Friday, November 22, 2024
Homeహెల్త్Neck wrinkles: మెడపై ముడతలా ?

Neck wrinkles: మెడపై ముడతలా ?

వయసు మీద పడే కొద్దీ శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. వెంట్రుకలు తెల్లబడడం, ముఖం మీద, మెడ మీద చర్మం ముడతలు పడడం వంటివి చూస్తాం. మెడ మీద ముడతలు కనిపిస్తున్నాయంటే వయసు మీద పడుతోందని అర్థం. మెడ భాగంలో ఉండే కొలేజన్ ప్రమాణం తగ్గుతూ రావడం ఇందుకు ఒక కారణం అయితే, సూర్యరశ్మి బారిన ఎక్కువగా పడడం వల్ల, పోషకాహార లోపం వల్ల, స్కిన్ కేర్ సరిగా చేపట్టకపోవడం వల్ల కూడా మెడ మీద ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఇవి ఏర్పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే…

- Advertisement -

 నీళ్లు బాగా తాగితే మెడపై గీతలు ఏర్పడవు. రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మెడపై ఉండే చర్మంతో పాటు శరీరం మొత్తం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

 చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే డైట్ ను తీసుకోవాలి. అంటే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎ,సి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉండే కాయగూరలను, పండ్లను తింటే చర్మం మెరుపును సంతరించుకుంటుంది. యంగ్ గా కనిపిస్తారు.

 చర్మంలో తేమ ఉండేలా చూసుకోవాలి. ముఖం మాయిశ్చరైజింగ్ మీదే ఎక్కువమంది శ్రద్ధ పెడుతుంటారు. కాస్మొటిక్ ట్రీట్ మెంట్స్ చేయించుకుంటుంటారు. మెడ విషయంలో శ్రద్ధ చూపరు. వయసు పెరిగే కొద్దీ చర్మం సహజసిద్ధంగా పొడారిపోతుంటుంది. కాబట్టి ముఖానికి మాయిశ్చరైజింగ్ చేసుకునేటప్పుడు మెడపై చర్మానికి కూడా తప్పకుండా మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి.

 చర్మంపై ఉండే మ్రుతకణాల వల్ల చర్మం కాంతివిహీనంగా ఉంటుంది. అందుకే మెడ భాగంలోని చర్మంపై ఎక్స్ ఫోయిలేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మ్రుతకణాలతో పాటు, చర్మంపై జిడ్డుతనం కూడా పోయి చర్మం కాంతివంతమవుతుంది. అందుకే వారానికి ఒకసారి ముఖంతో పాటు మెడ భాగంలో కూడా ఎక్స్ ఫొయిలేట్ ప్రక్రియ చేసుకోవాలి.

 సూర్య రశ్మి బారిన ఎక్కువగా పడితే చర్మంపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు ముఖంతో పాటు మెడ భాగంలోకూడా సన్ స్ర్కీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి. సూర్యరశ్మి వల్ల తలెత్తే దుష్ఫలితాల నుంచి సన్ స్క్రీన్ చర్మాన్ని పరిరక్షిస్తుంది.

 మెడ సంబంధమైన వ్యాయామాలు చేయడం వల్ల మెడపై గీతలు, ముడతలు తొందరగా ఏర్పడవు. ఫేస్ యోగా, మెడ వ్యాయామాలు చేయడం వల్ల ఆ ప్రాంతంలోని కండరాలు ఉత్తేజితమై ఆ భాగంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కొల్లేజన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. మెడ మీద అప్పటికే ఏర్పడిన గీతలను ఈ వర్కవుట్లు పోగొట్టవు కానీ భవిష్యత్తులో మెడ మీద ముడతలు పడకుండా నియంత్రిస్తాయి.

 మీ మెడ భంగిమలు కూడా మెడపై ముడతలు పడడానికి కారణమవుతుంటాయి. ఉదాహరణకు ఫోనువస్తే మెడను పక్కకు వంచి మాట్లాడుతుంటారు. అలాంటి అలవాటు వల్ల తలెత్తే సమస్యను టెక్ నెక్ అంటారు. ఈ అలవాటు వల్ల మీరు యంగ్ అయినా కూడా మెడపై లోతైన ముడతలు ఏర్పడతాయి. అందుకే మెడను నిటారుగా ఉంచి ఫోనులో మాట్లాడడం అలవాటు చేసుకుంటే మంచిది.

 నిత్యం తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల కూడా మెడపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఒత్తిడి నుంచి కొంచెంసేపు విశ్రాంతిగా మనసును పెట్టుకుంటే దాని సత్ఫలితాలు మీ ముఖంపై, చర్మంపై, శరీరంపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అందుకే ఒత్తిడి, యాంగ్జయిటీల నుంచి బయటపడేందుకు నిత్యం శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తే మంచిది.

 మెడపై పడే ముడతలు, గీతలు పోవడానికి కొన్ని వంటింటి చిట్కాలు కూడా ఉన్నాయి. మెడపై గీతలు పోగొట్టుకోవడానికి పైనాపిల్ జ్యూసు శక్తివంతంగా పనిచేస్తుంది. కారణం ఈ పండు జ్యూసులో అధిక మోతాదులో యాంటాక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. దీన్ని రాసుకోవడం వల్ల మెడపైగానీ, ముఖంపై గానీ ముడతలు ఏర్పడవు. అందుకే పైనాపిల్ గుజ్జు నుంచి తీసిన రసంతో ముఖాన్ని, మెడను మసాజ్ చేసుకుని పదిహేను నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా మూడు నెలలు చేస్తే మంచి పురోగతిని చూస్తారు.

బాదం పప్పులు కూడా మెడపై ముడతలను పోగొడతాయి. దీనికి చేయాల్సిందేమిటంటే రాత్రి పాలల్లో కొన్ని బాదం పప్పులు వేసి ఉదయం దాకా నానబెట్టాలి. ఉదయం వాటిని పేస్టులా చేసి దాన్ని మెడకు పట్టించాలి. ఇది బాగా ఆరిన తర్వాత నీళ్లతో మెడను కడిగేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ వల్ల కూడా మెడ మీద ఉండే గీతలు, ముడతలు పోతాయి. ఈ నూనెలో నేచురల్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. ఇవి మెడమీద గీతలను పొగొట్టి అక్కడి చర్మాన్ని మెరిసేట్టు చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా రాత్రి నిద్రపోయేముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని గోరువెచ్చగా చేసి దాన్ని ముఖం, మెడ భాగాలలో మసాజ్ చేసినట్టు రాయాలి.

మెడమీద ముడతలు సహజంగా పోవాలంటే బియ్యప్పిండిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసి చిక్కని పేస్టులా చేసి దాన్ని మెడపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు అలాగే ఉంచుకొని చల్లటి నీళ్లతో మెడను కడిగేసుకోవాలి. అలొవిరా మాస్కు కూడా మెడ మీద ముడతలను పోగొడుతుంది.

చర్మానికి వాడే విటమిన్ ఇ కాప్స్యూల్ తీసుకుని అందులో జెల్ ను ఒక స్పూన్ అలొవిరా గుజ్జుతో కలిపి పేస్టులా చేసి దాన్ని మెడకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో మెడను కడిగేసుకోవాలి. మెడపై ముడతలు పోవడానికి డెర్మల్ ఫిల్లర్స్, బొటాక్స్ ఇంజెక్షన్, రీసర్ఫేసింగ్ వంటి ఎన్నో కాస్మొటిక్ ట్రీట్ మెంట్స్ కూడా ఉన్నాయి. చర్మనిపుణుల సలహాతో వాటిని కూడా చేయించుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News