Friday, November 22, 2024
Homeహెల్త్Pre-Marital Examiation : పెళ్లికి ముందే ఆ.. ప‌రీక్ష‌!

Pre-Marital Examiation : పెళ్లికి ముందే ఆ.. ప‌రీక్ష‌!

మ‌గ‌వారి సామ‌ర్థ్యం ఎంతో తేలుస్తున్న మ‌గువ‌లు

న‌రేష్‌కి కొత్త‌గా పెళ్ల‌యింది. ఆరోజు ఫ‌స్ట్ నైట్. అప్ప‌టివ‌ర‌కు మ‌న‌వాడికి ఎలాంటి అనుభ‌వం లేదు. అంత‌కుముందంతా కుటుంబ ఆర్థిక స‌మస్య‌లు, ఇంట్లోవారికి అనారోగ్యాలు.. వాటితో అటువైపు చూపు మ‌ళ్ల‌లేదు. కోటి ఆశ‌ల‌తో కొత్త పెళ్లికూతురు సౌజ‌న్య శోభ‌నం గ‌దిలోకి అడుగుపెట్టింది. కాసేపు మాట‌లు అయ్యాక అస‌లు విష‌యానికి వెళ్లేస‌రికి.. న‌రేష్‌కి అస‌లు క‌రెంటు లేద‌ని తేలిపోయింది. ఈ విష‌యం ఇంట్లోవాళ్ల‌కి చెప్పాలా.. లోలోప‌లే దాచుకుని కుమిలిపోవాలో అర్థం కాక సౌజ‌న్య స‌త‌మ‌తం అవుతోంది.

- Advertisement -

సాగ‌రిక‌కు పెళ్లిచూపులు అయ్యాయి. పెళ్లికొడుకు మ‌నీష్‌ చూడ‌టానికి బాగానే ఉన్నాడు. మంచి ఉద్యోగం, ఆరంకెల జీతం. కుటుంబం కూడా బాగానే ఉంది. కానీ త‌న స్నేహితురాలు సౌజ‌న్య‌కు ఎదురైన అనుభ‌వం సాగ‌రిక‌కు తెలుసు. అందుకే మ‌నీష్‌ను బ‌య‌ట విడిగా ఓసారి క‌లుద్దామ‌ని ఫోన్‌లో చెప్పింది. ఏదైనా కాఫీ షాప్ అనుకుని మ‌నీష్ స‌రేన‌న్నాడు. కానీ సాగ‌రిక అత‌డికి పంపిన లొకేష‌న్.. ఒక ఓయో రూం. అక్క‌డ‌కు వెళ్లాక హ్యాండ్‌బ్యాగ్‌లోంచి కండోమ్ తీసిచ్చింది. క‌థ సుఖాంతం అవ‌డంతో పెళ్లికి ఓకే చెప్పింది.

ఈ రెండు సంఘ‌ట‌న‌ల్లో పేర్లు అస‌లువి కావుగానీ, విష‌యం మాత్రం నూటికి నూరుపాళ్లు నిజం. కేవ‌లం ఈ రెండు జంట‌ల విష‌యంలోనే కాదు.. దేశంలో అనేక మంది యువ‌తులు ఇప్పుడు పెళ్లికి ముందే తాము మ‌నువాడ‌బోయేవాడు ఆ విష‌యంలో ఘ‌టికుడేనా కాదా.. అనే విష‌యాన్ని తేల్చేసుకుంటున్నారు. సంసారానికి ప‌నికిరానివాళ్లు ఆ విష‌యాన్ని దాచిపెట్ట‌డ‌మో, అస‌లు త‌మ‌కు కూడా తెలియ‌కుండా ముందు పెళ్లి చేసేసుకోవ‌డ‌మో జ‌రుగుతోంది. దానివ‌ల్ల ఆ త‌ర్వాత అనేక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కొన్ని కేసుల్లో పెళ్లి ఖ‌ర్చులు, న‌ష్ట‌ప‌రిహారం కూడా తీసుకుని విడాకులు ఇచ్చేస్తుంటే, మ‌రికొన్ని కేసుల్లో ఆ విష‌యాన్ని కుటుంబ‌స‌భ్యుల వ‌ద్ద కూడా దాచిపెట్టి, ఎక్కువ‌కాలం అలా ఉండ‌లేక వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌స్య‌లు ఎందుక‌ని ఇటీవ‌లి కాలంలో ఉత్త‌ర‌భార‌తం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల‌తో పాటు ద‌క్షిణాదిలోనూ క్ర‌మంగా ఈ కొత్త సంస్కృతి మొద‌లవుతోంది. పెళ్లి అనుకున్న‌ప్పుడు ఎంగేజ్‌మెంట్ అవ్వ‌డానికి ముందే ఒక‌సారి శారీర‌కంగా క‌లిసి.. ఇద్ద‌రి విష‌యంలోనూ అన్నీ బాగున్నాయ‌ని అనుకుంటేనే ముందుకు వెళ్తున్నారు. లేద‌నుకుంటే ఏదో ఒక కార‌ణం చెప్పి, అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్ట‌కుండా సంబంధం ర‌ద్దు చేసుకుంటున్నారు. ఆ విష‌యాన్ని గుట్టుగా ఉంచుతున్నారు కాబ‌ట్టి ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందీ ఉండ‌ట్లేదు.

