Saturday, November 15, 2025
Homeహెల్త్Thiamine deficiency : పాలిష్ బియ్యంతో పసికందుల ప్రాణాలకు ముప్పు!

Thiamine deficiency : పాలిష్ బియ్యంతో పసికందుల ప్రాణాలకు ముప్పు!

Thiamine deficiency from polished rice : మీ ఇంట్లో ఆరు నెలల లోపు చిన్నారి ఉన్నారా? ఉన్నట్టుండి ఆయాసపడుతున్నారా? గుండె వేగంగా కొట్టుకుంటోందా? ఫిట్స్ వస్తున్నాయా? అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇవి ‘బెరిబెరి’ అనే ప్రాణాంతక వ్యాధి లక్షణాలు కావచ్చు. ముఖ్యంగా, మనం తినే పాలిష్ బియ్యమే ఈ వ్యాధికి ప్రధాన కారణమని, ఇది థయామిన్ (విటమిన్-బి1) లోపం వల్ల వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఏమిటీ బెరిబెరి? దీనికి, మనం తినే అన్నానికి సంబంధం ఏమిటి?

- Advertisement -

ఏమిటీ ‘బెరిబెరి’ :  బెరిబెరి అనేది థయామిన్ (విటమిన్ B1) లోపం వల్ల వచ్చే వ్యాధి. శరీరంలో శక్తి ఉత్పత్తికి, నరాలు, గుండె పనితీరుకు థయామిన్ అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపిస్తే, ఈ అవయవాల పనితీరు దెబ్బతింటుంది.

పొడి బెరిబెరి: దీనివల్ల నరాల బలహీనత, కాళ్లలో స్పర్శ కోల్పోవడం, పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తడి బెరిబెరి : ఇది గుండె, ప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపి, గుండె వైఫల్యానికి దారితీస్తుంది. పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే, మూడు, నాలుగు రోజుల్లోనే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పాలిష్ బియ్యమే ప్రధాన శత్రువు : ఈ వ్యాధికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే.
బియ్యాన్ని తెల్లగా మెరిసేలా చేయడానికి అధికంగా పాలిష్ చేయడం వల్ల, దానిపై ఉండే పోషకాల పొర (తవుడు) తొలగిపోతుంది. థయామిన్ ప్రధానంగా ఈ పొరలోనే ఉంటుంది.
అంతేకాకుండా, అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువసార్లు కడగడం వల్ల, నీటిలో కరిగే గుణం ఉన్న ఈ విటమిన్ పూర్తిగా నశిస్తుంది.

ఎక్కడ ఎక్కువ : తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి గోదావరి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి బెరిబెరి కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో పాలిష్ చేసిన బియ్యం వాడకం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) చేసిన అధ్యయనంలో, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపురలలో ఈ లోపం 30% వరకు ఉన్నట్లు తేలింది.

బియ్యంలో థయామిన్ ఉండేలా చూడాలి. తక్కువ పాలిష్ చేసినవి, దంపుడు బియ్యం తినడం ఉత్తమం. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఫోర్టిఫైడ్ (పోషకాలు జోడించిన) బియ్యాన్ని వాడాలి.”
– డాక్టర్ మహేష్‌కుమార్ ముమ్మాడి, శాస్త్రవేత్త, నిం

నివారణ సులభమే : ఈ వ్యాధికి చికిత్స, నివారణ రెండూ సులభమే. గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా ప్రభుత్వం అందించే బి-విటమిన్ మాత్రలను వాడాలి.
ఆహారంలో దంపుడు బియ్యం, తృణధాన్యాలు, నట్స్, బీన్స్, మాంసం వంటి థయామిన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి.

పసిపిల్లల్లో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే, తక్షణమే ఆసుపత్రికి తరలించి, థయామిన్ ఇంజక్షన్లు, మాత్రలతో చికిత్స అందించాలి. ఆరోగ్యంపై అవగాహనతో, ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మన చిన్నారులను కాపాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad