చలికాలం వస్తే చాలు చర్మం, జుట్టు సంరక్షణలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. కానీ చేతులు, పాదాల గోళ్ల విషయంలో మాత్రం అశ్రద్ధ వహిస్తుంటాం. అందుకే ఈ సీజన్ లో గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని టిప్స్ మీకోసం:
చలికాలంలో గోళ్లకు పాలిష్ తప్పనిసరిగా వేసుకోవాలి. పాలిష్ నీళ్ల నుంచి గోళ్లను సంరక్షిస్తుంది. గోళ్లు పటిష్టంగా ఉండి విరగకుండా కాపాడుతుంది.
గోళ్లకు కూడా మాయిశ్చరైజర్ అవసరం. టేబుల్ స్పూన్ బాదం, ఆముదం నూనె మిశ్రమంలో కొద్దిగా హ్యాండ్ క్రీము వేసి అందులో 20 నిమిషాల పాటు గోళ్లను ఉంచాలి. ఆ తర్వాత దాన్ని చేతులకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే గోళ్లు, చేతులు మెరుపును సంతరించుకుంటాయి.
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గే కొద్దీ గోళ్లల్లో తేమ తగ్గిపోతుంది. తేమ కొరవడడం వల్ల గోళ్లు విరిగిపోతుంటాయి. పొడారినట్టు అవుతాయి. అందుకే ఎప్పుడూ తేమ ఉండేలా గోళ్లకు, చేతులకు , వేళ్లకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మంచి హ్యాండ్ క్రీము తీసుకుని దాన్ని ప్రతి గోరు మీద, వేళ్ల మీద బాగా పట్టేలా మసాజ్ చేసుకోవాలి.
బయట షాపుల్లో దొరికే హ్యుమిడిఫైయర్స్ కూడా గోళ్లు, చేతులపై బాగా పనిచేస్తాయి.
గోళ్లదగ్గర ఉండే చిగుళ్లు గోళ్లను సంరక్షిస్తాయి. అందుకే గోళ్ల చిగుళ్లకు కూడా క్రీము లేదా నూనె రాసి మసాజ్ చేస్తే వాటికి కావలసినంత మాయిశ్చరైజర్ అందుతుంది. ఇలా చేయడం వల్ల గోళ్లు విరగకుండా, చిట్లకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
చలికాలంలో గోళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే చేతులకు గ్లోవ్స్ వేసుకోవడం మంచిది. ఇలా చేస్తే గోళ్లు పొడారినట్టు అవవు. గోళ్లల్లో మలినాలు చేరవు. చలి వల్ల గోళ్లు చిట్లకుండా గ్లోవ్స్ కాపాడతాయి కూడా.
పాలిష్ వేసుకునేటప్పుడు గోళ్లపై బేస్ కోట్ నుంచి టాప్ కోట్ వరకూ వేసుకోవాలి.
డైట్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. సమతులాహారం తీసుకుంటే గోళ్లు ద్రుఢంగా ఉంటాయి. వాల్ నట్స్, శెనగలు, ఆకుకూరలు, అవకెడో వంటివి తింటే గోళ్లు బలంగా ఉంటాయి.
పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా మెనిక్యూర్ చేయించుకోవాలి. మెనిక్యూర్ చేయించుకోబోయే ముందు గోరువెచ్చటి ఆలివ్ ఆయిల్ లో ఐదు నిమిషాలు గోళ్లను నాననివ్వాలని మరవొద్దు.
చలికాలంలో గోళ్లు పగులుతుంటాయి. చిట్లుతుంటాయి. అందుకే రెండు టేబుల్ స్పూన్ల గెలటైన్ ని ఒక గ్లాసుడు నీళ్లల్లో కలుపుకుని రోజూ తాగాలి. ఇలా చేస్తే గోళ్లు గట్టిగా ఉంటాయి.