జీర్ణశక్తికి పుదీనా-ధనియా టీ
పుదీనా,ధనియా టీ ఎప్పుడైనా తాగారా? ఇది జీర్ణశక్తి సమస్యలను తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుందని పోషకాహారనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అజీర్తి నివారణకు ఈ టీ ఎంతో బాగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు తినే డైట్ లో ఎక్కువ పీచుపదార్థాలు ఉండేలా చూసుకుంటే జీవక్రియ బాగా జరుగుతుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. అలాంటి వాటిల్లో పుదీనా, కొత్తిమీర టీ రెసిపీ కూడా ఒకటని వారంటున్నారు.
జీవక్రియకు సంబంధించిన ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా యాంటాక్సిడెంట్లు ఎంతగానో తోడ్పడతాయని చెప్తున్నారు. ఇవి పుదీనా, ధనియాల టీ లో పుష్కలంగా ఉండి జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయని అంటున్నారు. అంతేకాదు పుదీనా ఆకుల్లో, ధనియాల గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. అలాగే ముందే చెప్పినట్టు వీటిల్లో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. ఈ టీ తాగడం వల్ల జీర్ణశక్తి ఆరోగ్యంగా తయారవడమే కాదు ఇరిటబుల్ బౌల్ సిడ్రోమ్ (ఐబిఎస్) సమస్య కూడా బాగా తగ్గుతుందని డైటీషియన్లు అంటున్నారు.
ఈ టీ తయారీ చాలా సింపుల్. రెండు కప్పుల నీళ్లు తీసుకుని గిన్నెలో పోసి అందులో ఏడు లేదా ఎనిమిది పుదీనా ఆకులు, అర టీస్పూను ధనియాలు వేయాలి. ఆ నీళ్లు సగానికి వచ్చే వరకూ స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. తర్వాత ఆ టీని కప్పులో వొడగట్టి తాగాలి. రుచి, సువాసనల కోసం మీకు కావాలంటే కొద్దిగా తేనె, నిమ్మరసాలను ఇందులో కలుపుకుని తాగొచ్చు కూడా. మంచిది కదా అని ఈ టీని అతిగా తాగితే చేటుచేస్తుందని, అందుకే రోజుకు ఒక కప్పు మాత్రమే తాగాలని కూడా డైటీషియన్లు సూచిస్తున్నారు.