట్టగానే తిరగబెట్టడం.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే, దానిని సాధారణ నొప్పని కొట్టిపారేయకండి! అది మీ కాళ్లకు రక్త సరఫరా సరిగా అందడం లేదనడానికి, ‘పరిధీయ ధమని వ్యాధి’ (Peripheral Artery Disease – PAD)కి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరిగా సరఫరా అయితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే, ధమనులలో (రక్తనాళాలు) కొవ్వు, కాల్షియం వంటివి పేరుకుపోయి, పూడికలు ఏర్పడినప్పుడు, రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఇలా కాళ్లకు వెళ్లే రక్తనాళాలలో పూడికలు ఏర్పడటాన్ని ‘పరిధీయ ధమని వ్యాధి’ (PAD) అంటారు.
హెచ్చరిక సంకేతాలు.. విస్మరించవద్దు : ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే, తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
నడిస్తే నొప్పి, ఆగితే మాయం: నడుస్తున్నప్పుడు పిక్కలు, తొడలలో నొప్పిగా, పట్టేసినట్లు ఉండటం. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోవడం.
పాదాల్లో మార్పులు: పాదాలు చల్లగా ఉండటం, వేళ్ల రంగు మారి నల్లగా అవ్వడం, గోళ్లు నెమ్మదిగా పెరగడం.
మానని పుండ్లు: పాదాలపై, వేళ్లపై చిన్న గాయమైనా, పుండ్లు పడినా అవి సులభంగా మానకపోవడం.
ఎవరికి ప్రమాదం ఎక్కువ : కొన్ని వర్గాల వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ (National Library of Medicine), ‘మేయోక్లినిక్’ (Mayo Clinic) వంటి సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి.
మధుమేహం ఉన్నవారు: డయాబెటిస్ వల్ల రక్తనాళాలు త్వరగా దెబ్బతింటాయి.
పొగతాగేవారు: పొగాకులోని నికోటిన్, రక్తనాళాలను కుంచింపజేసి, పూడికలకు కారణమవుతుంది.
వీరితో పాటుగా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవారు.
నిర్లక్ష్యం చేస్తే.. నరకమే : “నడుస్తున్నప్పుడు నొప్పి వస్తోందంటే, కాళ్లకు రక్త ప్రసరణ గణనీయంగా తగ్గిందని అర్థం. కూర్చున్నప్పుడు కూడా నొప్పి వస్తోందంటే, పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరినట్లే,” అని వ్యాస్కులర్ సర్జన్ డా. కె.కె. పాండే హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే, కణజాలం దెబ్బతిని (గ్యాంగ్రీన్), వేళ్లు, పాదాలను తొలగించాల్సి రావచ్చు.
చికిత్స ఏంటి :
“సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. ప్రారంభ దశలో రక్తాన్ని పలుచగా చేసే మందులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులతో ఫలితం ఉంటుంది. పూడికలు ఎక్కువగా ఉంటే, స్టెంట్ వేయడం లేదా బైపాస్ సర్జరీ ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించవచ్చు.”
– డా. కె.కె. పాండే, వ్యాస్కులర్ & కార్డియోథొరాసిక్ సర్జన్
కాబట్టి, నడకలో నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే వ్యాస్కులర్ సర్జన్‌ను సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా, మీ కాళ్లను, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