నిజానికి సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, మ‌హిళ‌లు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లిళ్లు చేసుకోవడం, ఆ తర్వాత భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. అందువ‌ల్ల పెళ్లికి ముందే అబ్బాయిలకు ఇంపొటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు జ‌డ‌త్వం (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ఎందుకు తప్పనిస‌రి చేయకూడదని మద్రాసు హైకోర్టు కేంద్ర ప్ర‌భుత్వాన్ని సైతం ఇటీవ‌ల‌ ప్రశ్నించింది. లైంగిక సామర్థ్యం లేనివారు, సమస్యలు ఉన్నవారు వాటిని దాచిపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటే ఎందుకు ప్రశ్నించకూడదని, అలాంటి వారిపై చర్యలెందుకు తీసుకోరని నిలదీసింది. వివాహానికి ముందే వైద్య పరీక్షలు నిర్వహిస్తే లైంగిక సామర్థ్యం, వ్యాధుల వంటి వాటిపై అవగాహన కలుగుతుందని వ్యాఖ్యానించింది. సమస్యలను దాయడం ద్వారా మహిళలు నష్టపోయి, బాధితులుగా మిగులుతున్నారని తెలిపింది. దీనికి సరైన పరిష్కారం వివాహానికి ముందే వైద్య పరీక్షల నిర్వహణ అని హైకోర్టు స్పష్టం చేసింది.

నపుంసకుడైన భర్త నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని చెన్నైకు చెందిన ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులోనే జ‌స్టిస్ కృపాక‌ర‌న్ వ్యాఖ్యానించారు. కాబోయే భార్యాభర్తలకు పెళ్లికి ముందే లైంగిక‌ సామర్థ్య పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్రం ఆలోచన చేయాలని సూచించారు. తద్వారా దంపతులు కలకాలం కలిసి జీవించేందుకు బాటలు వేయాలని కోరారు. నపుంసకత్వాన్ని దాచి పెళ్లి చేసుకోవ‌డం అంటే.. జీవిత భాగస్వామిని మోసం చేసినట్లేని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

కానీ అందుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌సేమిరా అంది. యువతీయువకులకు పెళ్లికి ముందే లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించలేమని, అది వ్యక్తి గత స్వేచ్ఛను హరించడమే అవుతుందని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఒక వ్యక్తి సమ్మతం మేరకే వైద్య పరీక్షలు చేస్తారు త‌ప్ప‌.. ఎవ‌రినీ ఈ విషయంలో ఏ ఒక్కరినీ నిర్బంధించలేమ‌ని.. యువతులను నిర్బంధ కన్యత్వ పరీక్షలు, యువకులను లైంగిక సామర్థ్య టెస్టులకు సమ్మతించాలని కోరలేమ‌ని కుండ బ‌ద్ద‌లుకొట్టింది. ఒక ర‌కంగా ఇది మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌నే అవుతుంద‌ని చెప్పింది. అందువ‌ల్ల పెళ్లికి ముందు యువతీ యువకులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని కేంద్రప్ర‌భుత్వం తేల్చి చెప్పింది.

అయితే, చ‌ట్ట‌బ‌ద్ధంగా చేయ‌డం అంటే సాధ్యం కాక‌పోవ‌చ్చు గానీ.. యువ‌తీ యువ‌కులు ఇద్ద‌రూ స‌మ్మ‌తించి, త‌మంత‌ట తాముగా స్వ‌చ్ఛందంగా ఇలాంటి ప‌రీక్ష‌లు స్వ‌యంగానే చేసుకుంటామంటే మాత్రం అందుకు అభ్యంత‌రం పెట్టే చ‌ట్టం లేదు. వ‌యోజ‌నులైన ఇద్ద‌రు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో చేసుకునే శృంగారం చట్ట‌ప‌రంగా కూడా నేరం కాదు. గ‌తంలో అయితే ఇలా హోట‌ళ్ల‌లో క‌లిసేవారి మీద దాడులు జ‌రిపి పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు చ‌ట్ట నిబంధ‌న‌ల‌తో పాటు సంస్కృతి కూడా మారిపోయింది. తామిద్ద‌రికీ అభ్యంత‌రం లేన‌ప్పుడు చ‌ట్టానికి వ‌చ్చిన ఇబ్బందేంట‌ని ప‌లువురు కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ వెసులుబాటు ల‌భించింది. అదే ఇప్పుడు ఈ న‌యా సంస్కృతికీ దారితీసింది.

ప్రీమారిటల్‌ కౌన్సిలింగ్‌ అవసరం
యువతీయువకులకు వివాహానికి ముందే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం. స్త్రీ పురుషులకు లింగసామర్థ్య పరీక్షలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వానికి మద్రాస్‌ హైకోర్టు చేసిన సూచన చాలా హర్షణీయం. కేంద్రప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. అయితే, వాటిని నిర్భందంగా చేయించడం కుదరదు. అందుకే, సమాజంలో ముందుగా మార్పురావాలి. పెళ్లికి ముందు యువతీయువకులు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. చాలామంది వివాహమైన కొద్దిరోజులకే విడాకులు తీసుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం లైంగిక సామర్థ్య లోపం.
చాలామంది యువకులు పైకి చూడ్డానికి చాలా బావుంటారు. అయితే, పెళ్లయిన తర్వాత వారిలో లోపాలు బైట పడతాయి. భార్యను సంతోషపెట్టలేక పోవడం, లైంగిక సామర్థం లేకపోవడంతో పాటు రకరకాల కారణాలు, జబ్బులు బైటపడుతున్నాయి. ఆడవారిలో కూడా చాలా అపోహలుంటాయి. కొంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రుల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. వారికి సెక్స్‌ పైన ఆసక్తి ఉండదు. వారు భర్తకు సహకరించరు. భయంతో ముడుచుకు పోవడం, సెక్స్‌ను ఏవగించుకోవడం చేస్తుంటారు. దీంతో, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

పెళ్లికి ముందు ప్రీమారిటల్ కౌన్సిలింగ్ టెస్టు ద్వారా లైంగిక సామర్థ్యంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, జెనిటిక్ సమస్యలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లడ్‌గ్రూపులను బట్టి కూడా వివాహాలు నిర్ణయించాల్సి ఉంటుంది. వ్యతిరేక స్వభావం కలిగిన బ్లడ్ గ్రూపుల వారు వివాహం చేసుకుంటే, పుట్టబోయే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు పుట్టిన వెంటనే వారికి పచ్చకామెర్లు వచ్చే అవకాశం ఉంది.

ఈకాలంలో ఒత్తిడి అన్నది అందరికీ ప్రధాన సమస్యగా మారింది. ఒత్తిడి ప్రభావం లైంగిక జీవితంపై చూపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌తో పాటు పలు రంగాల్లో పనిచేస్తున్న యువతీయువకులపై స్ట్రెస్‌ ఎక్కువగా ఉంటోంది. ఆ ప్రభావం పురుషులపై తీవ్రంగా ఉంటోంది. స్ట్రెస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నవారి లైంగిక సామర్థ్యం దెబ్బతింటోంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఎవరికి వారు రియలైజ్ కావాలి. పెళ్లికి ముందు స్వచ్ఛందంగా లైంగిక సామర్థ్య పరీక్షలను చేయించుకోవాలి. సమస్యలను గుర్తిస్తే చిన్న చిన్న ట్రీట్‌మెంట్స్‌తోనే వాటిని నయం చేయవచ్చు. ఆ తర్వాత వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడవపచ్చు. పెళ్లికి ముందు లైంగిక పరీక్షలు చేయించుకోక పోవడం వల్ల ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భర్తకు సెక్స్ సామర్యం లేదని భార్య, భార్య సహకరించడం లేదని భర్త గొడవ పడి విడిపోతున్నారు. ప్రీమారిటల్‌ కౌన్సిలింగ్ ద్వారా ఈ సమస్యల నుండి బైట పడే అవకాశం ఉంది.

డా. సమరం
ప్రముఖ సెక్సాలజిస్ట్, సైకాలజిస్ట్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News